పక్క మీదకు చేరుకున్నా ఒక పట్టాన నిద్రపట్టదు. చాలా ప్రయాస తర్వాత నిద్రపట్టినా, అర్ధంతరంగా ఏ అర్ధరాత్రి వేళలోనో మెలకువ వస్తుంది. అలా మెలకువ వచ్చాక మళ్లీ నిద్రపట్టడం గగనమే అవుతుంది. దీర్ఘకాలిక నిద్రలేమి ఆయుర్దాయాన్ని కూడా హరించేస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.సరిపడనంత నిద్ర పట్టకపోవడాన్ని నిద్రలేమిగా వ్యవహరిస్తారు.
మన మెదడుకు ప్రశాంతంగా విశ్రాంతి తీసుకున్నపుడే మనకు చక్కని నిద్ర పడుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సమాచారం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా జనాభాలోని ప్రతి ముగ్గురిలో ఒకరు నిద్రకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నారు. వారంతా నిద్రలేమి ఫలితంగా తలెత్తే రకరకాల మానసిక, శారీరక ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. రాత్రిపూట ఎంతకీ నిద్ర పట్టకపోవటం. ఒకవేళ పట్టినా మధ్యలో మెలకువ రావటం. తిరిగి నిద్ర పట్టకపోవటం. స్థూలంగా చెప్పాలంటే ఇదే నిద్రలేమి.
సాధారణంగా వారానికి కనీసం 3 రోజుల పాటు నిద్రలేమితో బాధపడుతుండటం.. ఇలా 3 నెలల పాటు కొనసాగుతూ వస్తుండటాన్ని ‘దీర్ఘకాలిక నిద్రలేమి’గా భావిస్తారు. నాణ్యమైన నిద్ర తగ్గడంతో పాటు నిద్రపోయే వ్యవధి కూడా తగ్గుతోందని పలు అధ్యనాల వల్ల తెలుస్తోంది. నిద్రలేమి ఏ వయసులోనైనా రావొచ్చు. అయితే ఇది వృద్ధుల్లో తరచుగా కనబడుతుంది. మనం తీసుకునే ఆహారం కూడా నిద్రపై ప్రభావం చూపుతుంది. ఎక్కువ తీపి పదార్థాలు తీసుకుంటే అరుగుదల లేకపోవటం వలన నిద్రాభంగం అవుతుంది.
నిత్య జీవితంలో ఎదురవుతున్న ఇబ్బందులు, పెరుగుతున్న వాతావరణ కాలుష్యం, శబ్ధ కాలుష్యం, ఆహారపు అలవాట్లలో మార్పులు… ఇవన్నీ కలిసి నిద్రలేమికి కారణమవుతున్నాయి. 40సం. లు పై బడిన వారిలో 25% మంది ఈ నిద్ర లేమి సమస్యతో బాధపడుతున్నారంటే అతిశయోక్తి కాదు. ఈ రుగ్మత వల్ల సరిగ్గా నిద్ర పట్టకపోవడం, నిద్రలో అకస్మాత్తుగా మెలకువ రావడం, మెలకువ వచ్చాక తిరిగి నిద్రపట్టకపోవడం, మేలుకున్న తర్వాత అలసటగా అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ నిద్రలేమి ప్రైమరీ ఇన్‌సోమ్నియా,సెకండరీ ఇన్‌సోమ్నియా , అక్యూట్ ఇన్‌సోమ్నియా , క్రానిక్ ఇన్‌సోమ్నియా అని రకరకాలుగా ఉన్నాయి.
కొందరికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకున్నా సరిగ్గా నిద్ర పట్టదు. ఈ పరిస్థితినే ప్రైమరీ ఇన్‌సోమ్నియా అంటారు. ఉబ్బసం, డిప్రెషన్, శరీరాన్ని బాధపెట్టే నొప్పులు ఉండే పరిస్థితిని సెకండరీ ఇన్‌సోమ్నియా అంటారు. కొద్ది రోజులు లేదా కొద్ది వారాలు మాత్రమే ఉండే నిద్రలేమిని అక్యూట్ ఇన్‌సోమ్నియా అంటారు. ఇంకొందరిలో ఈ పరిస్థితి నెలల తరబడి ఉంటే దానిని క్రానిక్ ఇన్‌సోమ్నియా అంటారు. తాత్కాలిక నిద్రలేమిని వ్యాయామం, ఆహ్లాదకరమైన సంగీతం వినడం ద్వారా అధిగమించవచ్చు. క్రానిక్ ఇన్‌సోమ్నియాకు తప్పనిసరిగా వైద్య సహాయం తప్పనిసరి.
నిద్ర అలవాట్లు, నిద్ర పోయే సమయాలను పరిశీలించడం ద్వారా వైద్యులు ఇన్సోమ్నియాను నిర్ధారిస్తారు. బెడ్ పైకి చేరాక ఎంత సమయానికి నిద్ర వస్తుంది? మధ్యలో ఎన్ని సార్లు లేస్తారు? నిద్రకు ఉపక్రమించే ముందు ఏం చేస్తారనే అంశాలను గమనిస్తారు. అలాగే నిద్రలేమి సమస్యతో బాధపడుతున్న వారికి తగిన సూచనలు, సలహాలు ఇస్తారు. రోజూ క్రమం తప్పకుండా ఒకే వేళకు నిద్రకు ఉపక్రమించాలి. కెఫీన్, నికోటిన్, ఆల్కహాల్‌కు దూరంగా ఉండాలి. రోజూ క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయాలి. నిద్రకు, వ్యాయామానికి మధ్య కనీసం మూడు నాలుగు గంటల వ్యవధి ఉండాలి.
గది వాతావరణం మరీ చల్లగా, మరీ వేడిగా ఉండకూడదు. గదిలోకి శబ్ధాలు రాకుండా చూసుకోవాలి. నిద్రకు ముందు పుస్తకాలు చదవడం, ఆహ్లాదకరమైన సంగీతం వినడం లేదా స్నానం చేయడం వంటివి చేయాలి. మంచి నిద్ర వల్ల బరువు అదుపులో ఉంటుంది. శరీర కదలికలు చురుగ్గా ఉండటమే కాకుండా భావోద్వేగాలు అదుపులో ఉంటాయి. ధ్యానం, యోగ చేయడం వల్ల కండరాలు రిలాక్స్ అయి హాయిగా నిద్ర వస్తుంది. నిద్ర సమస్య ఉన్నవారు ఇలా చేస్తే జీవితం ఆరోగ్యప్రదంగా ఉంటుంది.
ఒక్కోసారి ఎన్ని చిట్కాలు పాటించినా ఉపయోగం ఉండకపోవచ్చు. నాలుగు వారాలకు మించి నిద్రలేమి సమస్య బాధిస్తున్నట్లయితే వెంటనే నిపుణులైన వైద్యులను సంప్రదించండి. మీ నిద్రలేమికి శారీరక సమస్యలేవైనా కారణమైతే, ఆ సమస్యలకు తగిన వైద్యం అందిస్తారు. మానసిక సమస్యలేవైనా కారణమైతే, వాటి నివారణకు తగిన కౌన్సెలింగ్ ఇస్తారు. తీవ్రమైన దీర్ఘకాలిక మానసిక వ్యాధులతో బాధపడుతున్నట్లయితే సమగ్ర చికిత్సను అందిస్తారు.