ఆహారం తీసుకుంటే బలం వస్తుంది సరే. మరి శరీరం సరైన మార్గంలో నిలబడాలంటే ఏం చేయాలన్నదే చాలా మంది అనుమానం. దీనికి వ్యాయామమే సరైన మార్గం అన్నది వైద్యుల మాట. అయితే అందరికీ ఒకే విధమైన వ్యాయామం పనికి రాదు. ఎవరెవరికి ఎలాంటి వ్యాయామం మంచిది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ సమస్యల నుంచి బయటపడవచ్చు.
ప్రతి రోజూ ఆహారం తీసుకోవడం ఎంత ముఖ్యమో, వ్యాయామం చేయడం కూడా అంతే ముఖ్యం. అలా అని ఇష్టం వచ్చినట్లు వ్యాయామం చేసినా ఇబ్బందే. ఎందుకంటే దేనిలోనూ అతి పనికిరాదు. కొన్ని వ్యాయామాలు ఆరోగ్యకరమైన శారీరక ధారుఢ్యం కోసమైతే, మరిన్ని వ్యాయామాలు మానసిక ఆరోగ్యం కోసం ఉపయోగపడతాయి. రోజూ 30 నుంచి 45 నిముషాల పాటు వ్యాయామం చేయడం వల్ల శారీరక మరియు మానసిక ఆరోగ్యం బావుంటుంది. భవిష్యత్ లో అల్జీమర్స్ లాంటి సమస్యలు దరి చేరవు. ముఖ్యంగా ఆందోళనను తగ్గించడంలో వ్యాయామం పాత్ర కీలకమైనది. దీని వల్ల ప్రశాంతత చేకూరడమే కాదు, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
ప్రధానంగా చెప్పుకోవాలంటే బరువు నియంత్రణంలో వ్యాయామం పాత్ర చాలా పెద్దది. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిని పెరగకుండా కట్టడి చేస్తుంది. ఊబకాయం, మధుమేహం, రక్తపోటు లాంటి సమస్యలు రాకుండా ఇది కాపాడుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. రోగ నిరోధక వ్యవస్థను మెరుగు పరుస్తుంది. నిత్యం ఉదయం కాసేపు నడవడం, యోగా లాంటి వ్యాయామాలు చేయడం వల్ల రోజంతా చక్కగా ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది. నిపుణులైన వారి సలహాల మేరకు మనకు ఎలాంటి వ్యాయామం మంచిదో తెలుసుకుని చేయాలి.
చాలా మంది వ్యాయామం కేవలం శారీరక ప్రయోజనం కోసం మాత్రమే అనుకుంటారు. నిజానికి వ్యాయామం మానసిక ఆరోగ్యాన్ని మరింత మెరుగు పరుస్తుంది. మెదడులో నిత్యం రసాయనాల విడుదల జరుగుతూ ఉంటుంది. వ్యాయామం చేయడం వల్ల వీటి విడుదల మెరుగవుతుంది. వ్యాయమం వల్ల మానసిక ఉత్తేజాన్ని అందించే హార్మోన్ల ఉత్పత్తి పెరుగుతుంది. ఇవి ఒత్తిడిని తగ్గించి, మనం ఆరోగ్యంగా, ఆనందంగా ఉన్నామన్న భావనను పెంచుతాయి. మరో కీలకమైన అంశం ఏమిటంటే, ఏ వ్యాయామంలో అయినా కండరాలను ఓ క్రమ పద్ధతిలో ఆపకుండా కదపాల్సి ఉంటుంది. ఆ సమయంలో మెదడును ఉత్తేజ పరిచే సెరటోనిన్ అనే హార్మొన్ విడుదలవుతుంది. ఈ హార్మోన్ వల్ల ప్రతి కూల ఆలోచనలు దరి చేరవు. అదే విధంగా శారీరక శ్రమ వల్ల మెదడులో రక్త ప్రసరణ మెరుగుపడి, మెదడు పని తీరు మెరుగు పడుతుంది. ఊపిరితిత్తులు సమర్థంగా పని చేస్తాయి. ఫలితంగా వయసు పెరుగుతున్నా మెదడు చురుకుదనంలో ఎలాంటి మార్పు రాదు. అందుకే రోజూ ఆహారంతో పాటు వ్యాయామాన్ని తప్పనిసరి చేసుకోవాలి.
చాలా మంది ఇంట్లో పనులు చేసుకుంటూ చాలా నడుస్తున్నాం, చాలా శ్రమపడుతున్నాం అని చెబుతూ ఉంటారు. ఇంటి పనుల్లో చురుగ్గా ఉండడం తప్పేమీ కాదు. అయితే ఇవి వ్యాయామానికి సాటిరావు. అయితే వ్యాయామం పేరుతో శరీరాన్ని తీవ్ర శ్రమకు గురి చేస్తే మాత్రం ఇబ్బందులు తప్పవు.. పరిగెత్తడం లాంటి వ్యాయామాలు చేస్తున్నప్పుడు త్వరగా అలసి పోతుంటే శరీరం అధిక శ్రమకు గురువుతున్నట్లు గుర్తించాలి. ఇలాంటి సమయంలో కాస్తంత విశ్రాంతి కూడా తప్పనిసరి.
మిత వ్యాయామం చక్కని నిద్రను అందిస్తే, అతి వ్యాయామం నిద్రను దూరం చేస్తుంది. అతి వ్యాయామం వల్ల రోజు వారీ పనులు చేసుకోవడం సమస్యగా మారుతుంది. అతి వ్యాయామం గుండెపోటు సమస్యలను కూడా పెంచుతుంది. స్త్రీలలో రుతుక్రమం తప్పడం లాంటి సమస్యలు ఎదురౌతాయి. రోజుకు అరగంట పాటు వారంలో 5 రోజులు వ్యాయామం తప్పనిసరి. అదే సమయంలో వారానికి ఏడున్నర గంటలకు మించి వ్యాయామం చేసే వారిలో ఒత్తిడి పెరిగి, కుంగుబాటు, ఆందోళన వంటి సమస్యలు ఎదురౌతున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి.