Health : శ్వాసకోస సంబంధ సమస్యలకు ఈ పరీక్షలు తప్పనిసరా?

By manavaradhi.com

Published on:

Follow Us
respiratory diseases tests

ప్రతి సంవత్సరం మిలియన్ల కొద్ది ప్రజలు శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. అయితే చాలామంది ప్రజలు ఈ వ్యాధి నిర్ధారణకే వెళ్ళడం లేదు. వాతావరణంలో ఉండే కాలుష్య పదార్థాలు మన ఊపిరితిత్తులపై ప్రభావం చూపిస్తుండటం వల్ల రకరకాల శ్వాసకోశ సమస్యలు వస్తుంటాయి. వీటిని గుర్తించేందుకు వైద్యులు రకరకాల పరికరాలను ఉపయోగిస్తూ వ్యాధి నిర్ధారణ చేస్తున్నారు.

నేడు ఎంతోమంది శ్వాసకోస సంబంధ సమస్యలతో బాధపడుతున్నారు. వాతావరణ కాలుష్యం, ఆహారం, అలవాట్లు, పరిసరాలు పరిశుభ్రంగా లేకపోవడం, రోగనిరోధక శక్తి తగ్గిపోవడం, వాతావరణంలో చోటుచేసుకునే మార్పుల వల్ల శ్వాసకోశ వ్యాధుల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఏడాది పొడవునా అతి శీతల వాతావరణం ఉండే ప్రాంతాల్లో అతిశీతల వాతావరణం, దట్టంగా కురిసే పొగమంచు ప్రభావం అధికంగా ఉండటం వల్ల ప్రజలు సరైన రక్షణ లేకుండా తేమతో కూడిన వాతావరణంలో తిరగడం వల్ల ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యల బారిన పడుతున్నారు. ఈ సమస్యలను కనుగొనేందుకు ఉపయోగించే అధునాతన పరికరాలను ఉపయోగించి వైద్యులు పరీక్షలు చేసి వ్యాధుల నిర్ధారణ చేస్తున్నారు. వీటిలో ప్రధానమైనది ఛాతీ ఎక్స్ రే. అసలు వ్యాధి అసలు ఉందో లేదో కనుక్కోవడానికి ఛాతీ ఎక్స్ రే చేస్తారు.

శ్వాసనాళాల వ్యాధులైన బ్రాంకైటిస్ , బ్రాంకిఎక్టేసిస్ లలో శ్వాస నాళాల గోడలలో ఉండే మ్యూకస్ గ్లాండ్స్ లో కఫం తయారైనపుడు ఛాతీ ఎక్స్ రే లో శ్వాసనాళాలు కనిపించవు. చాలా రోజులుగా జబ్బు పడినప్పుడు ఇవి సన్నని తీగలాగ కనిపిస్తాయి. జబ్బు తగ్గుతున్నప్పుడు కూడా వ్యాధిని నిర్ధారించడానికి మళ్ళీ ఛాతీ ఎక్స్ రే చేస్తారు. ఛాతీ ఎక్స్ రే లో కనిపించని వ్యాధులను అంటే ప్రారంభ దశలో ఉన్న న్యూమోనియా, క్షయ , ఐ.ఎల్. డి, క్యాన్సర్, లింఫ్ గ్రంధులు, ట్యూమర్స్ లను సి. టి స్కాన్ పరీక్ష ద్వారా గుర్తిస్తారు. ప్లూరల్ వ్యాధులు, బ్రాంకిఎక్టేసిస్ లను కూడా ఈ పరీక్ష ద్వారా గుర్తిస్తారు.

క్లిష్టమైన శ్వాసకోశ వ్యాధుల నిర్ధారణకు ఉపయోగపడే ఆధునిక పరికరం బ్రాంకోస్కోప్. కఫం, ఛాతీ ఎక్స్ రే ల ద్వారా పలు రకాల వ్యాధులను గుర్తించి నయం చేయడానికి వీలైనప్పటికీ మరికొన్ని జబ్బులను ఈ పరీక్షల ద్వారా నిర్ధారించడం కష్టంగా ఉంటుంది. రేడియాలజి పరికరాల్లో లభ్యమయ్యే అల్ట్రాసౌండ్ , కంప్యూటెడ్ టొమోగ్రఫి (సి.టి), ఎం.ఆర్. ఐ వంటివి ఈ ఇబ్బందులను కొంతవరకు అధిగమించినా కొలిక్కిరాని సందర్భాలు అనేకం. ఈ సమస్యలను పరిష్కరించడానికి ప్రస్తుతం అందుబాటులో ఉన్న పరికరం బ్రాంకోస్కొపీ. సుమారు 100 ఏళ్ల క్రితమే కిల్లియన్ అనే శాత్రవేత్త బ్రాంకోస్కోప్ ద్వారా పరీక్షలు నిర్వహించారు. అయితే అప్పట్లో గట్టిగా ఉండే స్టీల్ పరికరాలు వాడుకలో ఉండేవి. క్రమేపీ భౌతిక శాస్త్రంలో వచ్చిన ఆధునిక పరిజ్ఞానం వల్ల పలు విప్లవాత్మక మార్పులతో ఫైబర్ ఆప్టిక్ సిస్టమ్స్ ఉద్భవించాయి. ప్రస్తుతం ఉపయోగిస్తున్న ఫైబర్ ఆప్టిక్ బ్రాంకోస్కోప్ విభిన్న సాంకేతిక పరిణామాలు, పరిజ్ఞానంతో కూడుకున్నది. దీనిద్వారా శ్వాసనాళాల్లోని పలు శాఖలను స్పష్టంగా పరీక్షించవచ్చు.

ఛాతిలో నీరు, చీము ట్యూమర్లను పరీక్షించి వ్యాధి నిర్ధారణ చేయడానికి ఉపయోగపడే పరీక్షను థోరాకోస్కోపి అంటారు. ఛాతికి మత్తు మందు ఇచ్చి థోరాకోస్కోపి పరికరంతో ఫ్లూరల్ కేవిటి నీ క్షుణ్ణంగా పరీక్షించి అనుమానాస్పదమైన భాగాల నుండి బయాప్సీ ని ఈ విధానంలో చేయవచ్చు. పరీక్ష చేస్తున్న సందర్భంలోనే ఛాతిలోని నీరు, చీమును తీసివేయడం, నీరు చేరిన పాకెట్స్ ను తొలగించడం వంటి చికిత్స జరపవచ్చు. దీని ద్వారా రోగి త్వరగా కోలుకునే అవకాశం ఉంది. శ్వాసకోశ వ్యాధి తీవ్రత ను విశ్లేషించేది స్పైరోమీటర్ పరీక్ష. దీనినే పల్మొనరీ ఫంక్షన్ టెస్ట్ అని అంటారు.

దగ్గు, ఆయాసం, పిల్లికూత, ఛాతీ బిగబట్టినట్లు ఉండటం, దుమ్ము,ధూళి అలర్జీ ఉన్నవారికి, పొగ తాగేవారికి, రసాయన పరిశ్రమల్లో పనిచేసే వారికి స్పైరోమీటర్ పరీక్షంచేస్తారు. పీక్ ఎక్స్ పిరేటరీ ఫ్లో పరీక్ష అనేది చాలా సులభమైన ఖర్చు లేని పరీక్ష. ఛాతీ నిండుగా గాలి పీల్చిన తర్వాత పీక్ ఫ్లో మీటర్ లో గాలిని ఊదితే పీక్ ఎక్స్ పిరేటరీ ఫ్లో పైన ఉన్న పాయింటర్ నిముషానికి బయటకు ఊదగలిగే గాలిని లీటర్లలో సూచిస్తుంది. సాధారణంగా స్త్రీలలో 400 – 500 లీ/ నిముషానికి , అదే పురుషుల్లో 500 – 600 లీ/ నిముషానికి ఉంటుంది. ఈ పరీక్ష ద్వారా ఆస్తమా వంటి వ్యాధి రోజులో ఏ సమయంలో ఎక్కువగా ఉంటుంద. 100 లీ/ నిముషం కంటే తక్కువగా ఉంటే వ్యాధి తీవ్రంగా ఉందని గమనించాలి.

