Walking : వ్యాయామం కోసం నడక సరిపోతుందా?

By manavaradhi.com

Updated on:

Follow Us

ఎప్పుడైనా, ఎక్కడైనా చెయ్యడానికి వీలైన, తేలికైన వ్యాయామం నడక. రోజూ ఉదయం కొద్దిసేపు నడవడం వల్ల మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. రోజు ఉదయం, సాయంత్రం ఒక గంట సేపు నడిస్తే చాలు ఎన్నో వ్యాధులకు చెక్ పెట్టొచ్చు అంటున్నారు వైద్యులు. మెదడు మీద ఒత్తిడి ఉండదు. బి.పి లాంటివి దరి చేరవు. ప్రతి ఉదయం కేలరీలు ఖర్చు కావడం వల్ల కొవ్వు చేరడం, బరువు పెరగడమనే సమస్యలే ఉండవు. కొద్దిసేపు చురుకుగా నడవటం వల్ల మనిషి మూడ్‌ మారుతుందని, మనస్సు ఉత్తేజకరంగా తయారవు తుందని ప్రయోగాత్మక పరిశీలనలలో ఋజువైంది.

శారీరక శ్రమ లేనివారు ఈ నడక చేయడం మంచి ఉత్తమమైన మార్గంగా చెప్పవచ్చు. నడవడం కూడా ఓ పద్ధతిలో ఉండాలి. మొదటి 5 నిముషాలు చాలా మెల్లగా నడవాలి. దీని వల్ల శరీరం వ్యాయామానికి అనుకూలం అవుతుంది. కండరాలు, కీళ్ళు కదులుతాయి. ఒకే సారి వేగంగా నడిస్తే కండరాలు పట్టేసి, కీళ్ళనొప్పుల లాంటి ఇబ్బందులు ఎదురౌతాయి. 5 నిముషాల తర్వాత 30 నిముషాల సేపు వేగంగా నడవాలి. నడకలో వేగం మూలంగా ఆయాసం వంటివి రాకుండా చూసుకోవాలి. వేగంగా నడుస్తూ వెంటనే ఆపకూడదు. మెల్లిమెల్లిగా వేగం తగ్గించుకుంటూ రావాలి. అలా తక్కువ వేగంతో 5 నిముషాలు నడవాలి. దీని వల్ల కండరాలు పట్టేయడం లాంటివి ఉండవు. ప్రతి వారం సమయాన్ని పెంచుతూ 30 నిముషాలు పెంచాలి. శారీరకంగా బలం ఉన్న వారు 40 నుంచి 60 నిముషాలు నడవ వచ్చు. కనీసం 30 నిముషాలైనా నడవడం ఎన్నో సమస్యల నుంచి ఉపశమనం ఇస్తుంది.

నడిచేటప్పుడు కొన్ని జాగ్రత్తలు సైతం తప్పనిసరి. అయాసం వచ్చే వరకూ నడవడం అనేది మంచి పద్ధతి కాదు. కొందరు నడక మొదలు పెట్టినప్పుడు మరింత ఉత్సాహంతో నడుస్తుంటారు. కానీ మన శక్తి మేరకే నడవడం అత్యంత అవసరం. మీ రోజువారీ వ్యాయామం నడక అయితే వాటికి అనుకూలంగా ఉండే రన్నింగ్‌ షూలను ఎంచుకోండి. ఇవి కూడా బాగా మెత్తగా ఉండాలి. నడక మొదలు పెట్టే ముందు కనీసం పది, పన్నెండు నిముషాలు వామప్ చేయాలి. ఆ తర్వాత వేగంగా నడవాలి. గంటకు ఆరు కిలోమీటర్ల వేగంతో నడిస్తే మంచి వేగంతో నడిచినట్లు లెక్క. మొదట్లో గంటకు నాలుగు కిలోమీటర్లు నడవగలిగితే చాలు.

Leave a Comment