ముక్కోటి ఏకాదశి రోజును ప్రతి హిందూవుకు చాలా ప్రత్యేకమైనదిగా చెప్పవచ్చు. ఎందుకుంటే ఈ ఏకాదశి తిథి మహావిష్ణువుడు అత్యంత ప్రతిపాత్రమైనదిగా మన హిందూ పురాణాలు చెబుతున్నాయి. అయితే ఈ సంవత్సరం వైకుంఠ ఏకాదశి ఎప్పుడు వచ్చింది..? ఈ రోజు జరుపుకోవాల్సిన పూజ.. పూజా విధానం ఏంటి? అన్న విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..
సాధారణంగా మన హిందూ క్యాలెండర్ ప్రకారం శుద్ధ ఏకాదశి, బహుళ ఏకాదశి అంటూ నెలకు రెండుసార్లు చొప్పున ఏడాదిలో ఏకాదశి తిథి 24 సార్లు వస్తుంది. అయితే ఎప్పుడన్న అధికమాసం వస్తే మరో రెండుసార్లు కలిపి మొత్తం 26 సార్లు ఏకాదశి వస్తుంది. అయితే అన్నింటిని మనం మాములుగా జరుపుకున్న… వీటిలో వచ్చే తొలి ఏకాదశి ఎంతో విశిష్టమైంది.
వైకుంఠ ఏకాదశి విశిష్ఠత ఏంటి..?
మనకు ప్రతి సంవత్సరం మార్గశిర మాసం శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అని పిలుచుకుంటాం. అంతే కాదు ఇది ఎంతో పుణ్యతిథి కావడం వల్ల దీన్ని మోక్షద ఏకాదశిగా కూడా పిలుస్తారు. సూర్యుడు దక్షిణాయానం నుంచి ఉత్తరాయణంలోకి ప్రవేశించడానికి ముందు వచ్చే ఏకాదశి. మహా విష్ణువు గరుడ వాహనుడై మూడు కోట్ల మంది (ముక్కోటి) దేవతలతో కలిసి భూలోకానికి దిగి వచ్చి భక్తులకు దర్శనమిస్తారు. అందుకే దీనిని ముక్కోటి ఏకాదశి అని పేరు వచ్చినట్టు అష్టాదశ పురాణాలు మనకు చెబుతున్నాయి.
ఈ ఏడాది వైకుంఠ ఏకాదశి ఎప్పుడు వచ్చింది..?
ఈ ఏడాది ప్రతి పర్వధినం రెండురోజు వచ్చింది.. కాబట్టి చాలా మందిలో ఏరోజు జరుపుకోవాలి అన్న సందేహాం ఏర్పడింది. ఈ సంవత్సరం వైకుంఠ ఏకాదశి ఎప్పుడు వచ్చింది అంటే.. డిసెంబరు 22 శుక్రవారం ఉదయం 9 గంటల 39 నిమిషాల తర్వాత ఏకాదశి తిథి ప్రారంభమవుతుంది. 23 శనివారం ఉదయం 7 గంటల 56 నిముషాలకు పూర్తవుతుంది. అయితే.. సూర్యోదయంలో ఏకాదశి తిథి ఉన్నరోజునే లెక్కలోకి తీసుకుంటారు. కాబట్టి.. 23వ తేదీనే ఏకాదశి పర్వదినంగా జరుపుకుంటారు. ఆ రోజున తెల్లవారుజామునే ఏకాదశి ఘడియలు దాటిపోకముందే ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడం మంచిదని పండితులు చెబుతున్నారు.
వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వార దర్శనం ఎందుకు చేసుకోవాలి..?