ఆర్టీరియల్ బ్లడ్ లో ఉండే ఆక్సీజెన్, కార్బన్ డై ఆక్సైడ్ , పి హెచ్, బై కార్బొనేట్ పరిమాణాల్ని ఆర్టీరియల్ బ్లడ్ గ్యాసెస్ పరీక్షలో తెలుసుకోవచ్చు. చేతి ముందు భాగం , తొడ నుండి హెపారినైజ్డ్ సిరంజి ద్వారా ఆర్టరీస్ నుండి రక్తం తీసి ఎబిజి మెషీన్ లో పరీక్ష చేస్తారు. అదేవిధంగా పల్స్ ఆక్సీమెట్రి పరీక్ష ద్వారా శరీరంలో ఆక్సీజన్ శాతం తెలుస్తుంది. సూక్ష్మజీవుల వలన శరీరానికి కలిగే అనార్థాలను నిరోధించడానికి వ్యాధి నిరోధక శక్తిని కలిగించే యాంటిబాడీస్ , తెల్ల రక్త కణాలు కృషి చేస్తాయి. ఇటువంటి అతిపెద్ద సురక్షిత వ్యవస్థ ఉన్నప్పటికీ శ్వాసకోశాలు అనేక రుగ్మతలకు గురవుతాయి. ఫలితంగా శరీరానికి ఆక్సిజన్ సరఫరా దెబ్బతింటుంది. ఆస్తమా, బ్రాంకైటిస్ , క్షయ , న్యూమోనియా, సెప్టిసీమియా, ఇంటర్ స్టీషియల్ లంగ్ డీసీజ్ , పల్మొనరీ హైపర్ టెన్షన్, పల్మొనరీ ఎంబాలిజం వంటి వ్యాధుల వలన ఆక్సిజన్ సరఫరాలో తేడాలుంటాయి. తద్వారా ఆయాసం, దగ్గు కాళ్లలో, పొట్టలో నీరు చేరడం, గుండె వైఫల్యం చెందడం లాంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఇటువంటి దశలో వాతావరణంలోని ఆక్సిజన్ తో పాటు కృత్రిమంగా లభ్యమయ్యే ఆక్సిజన్ కూడా తీసుకెళ్ళాల్సి వస్తుంది. కొన్నిసార్లు ఇలా కృత్రిమంగా పీల్చే ఆక్సిజన్ 100 శాతం వరకు ఉండవచ్చు.

కొంతమందిలో కృత్రిమంగా అందజేసే ఆక్సిజన్ వారి జబ్బు నయమయ్యే వరకు మాత్రమే అవసరమైనా , మరికొంతమందిలో దీర్ఘకాలికంగా అవసరం కావచ్చు. అంటే ఇంటి దగ్గర కూడా ఆక్సిజన్ ను కృత్రిమంగా తీసుకోవాల్సిన అవసరం కలగవచ్చు. వీరికి ఆక్సిజన్ సిలిండర్లు వైద్యుల సలహా మేరకు లభ్యమవుతాయి. అయితే ఈ ఆక్సిజన్ సిలిండర్లు అయిపోగానే మార్చుకునేందుకు వీలుగా ప్రస్తుతం ఆక్సిజన్ కాన్సెంట్రేటర్స్ లభ్యమవుతున్నాయి. ఈ యంత్రాల ద్వారా గాలిలో ఉండే 20.9 శాతం ఆక్సిజన్ ను 90 – 95 శాతం వరకు పెంచి నిరంతర సరఫరా ఉండేలా చేయవచ్చు. అలాగే ఎలర్జీ వ్యాధి కారకాలను ఇమ్యునో థెరపీ పరీక్ష ద్వారా కనుగొనవచ్చు. చర్మంలో ఎలర్జీ కారకాలను ఇంజెక్షన్ ల ద్వారా ప్రవేశపెట్టి అవి ఎలర్జీ కలిగిస్తున్నాయో లేదో తెలుసుకోవచ్చు. బ్రాంకియల్ థెర్మోప్లాస్టి అనే అధునాతన చికిత్సా విధానంలో బ్రాంకోస్కొపీ ద్వారా శ్వాసనాళాల చుట్టూ ఉండే కండరాల బిగుతునూ తగ్గించి వ్యాధి లక్షణాలను తగ్గించవచ్చు. ప్రస్తుతం ఇది ఇంకా పరిశోధన స్థితిలోనే ఉంది.

గాలిలో ఉండే రసాయన పదార్థాలు సల్ఫర్‌డై ఆక్సైడ్ , హైడ్రోజన్‌ సల్ఫైడ్ , క్లోరిన్‌ , నైట్రికి ఆక్సైడ్ లను మనం పీల్చినప్పుడు దగ్గు , కఫం , పిల్లికూతలు , ఛాతీ పట్టేయడం జరుగుతుంది. కొందరిలో కెమికల్‌ నీమోనైటిస్‌ అనే సమస్య వస్తుంది. కొందరిలో వాతావరణ మార్పులు జరుగుతు న్నప్పుడు వైరల్‌ ఇన్‌ఫెక్షన్లు వస్తుంటాయి.

వీరిలో జలుబు , జ్వరం , ఒళ్లునొప్పులు , ఆకలి మందగించడం , తలపోటు వంటి లక్షణా లు ఉంటాయి.ఇలా సంవత్సరంలో రెండు , మూడు సార్లు వైరస్‌ ఇన్‌ఫెక్షన్లు రావచ్చు. రెస్పిరేటరీ సిన్నసషియల్‌ వైరస్‌ , రైనోవైరస్‌ , ఇన్‌ఫ్లూయెంజా వైరస్‌ దీనికి కారణం , వ్యాధి నిరోధక శక్తి మందగించినప్పుడు ఇలాంటి వారిలో న్యూమెనియా కూడా రావచ్చు. దీనికి కమ్యూనిటీ ఆకై్వర్డ్‌ న్యూమోనియా అంటారు. దగ్గినపుడు , తుమ్మినపుడు శ్వాసనాళాలో నుండి వెలువడే గాలి తుంపరల వల్ల ఒకరినుండి మరొకరికి జబ్బులు వస్తాయి. క్షయవ్యాధి ఉన్నవారు దగ్గినప్పుడు వారిలో ఉండే టి.బి. బ్యాక్టీరియా గాలి తుం పర్ల ద్వారా ఇతరుల ఊపిరితిత్తులలోకి చేరుకుంటాయి. ఇవి వ్యాధి నిరోధక శక్తి వలన నిస్తేజమవుతాయి. కాబట్టి కొద్దిమందిలో మాత్రమే వ్యాధి ప్రబలే అవకాశం ఉంది.ఈ వ్యాధి ఇతరులకు రాకుండా ఉండాలంటే దగ్గినప్పుడు మొహానికి అడ్డంగా రుమాలు ఉంచుకోవడం ఎంతైనా అవసరం. ఉదరకోశపు క్షయ వ్యాధి సోకిన వారిలో ఉదరంలోని అవయవాన్ని అనుసరించి వివిధ లక్షణాలను ప్రదర్శిస్తుంది కనుక వీటిని నిర్ధారించడానికి కంప్యూటెడ్‌ టోమోగ్రఫీ (సి.టి.) స్కాన్‌ పరీక్ష చేయాల్సి ఉంటుంది.

సాధారణంగా వ్యాధి నిర్ధారణ పరీక్షల్లో అంతర్గత అవయవాల్ని పరీక్షించటం జరుగుతుంది. కానీ అదే సమయంలో వ్యాధిగ్రస్థమైన ప్రాంతాన్ని గుర్తించి అక్కడి నుంచి చిన్న ముక్కను కత్తిరించి తీసే బయాప్సీ చేస్తారు. ముక్క సేకరించే ప్రదేశం ఎంపికలో పొరపాట్లు దొర్లొచ్చు. కానీ ఈబస్‌ పరీక్షలో ఇలాంటి పొరపాట్లకు ఆస్కారం ఉండదు. శ్వాసనాళం లేదా అన్నవాహిక ద్వారా స్కానింగ్‌, బయాప్సీ… రెండు పనుల్నీ ఏకకాలంలో చేయొచ్చు. టిబి లేదా కేన్సర్‌ గడ్డలు, ఇతర శ్వాస సమస్యలు ఊపిరితిత్తుల్లోనే కాకుండా ఈ రెండింటి బయట లేదా ఛాతీ మధ్యలో, లింఫ్‌ గ్రంథుల్లో కూడా రావొచ్చు. కాబట్టి ఈ అవయవాలను క్షుణ్ణంగా పరీక్షించి అదే సమయంలో బయాప్సీ కోసం ముక్కను సేకరించటం కోసం బ్రాంఖోస్కోప్‌ నీడిల్‌కు అల్ర్టాసౌండ్‌ చేస్తారు. ఇందుకోసం ఈబస్‌ పరికరాన్ని పేషెంట్‌ నోటి ద్వారా శ్వాసనాళం గుండా ఊపిరితిత్తుల్లోకి ప్రవేశపెడతారు. ఈ పరీక్షలో కోతలుండవు. రోగికి మత్తు ఇస్తారు. పరీక్షకు ముందు ఆహారం తీసుకోకూడదు. పరీక్ష మొత్తానికి ఆరు గంటల సమయం పడుతుంది. శ్వాస, రక్తనాళాలు, ఊపిరితిత్తులు, లింఫ్‌నోడ్స్‌ ఉపరితలాలు, అంతర్భాగాలను రియల్‌టైమ్‌ ఇమేజింగ్‌ ద్వారా స్పష్టంగా చూడొచ్చు. ఛాతీలో గడ్డలను కనిపెట్టడం కోసం మొదట ఎక్స్‌రే, సీటీ స్కాన్‌ చేస్తారు. ఆ తర్వాత మరింత లోతైన ఇన్వెస్టిగేషన్‌, కచ్చితమైన వ్యాధి నిర్థారణ కోసం ఈబస్‌ పరీక్షను వైద్యులు ఎంచుకుంటారు.

Leave a Comment