Causes of Indigestion: అజీర్ణం సమస్యతో బాధపడుతున్నారా .. అజీర్తికి కారణాలు ఇవే..!

By manavaradhi.com

Published on:

Follow Us
Weak Digestion

ఆరోగ్యమనేది మన చేతుల్లోనే ఉంది అనే మాటని మనం చాలాసార్లు వింటూ ఉంటాం. అవును… ఆరోగ్యమంటే మంచి అలవాట్లు, చక్కని జీవనశైలి. ఆరోగ్యంగా ఉండాలంటే నిరంతరం జాగ్రత్తగా ఉండాల్సిందే. శరీరానికి తగిన ఆహారం తీసుకోవటం, తగిన విశ్రాంతినివ్వటం, తగినంత నిద్రపోవటం …ఇలా తేలిగ్గా కనిపించే జాగ్రత్తలే రేపటి మన ఆరోగ్యాన్ని కాపాడతాయి.

మనకు ఇష్టమైన, రుచికరమైన ఆహారం తింటున్నపుడు ఆనందంగానే ఉంటుంది. కానీ అది అరగకుండా ఇబ్బంది పెడుతుంటే మాత్రం ఆ ఆనందం కంటే ఈ బాధే ఎక్కువగా ఉంటుంది. శరీరం శక్తిమంతంగా ఉండాలంటే తిన్నది ఒంటికి పట్టాలి. జీర్ణవ్యవస్థలో ఎలాంటి లోపాలు, సమస్యలు లేనపుడే అది సాధ్యమవుతుంది. ఒక్కోసారి లోపల ఎలాంటి సమస్య లేకపోయినా, మనం ఆహారాన్ని సక్రమంగా తీసుకోకపోవటం వలన అజీర్తి కలుగుతుంది. చాలావరకు అజీర్తి అనేది వచ్చిన కొన్ని గంటల్లో తగ్గిపోతుంటుంది. తేలికపాటి ఉపశమన పద్ధతులతో దీన్ని తగ్గించుకోవచ్చు. కానీ ఇది దీర్ఘకాలం వేధించినపుడు మాత్రం తప్పకుండా అందుకు కారణం తెలుసుకుని మందులు వాడటం అవసరం.

ఆహారాన్నిచక్కగా నమిలి తినటం, తగినంత మాత్రమే తీసుకోవటం అనేది కూడా ఒక కళే. కానీ అన్నివేళలా ఇది సాధ్యం కాదు. కొన్నిసార్లు టైం లేదంటూ హడావుడిగా నోట్లో కుక్కుకున్నట్టుగా తింటుంటాం. కొన్ని సందర్భాల్లో పనిలో పడి భోజనం వేళ దాటిపోయాక ఎప్పుడో గుర్తువచ్చినపుడు తింటాం. మరి కొన్ని సార్లు నచ్చిన వంటలు ఉన్నపుడు అవసరానికి మించి తింటాం. ఇలాంటి సందర్భాల్లో మనం మన జీర్ణవ్యవస్థ గురించి అసలు పట్టించుకోము. మన జీర్ణవ్యవస్థ ఒక మిషన్ లాంటిది. దానికి కొన్ని పద్ధతులు, పరిమితులు ఉన్నాయి. మనం వాటిని పట్టించుకోకపోతే, అనారోగ్యాలను కొనితెచ్చుకున్నట్టే అవుతుంది. ముఖ్యంగా ఇలాంటి సందర్భాల్లో తలెత్తే ప్రధాన సమస్య అజీర్తి. మనం పట్టించుకోని అనేక విషయాలే అజీర్తికి కారణమవుతుంటాయి. ఆహారం వేగంగా తినటం నుండి…ఆల్కహాల్ వరకు అజీర్తికి కారణాలు అనేకం ఉన్నాయి.

