నడుస్తున్నప్పుడు తరచుగా కాలు.. ముఖ్యంగా పిక్కల్లో.. అదీ ఒక పిక్కలో నొప్పి పుడుతోందా? కాలు ఉబ్బినట్టుగా కనబడుతోందా? చర్మం రంగు మారిపోయిందా? అయితే జాగ్రత్త పడాల్సిందే. ఎందుకంటే ఇవన్నీ చర్మానికి కాస్త లోతులోని సిరల్లో తలెత్తే రక్తం గడ్డలకు డీప్ వీన్ థ్రాంబోసిస్ సూచికలు కావొచ్చు. పైకి మామూలుగానే కనబడొచ్చు గానీ ఇది చాలా తీవ్రమైన సమస్య.
సిరల్లో రక్తం గడ్డలు (క్లాట్స్) ఏర్పడడాన్నే డీప్ వీన్ థ్రాంబోసిస్ లేదా డివిటి అంటారు. సాధారణంగా డీప్ వీన్ థ్రాంబోసిస్ పిక్కల్లో, తొడల్లో ఎక్కువగా తలెత్తుతుంది. కొందరికి ఇతరత్రా భాగాల్లోనూ ఏర్పడొచ్చు. ఇది ఏ వయసులోనైనా రావొచ్చు గానీ 60 ఏళ్లు పైబడినవారిలో తరచుగా కనబడుతుంది. దీనికి రకరకాల అంశాలు దోహదం చేస్తాయి. పుట్టుకతోనే రక్తం గడ్డ కట్టటంలో లోపం గలవారికి దీని ముప్పు ఎక్కువ. ఇలాంటివారికి ఇతరత్రా ముప్పు కారకాలు కూడా తోడైతే సమస్యాత్మకంగా పరిణమిస్తుంది. అలాగే పక్షవాతం లేదా ఇతరత్రా సమస్యలతో దీర్ఘకాలం మంచాన పడ్డవారికీ.. గంటలకొద్దీ కదలకుండా కూచొని ప్రయాణాలు చేసేవారికీ కాలి సిరల్లో రక్తం గడ్డలు తలెత్తొచ్చు.
కాలిలోని సిరలు గుండెకు రక్తాన్ని తీసుకెళ్లటానికి కండరాలు బలంగా పనిచేయాల్సి ఉంటుంది. దీర్ఘకాలం కదలకుండా ఉండేవారిలో పిక్క, తొడ కండరాలు బలహీనమవుతాయి. దీంతో రక్తం సరిగా పైకి వెళ్లకుండా అక్కడే నిల్వ ఉండి, గడ్డలు ఏర్పడొచ్చు. సిరల్లో రక్తం వెనక్కి రాకుండా చూసే కవాటాలు దెబ్బతినటం వల్ల తలెత్తే సిరల ఉబ్బు (వెరికోస్ వీన్స్) సమస్య కూడా థ్రాంబోసిస్‌కు దారితీయొచ్చు. అలాగే సిరలకు దెబ్బలు తగలటం లేదా శస్త్రచికిత్సల కారణంగానూ రావొచ్చు.
పొగ తాగటం- రక్త ప్రసరణ మీదే కాదు.. రక్తం గడ్డకట్టటం పైనా ప్రభావం చూపుతుంది. కొన్నిరకాల క్యాన్సర్లు రక్తం గడ్డకట్టటానికి తోడ్పడే పదార్థాల స్థాయులనూ పెంచుతాయి. అలాగే గుండె వైఫల్యం బాధితులకూ డీప్ వీన్ థ్రాంబోసిస్ ముప్పు ఎక్కువే. పేగుల్లో వాపు ప్రక్రియతో ముడిపడిన క్రాన్స్ డిసీజ్, పేగు పూత కూడా రక్తం గడ్డలకు దారితీయొచ్చు.
కొన్ని లక్షణాల ద్వారా దీన్ని గుర్తించవచ్చు. డీప్ వెయిన్ థ్రోంబోసిస్ తో భాదపడేవారు రాత్రి బాగానే ఉంటారు. తెల్లవారి లేచి చూసేసరికి కాలు అంతా వాచిపోయి కనిపిస్తుంది. వాపుతో పాటు నొప్పి ఉండొచ్చు.. ఉండకపోవచ్చు. సాధారణంగా మోకాలి కింద ఇలాంటి సమస్య వస్తుంది. అయితే కాలు మొత్తం లేదా చేతిలో కూడా ఇలా వాపు రావొచ్చు. ఇలా అకస్మాత్తుగా వాపు కనిపించినప్పుడు వెంటనే డాక్టర్‌ను కలవాలి. ఎందుకంటే కొన్నిసార్లు లోపల ఏర్పడిన గడ్డ హఠాత్తుగా చిట్లిపోవచ్చు. అలా బ్రేక్ అయిన గడ్డలు ఊపిరితిత్తులకు చేరి లంగ్ అటాక్ రావొచ్చు. దీన్నే లంగ్ ఎంబోలిజమ్ అంటారు. ఇది అత్యవసర పరిస్థితి. కాబట్టి ఈ సమస్యను అశ్రద్ధ చేయొద్దు.
