Bone Health: ఎముక సాంద్రత పరీక్ష(బోన్ డెన్సిటీ టెస్ట్)

By manavaradhi.com

Updated on:

Follow Us
Bone Health

ఇటీవలి కాలంలో చాలా మంది ఎముకల్లో పటుత్వం కోల్పోయి తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. పట్టుమని 30 ఏళ్లు నిండని వారు కూడా కీళ్లు, ఎముకల నొప్పులతో ఉసూరుమంటున్నారు. చిన్న వస్తువును కూడా ఇటు నుంచి అటు పెట్టడానికి అలసటగా ఫీలవుతున్నారు. ఎముకల్లో క్యాల్షియం, ఇతర మినరల్స్‌ వంటివి తక్కువగా ఉంటే అది పెళుసుగా మారిపోతుంది. పెళుసుగా ఉన్న ఎముకలు త్వరగా విరిగిపోతాయి.

బోన్ మినరల్ డెన్సిటీ టెస్ట్ ఎముక ఖనిజ సాంద్రత పరీక్ష లేదా అనే విషయాన్ని తెలుసుకునేందుకు నిర్వహిస్తారు. సాధారణంగా మన శరీరం నిలబడేందుకు ఎముకే ఆధారం. ఇలాంటి ఎముక పూర్తి స్థాయిలో బలంగా ఉందా లేదా అనే విషయాన్ని ఈ పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చు. ఎముక బలహీనంగా ఉండడం వల్ల విరిగిపోయి ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఎక్కువ. ఇది సమస్య మరింత పెరిగే వరకూ గుర్తించడం చాలా కష్టం అందుకే ఇలాంటి పరిస్థితిలో ఈ పరీక్ష మేలు చేస్తుంది.

ఈ పరీక్ష ఎలాంటి నొప్పి లేకుండా వేగంగా నిర్వహిస్తారు. ఎక్స్ కిరణాలను ఉపయోగించి, ఎముకలు దట్టంగా ఉన్నాయా లేదా అనే విషయాన్ని అంచనా వేస్తారు. ఎముకల్లో క్యాల్షియం ఎంత ఉంది, అదే విధంగా ఇతర ఖనిజాల స్థాయి ఎంత ఉంది అనే విషయాలు తెలుసుకుంటారు. ఇవి దట్టంగా ఎక్కువగా ఉంటే సమస్య లేదు. అలా కాకుండా తక్కువ స్థాయిలో ఉంటే మాత్రం ఎముకలు విరిగేందుకు, అదే విధంగా లోపల పగిలేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే ఓ వయసు వచ్చిన తర్వాత లేదా, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడే వారు బోన్ మినరల్ డెన్సిటీ పరీక్ష చేయించుకోవడం అవసరం.

బోలు ఎముకల వ్యాధి ఎవరికైనా రావచ్చు. పురుషులతో పోల్చిచూస్తే మహిళల్లో ఈ సమస్య సర్వ సాధారణం. వైద్యుల సూచన మేరకు, ఆరోగ్య పరిస్థితిని బట్టి ఈ పరీక్ష చేయించుకోవాలి. 65 సంవత్సరాలు దాటిన స్త్రీలు గానీ, అదే విధంగా 50 సంవత్సరాలు దాటిని పురుషుల్లో గానీ ఈ పరీక్ష అవసరం అవుతుంది.

మోనోపాజ్ దశలో ఉన్న స్త్రీలలో ఎముకల బలం తగ్గడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది గనుక అలాంటి వారు కూడా ఈ పరీక్ష చేయించుకోవాలనే విషయాన్ని తెలుసుకోవాలి. అదే విధంగా శరీరంలో నీరసానికి సంబంధించిన ఇతర సమస్యలు ఉన్నా, ఎముకల సమస్య గురించి తెలుసుకోవాలి. అలాగే ఎత్తు విషయంలో ఇబ్బందులు వచ్చినా, ఒకే భంగిమలో ఎక్కువ కాలం కూర్చునే వారు అయినా, ఏ కారణం లేకుండా శరీరంలోని వివిధ భాగాల్లో నొప్పులు వస్తున్నా, గర్భవతి అయినా, హార్మోన్ సమస్యలు ఎదుర్కొంటున్నా, అదే సమయంలో ఏదన్నా అవయవ మార్పిడి జరిగిన వారైనా పరిస్థితిని బట్టి, వైద్యుల సలహా మేరకు బోన్ మినరల్ డెన్సిటీ పరీక్ష చేయించుకోవలసి ఉంటుంది. సాధారణ వ్యక్తులతో పోలిస్తే ఇలాంటి వారిలో ఎముకల సమస్యలు రావడానికి అవకాశం ఎక్కువ గనుక, ఇలాంటి వారు పరీక్షలు చేయించుకోవడం అత్యంత ఆవశ్యకం.

బోన్ డెన్సిటీ పరీక్షల్లో వెన్నెముక, మక్కే, ముంజేతి ఎముకలకు పరీక్షలు నిర్వహిస్తారు. బోలు ఎముకల వ్యాధి కారణంగా విరిగే వాటిలో ఇవే ఎక్కువ. అందుకే వీటికి పరీక్షలు నిర్వహిస్తారు. ఈ పరీక్షలు చేయించుకోవాలనుకునే వారు పరీక్షకు ముందు 24 గంటల పాటు క్యాల్షియం సప్లిమెంట్లు తీసుకోకూడదు. అదే విధంగా సి.టి. స్కాన్, ఎం.ఆర్.ఐ. కోసం చేసే ఇంజెక్షన్లు కూడా ఈ పరీక్షల మీద ప్రభావం చూపుతాయి. మెటల్ లాంటివి ధరించడం వల్ల కూడా కొన్ని సమస్యలు ఎదురౌతాయి. చాలా తక్కువ రేడియో ధార్మికత కలిగి ఉండే ఈ బోన్ మినరల్ డెన్సిటీ పరీక్ష ఎక్స్ రే తో పోల్చి చూసినప్పటికీ చాలా తక్కువ రేడియో ధార్మికత కిలిగి ఉంటుంది.

ఈ పరీక్షలు మన ఆరోగ్య పరిస్థితిని బట్టి, అదే విధంగా వయసును బట్టి, అవసరాలను బట్టి వివిధ భాగాలకు నిర్వహిస్తారు. ఇప్పటికే బోలు ఎముకల సమస్యలు ఉండి, దానికి సంబంధించిన మందులు తీసుకుంటూ ఉంటే మాత్రం ఏడాది నుంచి రెండేళ్ళకు ఒక సారి ఈ పరీక్షను చేయించుకోవాలి. అదే విధంగా ఈ సమస్య ఇప్పటి వరకూ లేని వారు, భవిష్యత్ లో పరీక్షల్లో కనపడని వారు ఎనిమిది సంవత్సరాలకు ఒక సారి ఈ పరీక్షలు చేయించుకుంటే సరిపోతుంది. ప్రత్యేకించి మోనోపాజ్ దశలో ఉన్న మహిళల్లో ఈ పరీక్షలు చేయించుకోవడం అత్యంత ఆవశ్యకం.

ఎముకలో ఉండాల్సిన ఖనిజాలు, పదార్థాల సాంద్రత ఎంత ఎక్కువగా ఉంటే ఆ ఎముక ఆరోగ్యంగా, దృఢంగా ఉంటుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల కూడా ఎముకల పటుత్వం పెరుగుతుంది. వయసుతో సంబంధం లేకుండా చిన్న నాటి నుంచే వ్యాయామం చేయడం ఒక అలవాటుగా మార్చుకోవాలి.

Leave a Comment