వైకుంఠ ఏకాదశి రోజున అన్ని వైష్ణవ ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతుంటాయి. ముక్కోటి ఏకాదశి రోజున శ్రీ మహా విష్ణువును ఉత్తర ద్వారం నుంచి దర్శించుకోవాలంటారు పెద్దలు. వైకుంఠం తలుపులు తెరచుకునే ఈ పర్వదినాన శ్రీహరి ముక్కోటి దేవతలతో భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తాడు. పురాణాల ప్రకారం.. ఒకప్పుడు రాక్షసుల హింసను భరించలేక దేవతలందరూ కలిసి ఉత్తర ద్వారం నుంచి ప్రవేశించి శ్రీ విష్ణుమూర్తిని దర్శించుకుని తమ గోడును వెళ్లబోసుకున్నారు. అప్పుడు శ్రీ మహా విష్ణువు అనుగ్రహించి రాక్షసుల బాధ నుంచి విముక్తి కలిగించడాని, అందుకే ఉత్తర ద్వారం దర్శనం చేసుకుంటే మనల్ని వెంటాడుతున్న సమస్యలన్నింటికీ పరిష్కారం లభిస్తుందని భక్తుల నమ్మకం.
పూజా విధానం ఏంటి? ముక్కోటి ఏకాదశి రోజు ఏం చేయాలి?
వైకుంఠ ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ తెల్లవారు జామునే లేచి స్నానాదులు పూర్తి చేసుకోవాలి. ఉపవాస వ్రతం ప్రారంభించి, ఇంట్లోని పూజా మందిరంలో విష్ణుమూర్తి ఫొటో లేదా విగ్రహం ఎదుట నెయ్యి దీపం వెలిగించి ధ్యానం చేయాలి. తర్వాత వైష్ణవ ఆలయాలు దర్శించాలి. ముఖ్యంగా మహా విష్ణువును ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకుంటే ఆయన అనుగ్రహంతో పాటు శుభాలు కలుగుతాయి. ఈరోజు విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వల్ల సమస్త పాపాలు తొలిగి భగవంతుడి అనుగ్రహం కలుగుతుందని విశ్వాసం.ముక్కోటి ఏకాదశి రోజు ఎవరైతే ఉపవాసం ఉండి మహా విష్ణువును ఆరాధిస్తారో.. ఉత్తరద్వార దర్శనం చేసుకొని విష్ణు సహస్రనామ పారాయణం చేస్తారో వారికి దైవ అనుగ్రహం కలిగి మోక్షానికి మార్గం సిద్ధిస్తుంది.
ఏకాదశి రోజు భోజనం ఎందుకు చేయకూడదు?
మన పురాణాల ప్రకారం సత్య యుగంలో మూరా అనే రాక్షసుడు ఉండేవాడు. బ్రహ్మదేవుడి ద్వార వరం పొంది కొన్ని శక్తులను ఆ రాక్షసుడు పొందుతాడు. రాక్షసుడు దేవతల్ని ఇబ్బంది పెట్టడంతో వాళ్లంతా తమని రక్షించమంటూ విష్ణుమూర్తిని వేడుకున్నారట. దాంతో స్వామి అతడిని అంతమొందిం చేందుకు సిద్ధమయ్యాడట. అది తెలిసిన అసురుడు సముద్రగర్భంలో దాక్కోవడంతో విష్ణుమూర్తి కూడా ఓ గుహలోకి వెళ్లి నిద్రిస్తున్నట్లుగా నటించాడట. దాంతో ముర బయటకు వచ్చి స్వామిని సంహరించేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో మహాలక్ష్మి శక్తిరూపంలో వచ్చి అతడిని వధించిందట. స్వామి సంతోషించి ఆ శక్తికి ఏకాదశి అనే పేరు పెట్టి ఏదైనా వరం కోరుకోమన్నాడట. మురను సంహరించిన రోజున ఉపవాసం ఉన్నవారి పాపాలను పోగొట్టమంటూ ఆ శక్తి వేడుకోవడంతో, స్వామి తథాస్తు అనడంతోపాటు వైకుంఠప్రాప్తి కూడా కలుగుతుందని వరమిచ్చాడట. అప్పటినుంచీ వైకుంఠ ఏకాదశిని జరుపుకోవడం మొదలుపెట్టారని అంటారు. మురాసురుడిని సంహరించే సమయంలో అతడు బియ్యంలో దాక్కోవడం వల్లే ఉపవాసం ఉండాలనే నియమం వచ్చిందనీ చెబుతారు. ఈ రోజున ఉపవాసం, ధ్యానం చేయడం వల్ల మిగతా 23 ఏకాదశులు ఉపవాసం ఉన్న ఫలితం కలుగుతుందని విష్ణుపురాణం చెబుతోంది.