మనం తినే తిండిలో చాలా రకాల పదార్థాలు ఉంటాయి. ఇవన్నీమన నోరు, గొంతు అన్నవాహికల ద్వారా జీర్ణాశయాన్నిచేరతాయి. అయితే ఈ జీర్ణక్రియ మొత్తం ఒక పెద్ద ప్రక్రియ. ఆహారం జీర్ణమయ్యే లోపు పలు రసాయనిక మార్పులకు లోనవుతుంది. ఆహారాన్ని జీర్ణమయ్యేలా చేయటంలో పైత్యరసం, జఠరరసం, క్లోమరసం, ఆంత్రరసం అనే జీర్ణరసాలు తోడ్పడతాయి. పైత్యరసంలో తప్ప మిగిలిన అన్నింటిలో ఎంజైములు అనేవి ఉంటాయి. ఇవే ఆహారం పలు రకాలుగా మారుతూ జీర్ణం అయ్యేలా చేస్తాయి. ఈ జీర్ణక్రియలో పిండిపదార్థాలు చక్కెరలుగా, నూనెలు ఫ్యాటీ ఆసిడ్లుగా, మాంసకృత్తులు అమినో ఆసిడ్లుగా మారతాయి. ఇలా మారిన తరువాతే అవి శరీరానికి ఉపయోగపడతాయి. జీర్ణక్రియ మొదట మన నోట్లోని లాలాజలంలో మొదలవుతుంది. ఆహారం లాలాజలంతో కలిసి పిండిపదార్థంగా తయారై, అక్కడి నుండి జీర్ణకోశంలోకి చేరి, అక్కడ రకరకాల జీర్ణరసాలతో కలిసి ద్రవరూపంలోకి మారి చిన్నపేగుల్లోకి వెళుతుంది. చిన్నపేగుల గోడల ద్వారా రక్తంలో కలుస్తుంది. ఈ ప్రక్రియ మొత్తం సజావుగా సాగిపోతుంటే మనకు ఎలాంటి సమస్యలు ఉండవు. అలా జరగనపుడే సమస్యలు వస్తాయి. ఆహారంలో తేడాలు, అనారోగ్యకరమైన అలవాట్లు అజీర్తిని తెచ్చిపెడతాయి.

ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవటం, వేగంగా తినటం, అధిక కొవ్వు మసాలలతో కూడిన ఆహారం తీసుకోవటం, సిగరెట్, ఆల్కహాల్ అలవాట్లు, అధిక ఒత్తిడికి గురికావటం ఇలాంటి వాటివలన అజీర్తి సమస్యలు వస్తాయి. ఇవి కాకుండా ఇతర అనారోగ్యాలకోసం వాడుతున్న మందుల వలన, పొట్టలో సమస్యలు, వ్యాధుల వలన కూడా ఆహారం జీర్ణం కాకుండా ఇబ్బంది పెడుతుంది. కొన్నిసార్లు ఈ కారణాలేమీ లేకుండా కూడా అజీర్తి సమస్య వేధించవచ్చు.

అజీర్తి చేసినపుడు జీర్ణాశయం ఎర్రగా పొక్కటం, జీర్ణాశయంలోని ఆమ్లం అన్నవాహికలోకి ఎగదట్టటం లాంటి ఇబ్బందులు ఉంటాయి. అందుకే కడుపు నొప్పి, కడుపులో గుండెల్లో మంట, పుల్లని త్రేన్పులు, నోట్లో నీళ్లూరటం, ఆకలిలేకపోవటం, ఆపాన వాయువులు ఎక్కువగా పోవటం, కొంచెం తినగానే కడుపు నిండినట్టుగా అనిపించడం లాంటి లక్షణాలు కనబడుతుంటాయి. సాధారణంగా అజీర్తి అనేది ఆహార విహారాల్లో మార్పులు చేసుకోవటంతో, కొన్నిరకాల జాగ్రత్తలు తీసుకోవటంతో అదుపులో ఉంటుంది. లక్షణాలను, పేషంటుకున్న అలవాట్లను బట్టి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వైద్యులు సూచిస్తారు. అయితే చాలా సందర్భాల్లో అజీర్తిని అశ్రద్ధ చేయడమే జరుగుతుంది.

