రక్తం తగ్గిపోయిపోయినట్టుంది అయితే ఐరన్ టాబ్లెట్లు వాడాల్సిందే. ఎముకలు నొప్పులుగా ఉంటున్నాయి.. కాబట్టి క్యాల్షియం సప్లిమెంట్లు తెచ్చుకోవాల్సిందే.. ఇలా అనుకుని ఎవరికి వారే మల్టీవిటమిన్ టాబ్లెట్లో, ఇతర సప్లిమెంట్లో వాడితే కొన్నిసార్లు ప్రమాదం కావొచ్చు. అందుకే విటమిన్లు, సప్లిమెంట్లు తీసుకోవడంలో విచక్షణ అవసరం. అసలు ఏ సప్లిమెంట్స్ ఎవరికి అవసరం… వీటిని ఎటువంటి సమయంలో తీసుకోవాలి..!
మనం ఆరోగ్యంగా ఉండాటంటే శరీరానికి అన్ని రకాల పోషకాలు అందాల్సిందే . కాబట్టి నిత్యం మనం సమతుల ఆహారాన్ని డైట్ లో చేర్చుకోవాలి. నిజానికి అందరూ అన్ని రకాల ఆహారాలు తీసుకోరు. అలాగే చాలామందికి కొన్ని ఆహారాలు తీసుకోవడంపై అసలు ఆసక్తి ఉండదు. ఫలితంగా వాటి నుంచి వచ్చే పోషకాలను కోల్పోవాల్సి ఉంటుంది. ఆహారం నుంచి పోషకాలు అందనప్పుడు ఆరోగ్యం కూడా అదేస్థాయిలో ఉంటుంది. కాబట్టి ఆహారం ద్వారా లభించని పోషకాలను సప్లిమెంట్ల ద్వారా భర్తీ చేస్తారు . కానీ సప్లిమెంట్లు వైద్యుల సలహాలు సూచనల మేరకే తీసుకోవాలి.
వృద్ధులు, మంచానికే పరిమితమైనవాళ్లు, కొన్ని రకాల జబ్బుల వల్ల పేగులు ఆహారంలోని విటమిన్లను పీల్చుకోలేని రోగులు, బేరియాట్రిక్ సర్జరీ చేయించుకున్నవాళ్లు, కొన్ని రకాల ఆహార పదార్థాలని మాత్రమే ఎంచుకుని తినేవాళ్లు, గర్భిణులు, పాలిచ్చే తల్లులు, తల్లి పాలు మానేసిన తర్వాత కేవలం ఆవు పాల మీదే ఆధారపడే పిల్లలు వీళ్లందరికీ అదనంగా విటమిన్లు అందించాల్సిన అవసరం ఉంటుంది.
సప్లిమెంట్స్ ఎవరికి అవసరం?
- పిల్లలను కనడానికి సిద్ధంగా ఉన్న మహిళలు గర్భం దాల్చడానికి ముందు నుంచే ‘ఫోలిక్ యాసిడ్’ మాత్రలను వాడాలని చెబుతారు. గర్భం దాల్చిన మహిళలు తమ గర్భానికి 12 వారాల వయసు వచ్చే వరకూ ఫోలిక్ యాసిడ్ మాత్రలను వాడాలని, అలా వాడితే ప్రసవానంతరం పిల్లల్లో తలెత్తే సమస్యలను నివారించవచ్చని వైద్యులు చెబుతున్నారు.
- 1 సంవత్సరం నుంచి 4 సంవత్సరాల వయసు మధ్య ఉన్న పిల్లలకు సాధారణంగా విటమిన్-డి సప్లిమెంట్స్ ఇస్తారు. ఇవే సప్లిమెంట్లను అవసరమైన సమయం కన్నా తక్కువ సమయం సూర్యరశ్మిలో గడిపేవారికి, రోజులో ఎక్కువ కాలం ఇంటికే పరిమితమైన పెద్దవారికి కూడా ఇస్తారు. అపుడే పుట్టిన పిల్లలకు అరుదుగా వచ్చే అత్యంత ప్రమాదకరమైన రక్తసంబంధ వ్యాధిని నివారించడానికి పిల్లలు పుట్టిన 24 గంటల్లోగా విటమిన్-కె ఇంజెక్షన్ ఇస్తున్నారు.