అక్యూట్ డీప్ వీన్ థ్రాంబోసిస్‌ని నిర్లక్ష్యం చేస్తే చాలా ప్రమాదం. దీనివల్ల అల్సర్లు ఏర్పడుతాయి. ఈ పుండ్లు మానకుండా ఎక్కువ అవుతాయి. డివిటిని నిర్లక్ష్యం చేసిన వాళ్లలో కాలు వాపు, నొప్పితో పాటు ఇలా మానని పుండ్లు ఏర్పడితే ఆ స్థితిని పోస్ట్ థ్రాంబోటిక్ సిండ్రోమ్‌గా వ్యవహరిస్తారు. డివిటిని నిర్ధారణ చేయడానికి కలర్ డాప్లర్ స్కాన్ చేస్తారు. ఈ స్కాన్‌లో రక్తం గడ్డ ఎక్కువుందా, తక్కువుందా, ఏ స్థాయిలో ఉందనేది తెలుస్తుంది. క్లాట్ ఎక్కువగా ఉంటే థ్రాంబోలైసిస్ చేస్తారు. తీవ్రత తక్కువగా ఉంటే రక్తాన్ని పలుచబరిచే మందులు,ఇంజెక్షన్లు, టాబ్లెట్లు ఇస్తారు. చికిత్స కొంచెం కష్టమైనప్పటికీ సమస్యను ఎంత తొందరగా గుర్తించి చికిత్స చేస్తే ఫలితం అంత బాగుంటుంది. మెడికల్ ట్రీట్‌మెంట్ ఇస్తూ, వీనోగ్రామ్ ద్వారా డీప్ వీన్ స్టెంటింగ్ చేస్తారు. అంటే గుండె రక్తనాళంలో బ్లాక్స్ ఏర్పడినప్పుడు స్టెంట్ వేసి సరిచేసినట్టుగా, కాలి రక్తనాళంలో ఏర్పడిన క్లాట్‌ను తొలగించడానికి కూడా స్టెంట్ వేస్తారు. దీన్నే వీనోగ్రామ్ అంటారు.
వెరికోస్ వీన్స్‌తో బాధపడేవారికి శస్త్రచికిత్స ద్వారా సమస్య తలెత్తిన సిరను తొలగిస్తారు. ఇప్పుడు లేజర్ థెరపీ, రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ వంటి అధునాతన పద్ధతులూ అందుబాటులో ఉన్నాయి. ఇవి పైన ఎలాంటి కోత పెట్టాల్సిన అవసరం లేకుండానే లోపలి నుంచే సిరను మూసేయటానికి తోడ్పడతాయి. తగిన జాగ్రత్తలు పాటించడం ద్వారా డీప్ వెయిన్ థ్రోంబోసిస్ భారి పడకుండా కాపాడుకోవచ్చు.గర్భిణులు డాక్టర్ల సలహాలను పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
పక్షవాతం, క్యాన్సర్‌తో బాధపడుతూ మంచంపై ఉండేవారు ఈ సమస్య తలెత్తకుండా తగిన జాగ్రత్తలు పాటించాలి. వ్యాయామం, శారీరక శ్రమ అన్నింటికన్నా ముఖ్యం. ఆసుపత్రిలో ఎక్కువసేపు మంచం మీదుండే వాళ్లు మడమలు కదిలిస్తూ ఉండాలి. వీలైనంత త్వరగా వ్యాయామాలు ఆరంభించాలి.ఎప్పుడైనా, ఎక్కడైనా గంటల తరబడి కూర్చోకుండా చూసుకోవాలి.ఒంట్లో నీటిశాతం తగ్గకుండా చూసుకోవాలి. మద్యం జోలికి వెళ్లకుండా ఉండటం మంచిది. ఒకవేళ మద్యం అలవాటుంటే మితం పాటించాలి. గడ్డలు ఏర్పడే ముప్పు ఉన్నవారు ప్రత్యేకమైన సాక్స్, క్రేప్ బ్యాండేజీ ధరించొచ్చు. ఇవి కండరాల మీద ఒత్తిడి పెంచుతూ రక్తం పైకి వెళ్లేలే చేస్తాయి.
రక్తనాళాల్లో ఏదైనా డ్యామేజ్ అవ్వడం వల్ల డీప్ వెయిన్ థ్రోంబోసిస్ కి కారణం అవుతుంది. సర్జరీ, గాయాలు, లేదా వ్యాధినిరోధకత లోపించడం వల్ల కూడా డీప్ వీన్ థ్రోంబోసిస్ కారణం అవుతుంది. శస్త్రచికిత్స చేయించుకున్న తర్వాత చాలా రోజులు మంచంపై పడుకోవడం వల్ల వస్తుంది. గుండెజబ్బులతో బాధపడేవారైనా, గర్భవతులైనా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి.