దంతాలు శుభ్రంగా ఆరోగ్యంగా ఉంచుకోవాలి. చాలా మంది దంతాల విషయంలో చాలా అశ్రద్ధ చేస్తుంటారు. ప్రతి దానికీ వాటిని ఎడాపెడా వాడేస్తుంటాం. సీసా మూతలు తియ్యటం దగ్గరి నుంచీ బట్టలు చింపటం వరకూ పళ్లతో ఎన్నో పనులు చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల దంతాలు తేలికగా దెబ్బతినిపోతాయి. కొన్ని సార్లు మళ్లీ పనిచేయ్యలేనంతగా పొడైపోతాయి.
మనలో చాలామంది దంతాల ఆరోగ్యం పట్ల అస్సలు శ్రద్ధ ఉండదు. ఉదయం నిద్ర లేచిన తర్వాత పేరుకు బ్రష్ చేసేసే అలవాటే ఎక్కువ మందిలో కనిపిస్తుంది… ఇది మినహా పంటి ఆరోగ్యం గురించి పెద్దగా శ్రద్ధ ఉండదు. పంటి సంరక్షణ గురించి అవగాహన కూడా ఉండదు. కానీ, దంతాలు ఆరోగ్యంగా ఉంటేనే ఆరోగ్యంగా ఉండగలరు. నోటి ఆరోగ్యం, శారీరక ఆరోగ్యంలో దంతాలు కూడా అత్యంత ప్రధానమైనవి. చిన్నపాటి శ్రద్ధ, అవగాహనలతో…ఎన్నో రకాల దంత అనారోగ్యాలను రాకుండా నివారించవచ్చు. చాలా మందిలో గోళ్ళు కొరకడంసాధారణ అలవాటుగా ఉంటుంది. గోర్లను కొరకడం వలన దంతాలు అధిక ఒత్తిడికి లోనవడం వలన అనేక రకాల దంత సంబంధ ఆరోగ్య సమస్యలు, ముఖ్యంగా దవడ కు సంబంధించిన సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి.
కొందరు ఏదైనా ఆహారాన్ని గంటల తరబడి నములుతూ ఉంటారు ముఖ్యంగా నాన్ వెజ్ తీసుకునే సమయాలలో, మరియు గట్టిగా ఉండే పదార్ధాలు నములుతున్నప్పుడు ఇలా చేస్తుంటారు. ఇలా అధికంగా నమలడం వలన, దంతాలు ఒత్తిడికి లోనై, పళ్ల మద్య సందులు, చిగుళ్ళ వాపు, వంటి సమస్యలు అధికమవుతాయి. సిట్రస్ జాతి పండ్లు ఆరోగ్యానికి మంచిది. కానీ ఇవి తీసుకున్న వెంటనే నోరుకడిగే అలవాటు చేసుకోవాలి , లేక పోతే ఈ సిట్రస్ సమ్మేళనాలు బాక్టీరియా తో చర్య జరిపి పంటి ఏనామిల్ ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తాయి. దీని కారణంగా సెన్సిటివిటీ, కావిటీలు, దంత క్షయం వంటి సమస్యలు వస్తాయి.
మౌత్ వాష్‌ల అధిక వాడకం వలన తీవ్రమైన నోటి ఆరోగ్య సమస్యలు కలిగే అవకాశాలు ఉన్నాయి. నోరు పొడిబారడానికి కూడా దారి తీస్తుంది. ఇది కావిటీస్ మరియు చెడు శ్వాసలను తగ్గించక పోగా, పంటి సున్నితత్వాన్ని కలిగిస్తుంది కూడా. కాబట్టి మౌత్ వాష్ ఎక్కువ సార్లు చేయకండి. కెఫీన్ దంతాలకు మంచిది కాదు, దంతాలమీద గారలు ఏర్పడడం, రంగు తగ్గడం, తద్వారా ఆరోగ్య సమస్యలు తలెత్తడం వంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి కాఫీ తీసుకున్న తర్వాత నోటిని శుభ్రపరచుకోవడం మంచిది. లేదా కెఫీన్ ని దూరం ఉంచడం కూడా మంచిది. అదేవిధంగా అధిక వేడి గల పదార్ధాలు కూడా తీసుకోవడం మంచిది కాదు. సోడా దంతాలకు అత్యంత ప్రమాదకారి. ముఖ్యంగా కార్బొనేటెడ్ చక్కెర స్థాయిలు కలిగిన సోడాలు, కూల్ డ్రింక్స్ తీసుకోవడం మూలంగా స్వల్పకాలంలోనే అనేక దంత సమస్యలను ఎదుర్కొనవలసి వస్తుంది.