చాలామంది లక్షణాలు తీవ్రంగా మారేవరకు పట్టించుకోకుండా తాత్కాలిక మందులు వేసుకుంటూ గడిపేస్తుంటారు. అయితే అన్నిసార్లూ అజీర్తిని అశ్రద్ధ చేయటం మంచిది కాదు, అజీర్తి తరచుగా వస్తున్నా, దీర్ఘకాలంగా వేధిస్తున్నా, పెద్ద వయసు వారిలో ఈ సమస్య ఉన్నపుడు తప్పనిసరిగా డాక్టరుని సంప్రదించాలి. అజీర్తితో పాటు ఆకలి లేకపోవటం, వాంతులు కావటం, వాంతుల్లో రక్తం పడటం, విరేచనం నల్లగా కావటం, మింగటంలో ఇబ్బంది, కారణం లేకుండా బరువు తగ్గిపోవటం, తీవ్రమైన కడుపు నొప్పి ఇలాంటి సమస్యలు ఉంటే అశ్రద్ధ చేయకుండా డాక్టరు వద్దకు వెళ్లాలి. అజీర్తి లక్షణాలను బట్టి వైద్య పరీక్షలు చేయించి చికిత్సని అందిస్తారు.

కొన్ని సందర్భాల్లో కొన్నిరకాల వ్యాధుల లక్షణాలు అజీర్తి రూపంలో బయటపడవచ్చు. కనుక దీన్ని అశ్రద్ధ చేయకూడదు. ఒక్కసారి ఇలాంటి ఇబ్బందులు తలెత్తితే తీసుకునే ఆహారం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. టీ కాఫీలు ఎక్కువగా తాగే అలవాటు ఉంటే తగ్గించాలి. ఆల్కహాల్, సిగరెట్లకు దూరంగా ఉండాలి. కొవ్వు పదార్థాలు అధికంగా తినటం మానేమాలి. ఆహారంలో కారం మసాలాలు తక్కువగా తీసుకుంటూ పులిసిన మజ్జిగ పెరుగు లాంటివాటికి దూరంగా ఉండాలి. ఆకుకూరలు, కాయగూరలు ఎక్కువగా తీసుకుంటూ వేపుడు కూరలు తగ్గించాలి. వేళకు తినటం, నిదానంగా తినటం అలవాటు చేసుకోవాలి.

ఆందోళన మానసిక ఒత్తిడికి దూరంగా ఉండాలి. నిద్ర పోవడానికి కనీసం మూడుగంటల ముందు భోజనం ముగించాలి. అజీర్తి సమస్య ఉన్నపుడు తలకింద దిండుని బాగా ఎత్తుగా పెట్టుకుని పడుకోవటం మంచిది. ఇలాంటి జాగ్రత్తలతో చాలావరకు సమస్య తగ్గుతుంది. తిరిగి రాకుండానూ ఉంటుంది. అజీర్తికి కారణాలు అపసవ్య అలవాట్లే అయితే ఈ జాగ్రత్తలతో వెంటనే తగ్గుతుంది. తగ్గకపోతే వైద్యుని సంప్రదించాలి.

అజీర్తి అనేది చాలావరకు జీవనశైలి లోపాల వల్లనే వస్తుంది. దాన్ని గుర్తించి తగ్గించుకునే శక్తి మన చేతుల్లోనే ఉంటుంది. జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉన్నపుడే మనకు పనిచేయడానికి తగిన శక్తి అందుతుంది. శరీరం ఉత్సాహంగా ఉంటుంది. కనుక అజీర్తి సమస్య…అనేది మన పొట్ట మనతో తన బాధని చెప్పుకోవటంగా గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

Leave a Comment