Night Blindness : రేచీకటి చికిత్స ఉందా..? ఇది వస్తే ఏం చేయాలి..?

By manavaradhi.com

Published on:

Follow Us
Night Blindness

మన శరీర భాగాల్లో ప్రధానమైనవి కళ్లు. అలాంటి కళ్లతో చూడలేని పరిస్థితి వస్తే… మనుగడే కష్టతరమవుతుంది. గజిబిజి జీవితంలో వేళకు ఆహారం తీసుకోకపోవడం ఒక సమస్య అయితే… తీసుకున్న ఆహారంలో మన కళ్లకు అవసమరైన విటమిన్లు లేకపోవడం మరో సమస్యగా తయారవుతోంది. మనం తీసుకునే ఆహారంలో విటమిన్ ఏ లోపం కారణంగా సంభవించే వ్యాధే రేచీకటి… కాంతి తక్కువగా ఉన్న సమయాల్లో వస్తువులను చూడలేని పరిస్థితి. ఇది జబ్బు కాదు. కంటి లోపలుండే ఓ లోపానికి సంబంధించిన లక్షణం. విటమిన్ ఏ లోపం కారణంగా సంభవించే ఈ వ్యాధి… అలక్ష్యం చేస్తే అంధత్వానికి గురయ్యే ప్రమాదముంది.

మనం ఏ వస్తువును చూడాలన్నా కళ్లు అవసరం. అంతటి ప్రాధాన్యత కలిగిన కళ్లు… మసకబారిపోతే… చెప్పలేనంత ఇబ్బందిపడాల్సి వస్తుంది. అదేపనిగా టీవీ చూడటం… మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లను విరామం లేకుండా వినియోగించడం ప్రస్తుత రోజుల్లో సాధారణంగా మారిపోయింది. అదేవిధంగా విశ్రాంతి లేకుండా విధుల్లో నిమగ్నమై ఉండటం జరుగుతోంది. దాంతో పాటు వేళకు ఆహారం తీసుకోవడంలో అశ్రద్ధ… అందునా విటమిన్లు కలిగివున్న ఆహారం తీసుకోవడం పెద్ద సమస్యగా తయారైంది. చిన్న వయసు నుంచే విటమిన్ల లోపం కారణంగా పలు రకాల సమస్యలకు లోనవుతున్నాం.

నైట్ బ్లైండ్‌నెస్… దీన్నే రేచీకటిగా కూడా పిలుస్తాం. రాత్రి సమయాల్లో చూపు ఆనకపోవడం. ఆహారంలో విటమిన్ ఏ లోపం కారణంగా ఎక్కువగా పిల్లల్లో ఈ వ్యాధి ఎక్కువగా సంభవిస్తుంది. కంటిలోని తెల్లపొర ప్రకాశిస్తూ ఉండకుండా పొడి ఆరిపోయినట్లుగా తయారవుతుంది. కంటి గ్రుడ్డు మీద తెల్లని మచ్చలు కనబడతాయి. ఈ వ్యాధికి గురైన వారు మసక వెలుతురులో వస్తువులను సరిగా చూడలేరు. ఈ వ్యాధి వంశపారంపర్యంగా కూడా సంక్రమిస్తుంది. దీన్నే రెటినైటిస్ పిగ్మెంటోజా అని వైద్య పరిభాషలో పిలుస్తారు. విటమిన్ ఏ లోపం కారణంగా వచ్చే రేచీకటి సమస్యను పోగొట్టవచ్చు. అయితే వంశపారంపర్యంగా సంక్రమించినట్లయితే సరైన చికిత్స లేదు.

రాత్రి సమయాల్లో డ్రైవింగ్ చేయడానికి ఇబ్బంది పడుతున్నారా..? టీవీ చూడటం సమస్యగా మారిందా…? వెలుతురు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో కళ్లు బ్లర్‌గా మారి వస్తువులను గుర్తుపట్టలేకపోతున్నారా..? అయితే మీరు తప్పక రేచీకటితో బాధపడుతున్నట్లుగా గుర్తించాలి. ఒక వ్యక్తి రాత్రి సమయంలో లేదా కాంతి తక్కువగా ఉన్నప్పుడు చూడలేకపోయే పరిస్థితి. ఇది కంటి లోపల ఉన్న మరేదో లోపానికి సంబంధించిన లక్షణం లాంటిది. దీనితో బాధపడుతున్న వ్యక్తులు చీకటిగా భావించడానికి ముందు తీవ్రమైన వెలుగును అనుభవించినట్లయితే సమస్య జటిలంగా మారినట్లు పరిగణించాలి. ఈ స్థితిలో ఉన్న వారికి రాత్రిపూట నక్షత్రాలను చూడటం, చీకటిగా ఉన్న గదిలో నడవటం చాలా కష్టమవుతుంది.

