Kidney health: మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే!

By manavaradhi.com

Published on:

Follow Us
Kidney Health

అత్యంత సున్నితమైన, ముఖ్యమైన అవయవాల్లో మూత్రపిండాలు కూడా ఒకటి. ఇవి మన రక్తంలోని మలినాలన్నింటినీ వడకడుతూ… శరీరానికి అత్యంత రక్షణ కలిగిస్తాయి. అందుకే వీటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఒకసారి కిడ్నీల పనితీరు మందగిస్తే మళ్లీ పూర్తిగా నయం చేయడం చాలా కష్టం. పైగా డయాలసిస్‌ లాంటి చికిత్సలకు ఎంతో ఖర్చవుతుంది. ఇక దెబ్బతిన్న మూత్ర పిండాన్ని మార్పిడి చేయించుకోవాలంటే దాతలు అంత సులభంగా దొరికే పరిస్థితి లేదు. అదే సమయంలో అనారోగ్యకరమైన జీవనశైలి, అలవాట్ల కారణంగానే చాలామంది అతి తక్కువ వయసులోనే కిడ్నీ సమస్యల బారిన పడుతున్నారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

దీర్ఘకాలిక వ్యాధులు, జీవన విధానం , చెడు అలవాట్ల కారణంగా మూత్ర పిండాల పనితీరులో చాలా మార్పు వస్తుంది. కాబట్టి .. కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు వాటిపై శ్రద్ధ వహించడం చాలా అవసరం . ముఖ్యంగా రక్తపోటును అదుపులో ఉంచుకోవాలి.. రక్తపోటు అధికంగా ఉన్న వారిలో మూత్రపిండాలపై విపరీతమైన ప్రభావం పడుతుంది. ఒత్తిడికి లోనయితే . .. కిడ్నీలు చెడిపోయే అవకాశం ఉంది.

డయాబెటిక్‌ రోగులకు కిడ్నీ సంబంధిత వ్యాధులు వస్తే వారి ఆరోగ్య పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారే ప్రమాదం ఉంది. అలాంటి వారు రక్తంలో చక్కెర స్థాయులను అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. అదేవిధంగా క్రమం తప్పకుండా కిడ్నీ స్ర్కీనింగ్‌ పరీక్షలు చేయించుకోవాలి. తద్వారా మూత్రపిండాల్లో ఏదైనా సమస్యలు వస్తే ప్రారంభంలోనే గుర్తించవచ్చు. వ్యాధుల తీవ్రతను బట్టి చికిత్స తీసుకోవచ్చు. ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు కొంతమంది వైద్యులను సంప్రదించకుండా నాన్‌ ప్రిస్ర్కిప్షన్‌ మాత్రలను వాడుతుంటారు.

ఒకటి, రెండు సందర్భాల్లో అయితే ఫర్వాలేదు కానీ… దీర్ఘకాలికంగా ఇలా చేస్తే మాత్రం మూత్రపిండాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. తగినన్ని నీళ్లు తాగడం మూత్రపిండాల ఆరోగ్యంలో ఎంతో ముఖ్య పాత్ర పోషిస్తుంది. రోజుకు కనీసం 8-10 గ్లాసుల మంచి నీరు తాగాలి. అదేవిధంగా పండ్ల రసాలను కూడా ఎక్కువగా తీసుకోవాలి. దీంతో మూత్రపిండాల్లోని సోడియం, యూరియా లాంటి విష పదార్థాలు మూత్రం ద్వారా బయటకు వెళతాయి. తద్వారా కిడ్నీలో రాళ్లు ఏర్పడడం వంటి దీర్ఘకాలిక సమస్యల నుంచి రక్షణ పొందవచ్చు.శారీరకంగా, మానసికంగా ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేనప్పటికీ అప్పుడప్పుడూ పూర్తి బాడీ చెకప్‌ చేయించుకోవడం ఎంతో మేలంటున్నారు ఆరోగ్య నిపుణులు. దీనివల్ల కిడ్నీ వ్యాధులతో పాటు మరేమైనా ఆరోగ్య సమస్య ఉన్నట్లయితే ముందుగానే గుర్తించి చికిత్స తీసుకోవచ్చు. ఏడాదికి కనీసం ఒకటి రెండు సార్లైనా పూర్తి బాడీ చెకప్‌ చేయించుకోవాలి.