చక్కెర తో కూడిన చాక్లెట్లు తినడం అధికమైతే అనేక దంత సమస్యలు చుట్టుముట్టాడుతాయి. స్వీట్స్ , కాండీలు వలన వీటిలో చక్కెర తత్వాలు బాక్టీరియాతో అధికంగా చర్యలను జరపగలవు. తద్వారా పళ్ళు ఏనామిల్ లోపానికి గురై పుచ్చడం,కావిటీస్, సెన్సిటివిటీ లకు గురికావడం వంటి సమస్యలను ఎదుర్కొంటాయి. కాబట్టి వీటిని తగ్గించడం మంచిది. లేదా ఇవి తీసుకున్నప్పుడు నోటిని శుభ్రంగా కడగడం అలవాటుగా చేసుకోవాలి.ఇలాంటి సమస్యలన్నీ రాకుండా ఉండాలంటే దంతాల శుభ్రత పట్ల శ్రద్ధ తీసుకోవాల్సిందే.
దంతాల ఆరోగ్యం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ?
దంత ఆరోగ్యంలో కీలకమైనది దంతాల పరిశుభ్రత. రోజుకి రెండు సార్లు దంతధావనం తప్పనిసరిగా చేయాలి. దంతాలకు ఆహారం అతుక్కో కుండా చూసుకోవాలి. తినగానే తప్పనిసరిగా పుక్కిలించాలి. ఆరు నెలల నుంచి సంవత్సరానికి ఒకసారి దంతాలను డాక్టర్‌చేత స్కేలింగ్ చేయించుకోవాలి. దీనివల్ల దుర్వాసన రాదు. దంత క్షయాన్ని నివారించ వచ్చు. పొగతాగడం, ఆల్కాహాల్, గుట్కా లాంటి అలవాట్లు దంతాలకు శత్రువులు. మనం తీసుకునే ఆహారాన్ని బట్టి బలమైన దవడలు, దంతాలు ఏర్పడతాయి. కాబట్టి మంచి ఆహారమే దంతాలకు క్షేమకరం.
తాజా పండ్లు ఎక్కువగా తినాలి. క్యాల్షియం ఎక్కువగా ఉన్న పదార్థాలను తీసుకోవాలి. చాలా మంది బ్రష్‌ను త్వరగా మార్చరు. ఎప్పటిదో పాత బ్రష్‌తోనే నెట్టకొస్తుంటారు. కానీ పాత బ్రష్ వాడటం వల్ల హానికారక బ్యాక్టీరియా వల్ల ఇన్ఫెక్షన్లు తలెత్తే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రతి మూడు నెలలకొసారి బ్రష్‌ను మార్చితే మంచిది. ఎందుకంటే పాత బ్రష్‌లు సమర్థవంతంగా పళ్లను శుభ్రం చేయలేవు.మరియు సున్నితమైన బ్రెసిల్స్ ఉండేలా బ్రష్ ఎంచుకోండి. దంతాలు చిగుళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే క్రమం తప్పకుండా దంతవైద్యుని సంప్రదిస్తూ నోటిని శుభ్రంగా ఉంచుకోవాలి.
దంతాలను సంరక్షించుకోవటమన్నది మన చేతుల్లోనే ఉందన్న వాస్తవాన్ని గుర్తించాలి. ప్రస్తుతం చాలామంది లేనిపోని అలవాట్లతో పళ్లను చేజేతులా పాడుచేసుకుంటున్నారు. జీవితాంతం ఆరోగ్యంగా ఉండాల్సిన పళ్లను 20, 30 ఏళ్లకే పోగొట్టుకుంటున్నారు. అందుకే అలవాట్ల విషయంలో అంతా జాగ్రత్తగా ఉంటూ దంతసిరి పరిరక్షించుకోవాలి.