- కొంతమంది కాస్త నీరసంగా అనిపించగానే బీ కాంప్లెక్స్ మింగేస్తూ ఉంటారు. ఇంకొందరు మోకాళ్లు నొప్పి పెడితే, క్యాల్షియం తక్కువైందేమో అని ఆ సప్లిమెంట్లు వాడేస్తూ ఉంటారు. చర్మం మెరుపు సంతరించుకుంటుందని విటమిన్ ఇ క్యాప్స్యూల్స్, ఓపిక కోసం ఐరన్ టాబ్లెట్లు…ఇలా వైద్యుల ప్రమేయం లేకుండా మెడికల్ షాపులో దొరికే హెల్త్ సప్లిమెంట్లను విచ్చలవిడిగా వాడేస్తూ ఉంటాం. ఇలా చేయటం వల్ల మేలు కంటే కీడే ఎక్కువ. ఆరోగ్యంగా ఉండి హెల్త్ సప్లిమెంట్లు తీసుకోవటం వల్ల అదనంగా ఆరోగ్యప్రయోజనాలు సమకూరవు.
సప్లిమెంట్స్ తీసుకోనే వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ?
మనం తీసుకునే ఆహారం ద్వారా అన్నిరకాల పోషకాలు మన శరీరాలనికి అందనప్పుడు మల్టీ విటమిన్ సప్లిమెంట్లు తీసుకోవచ్చు. కానీ పూర్తిగా రోజూ వీటిపైనే ఆధారపడడం కూడా మంచిది కాదు. కాబట్టి మంచి పోషకాలు లభించే ఆహారమే తీసుకుంటే మంచిది. అలాగే ప్రోబయాటిక్స్.. ఇది ఓ రకంగా చెప్పాలంటే మంచి బ్యాక్టీరియా . ఇది శరీరానికి చాలా అవసరం . శరీరంలో చెడు బ్యాక్టీరియాను సమం చేయడానికి ఇవి ఉపయోగపడతాయి. మజ్జిగ, పెరుగు లాంటి పదార్థాల నుంచి ప్రోబ్యాక్టీరియా లభిస్తుంది. జీర్ణక్రియ ప్రక్రియలో ఉపయోగపడుతుంది. చర్మంపై చికాకు కలిగించే దద్దుర్లు రాకుండా కొలెస్ట్రాల్ స్థాయి తగ్గించడంలో రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో ఇది పని చేస్తుంది.శరీరానికి క్యాల్షియం చాలా అవసరం . ఎముకలు దృఢంగా ఉండాలంటే రోజూ క్యాల్షియం తీసుకోవడం తప్పనిసరి. క్యాల్షియం కోసం విటమిన్ K పుష్కలంగా లభించే పచ్చని కూరగాయలు , విటమిన్ D లభించే చేపలు , బాదం తీసుకోవాల్సి ఉంటుంది . ఐతే వీటిలో కొన్ని ఆహార పదార్థాలు తీసుకోని వారి కోసం వైద్యులు బయట నుంచి సప్లిమెంట్లు సూచిస్తారు . కానీ రోజూ క్యాల్షియం సప్లిమెంట్ తీసుకోవడం గుండె సమస్యలు , ప్రొస్టేట్ కేన్సర్ లాంటి సమస్యలకు దారి తీస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. కాబట్టి సహజసిద్ధంగానే క్యాల్షియం శరీరానికి అందేలా చూసుకోవాలి .
ఆరోగ్యానికి మంచిది కదా అని సప్లమెంట్లు ఎక్కువగా వాడడం మంచిది కాదు. మనకు కావాల్సిన పొషకాలు అన్ని సహజ సిద్ధంగా ఆహారాల ద్వారా పొందడం మంచిది. ఆహారాల ద్వారా లభించనప్పుడు వైద్యుల సలహా మేరకు ఎంత మోతాదులో తీసుకోవాలో అంతే తీసుకుంటే మన ఆరోగ్యానికి మంచిదన్న విషయాన్ని గుర్తించుకోవాలి.