వంటకాలు రుచిగా ఉండాలంటే సరిపడినంత ఉప్పు వేయాల్సిందే. అదే కాస్త ఎక్కువైతే మాత్రం తినడానికి కూడా ఎంతో ఇబ్బందిపడాల్సి వస్తుంది. ప్రత్యేకించి అధిక రక్తపోటుతో మూత్రపిండాల వంటి సున్నితమైన శరీర భాగాలకు హాని కలిగే అవకాశం అధికంగా ఉంది. కాబట్టి ఆహారంలో ఉప్పుని మితంగా తీసుకుంటే మూత్రపిండాల సమస్యల నుంచి సాధ్యమైనంత వరకు గట్టెక్కినట్లే. ఇక బయట దొరికే జంక్‌ఫుడ్‌, ప్రాసెస్డ్‌ ఆహార పదార్థాలు, శీతల పానీయాల్లో ఫాస్ఫరస్ అధికంగా ఉంటుంది. వీటిని అధిక మొత్తంలో తీసుకుంటే మూత్రపిండాల పనితీరు మందగిస్తుంది.

ధూమపానం, మద్యపానం లాంటి వ్యసనాల కారణంగా శరీరంలో వ్యర్థ పదార్థాల సంఖ్య భారీగా పెరుగుతుంది. ఫలితంగా మూత్రపిండాలపై భారం పెరుగుతుంది.ప్రత్యేకించి సిగరెట్‌, గుట్కాల్లాంటి పొగాకు సంబంధిత పదార్థాలు అధికంగా తీసుకుంటే మూత్రపిండాలకు చేరే రక్త ప్రవాహం తగ్గుతుంది. ఇలా సాధారణం కంటే తక్కువ రక్తం కిడ్నీలకు చేరినప్పుడు కూడా కిడ్నీలు ఫెయిలయ్యే ప్రమాదం ఉంది.ప్రో బయోటిక్స్‌ అధికంగా ఉండే పెరుగు, మజ్జిగ లాంటి పదార్థాలు తీసుకోవడం ద్వారా మూత్రపిండాల పనితీరు మెరుగుపడుతుంది.

ప్రత్యేకించి వ్యర్థ పదార్థాలను వడకట్టే విషయంలో కిడ్నీల సామర్థ్యాన్ని ఇవి బాగా పెంచుతాయి. వీటితో పాటు పుచ్చకాయ, యాపిల్‌, ఉల్లిపాయలు, క్యాబేజీ, కాలీఫ్లవర్‌, స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీస్‌, వెల్లుల్లి, ఆలివ్ ఆయిల్‌, మొలకెత్తిన విత్తనాలు, మిరియాలు, చేపలు, ఎగ్‌వైట్‌ వంటి పదార్థాలు ఆహారంలో భాగం చేసుకుంటే మూత్రపిండాల వ్యాధులను సాధ్యమైనంత వరకు అరికట్టవచ్చు.

అధిక బరువు ఉండడమంటే శరీరంలో కొలెస్ట్రాల్‌ లాంటి టాక్సిన్లు చేరినట్లే. ఇవి శరీరంలోని అవయవాలపై తీవ్ర ఒత్తిడిని కలిగిస్తాయి. కాబట్టి వ్యాయామాన్ని జీవనశైలిలో భాగం చేసుకుని కొవ్వును కరిగించుకోండి. లేకపోతే ఊబకాయం, రక్తపోటు సమస్యలు వచ్చే ప్రమాదముంది. ఇవి క్రమంగా మూత్రపిండాల పనితీరుపై ప్రభావం చూపుతాయి. కాబట్టి ఫిట్‌నెస్ నిపుణులను సంప్రదించి వారంలో కనీసం ఐదుసార్లైనా ఎక్సర్‌సైజులు, వ్యాయామాలు చేయాలి. ప్రత్యేకించి యోగాను వ్యాయామంలో భాగం చేసుకుంటే కిడ్నీల ఆరోగ్యం మెరుగుపడుతుంది. రక్తపోటు, బ్లడ్ షుగర్ నియంత్రణలో ఉంటే.. మూత్ర పిండాల ఆరోగ్యం బాగుంటుందని గుర్తుంచుకోండి…. చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోండి.

Leave a Comment