  • కంటి లోపల ఉండే కటకం మసక బారడం వల్ల చూపు తగ్గిపోతుంది.
  • శుక్లాలు ఉన్నవారిలో రాత్రి పూట చూపుకు సంబంధించి ఇబ్బందులు ఎదురవుతాయి.
  • రక్తంలో అసాధారణంగా పెరిగిపోయే చక్కెర స్థాయిలు
  • వంశపారంపర్యంగా కూడా సంభవించే అవకాశాలున్నాయి.
  • తీసుకునే ఆహారంలో విటమిన్ ఏ లోపం
  • కార్నియా శంఖాకృతిలో ముందుకు పొడుచుకురావడం వల్ల రేచీకటి వస్తుంది.

రాత్రి పూట చూడటం ఇబ్బందిగా ఉన్నా లేదా… తీవ్రమైన కాంతి నుంచి వెంటనే చీకటిలోకి వెళితే అక్కడ అలవాటుపడేందుకు ఇబ్బందిపడుతుంటారు. రేచీకటి అనేది ఒక లక్షణం. రేచీకటి రాగానే భయపడిపోయి ఆందోళనకు గురికావద్దు. కంటి వైద్యుడ్ని సంప్రదిస్తే చూపు క్షీణత, రంగులను చూసే సామర్ధ్యం, ప్యూపుల్-లైట్ రిప్లెక్ పరీక్షలు జరుపి ఏమేరకు రేచీకటి ఉందో నిర్ధారణకు వస్తారు. విటమిన్ ఏ లోపం ఏమేరకు ఉందో తెల్సుకునేందుకు రక్తపరీక్షలు జరుపుతారు.

నైట్ బ్లైండ్‌నెస్ సమస్య నుంచి బయటపడేందుకు ముఖ్యంగా చిన్నపిల్లలకు ఇచ్చే ఆహారంలో విటమిన్ ఏ, జింక్ ఎక్కువగా ఉండేట్లుగా చూసుకోవాలి. 9 నెలల నుంచి 3 ఏళ్ల వయసు చిన్నారులకు ఆరు నెలలకోసారి విటమిన్ ఏ ద్రావకం నోటి ద్వారా ఇప్పించాలి. క్యారట్, తాజా ఆకుకూరలు, కోడిగుడ్లు, పాలు మొదలైనవి ఆహారంలో ఉండేలా చూడాలి. సమస్య మరీ తీవ్రంగా ఉంటే విటమిన్ ఏ ట్యాబ్‌లెట్లు ఇవ్వాల్సి ఉంటుంది. మధుమేహంతో బాధపడే వారు రక్తంలోని చక్కెర స్థాయిలను ఎప్పటికప్పుడు నియంత్రించుకోవాలి.

తీవ్రమైన కంటి సమస్యను సూచించే ప్రమాద సంకేతంగా పరిగణించే నైట్ బ్లైండ్‌నెస్ నివారణకు… మనం తీసుకునే ఆహారం సమతులంగా ఉండేలా చూసుకోవడం ప్రధానమైంది. వెలుతురు తక్కువగా ఉన్న సమయాల్లో చూసేందుకు ఇబ్బందిగా ఉన్నా… చీకటి సమయాల్లో తెలియకుండానే వస్తువులను కిందపడేయడం లాంటి వాటివి జరిగినప్పుడు వెంటనే కంటి వైద్యుడ్ని సంప్రదించాలి. అదేవిధంగా రాత్రి వేళల్లో వాహనాలు నడపటం మానేయడం ద్వారా ప్రమాదాలను నివారించే వీలుంది.

Leave a Comment