మార్నింగ్ వాక్.. ప్రతిరోజూ ఉదయం మనకు చాలామంది రోడ్ల పక్కన, వీధుల్లో, పార్కుల్లో నడుస్తుండటం చూస్తుంటాం. ఇలా మార్నింగ్ వాక్ చేయడం కొందరికి ప్రయోజనంగా ఉంటే మరికొందరికి నష్టాన్ని తెచ్చిపెడుతుంది. వినడానికి విడ్డూరంగా ఉన్నా ఇది నిజమండీ.
చలికాలం ప్రారంభమైందంటే చాలు చిన్నారులు, యువకులు, వృద్ధులనే తేడా లేకుండా ఉదాయాన్నే నిద్రలేచి పరుగులు తీస్తుంటారు. ఆరోగ్యంగా ఉండేందుకు ఉత్సాహం కనభరుస్తుంటారు. కానీ అలర్జీలు ఉన్నవాళ్లు చాలా ఇబ్బంది పడే కాలమిది . ఈ చలికి కాలుష్యం కూడా తోడైతే మామూలు వ్యక్తుల్లోనూ అలర్జీలు రావచ్చు. అది శ్వాసకోశవ్యవస్థపై దుష్ర్పభావం చూపిస్తాయి. అందులోనూ ఉదయం చల్ల గాలిలో ఎక్సర్సైజ్ లు చేయడం వల్ల ఛాతీ సంబంధమైన జబ్బులు ఉన్నవారికి ప్రమాదకరంగా పరిణమిస్తాయి. చల్లా గాలిలో వ్యాయామం చేస్తుండడం వల్ల ఈ సమయంలో ఊపిరితీసుకునేటప్పుడు విష వాయువులు శ్వాస మార్గంలో ప్రయాణం చేసి, లంగ్స్‌లోని లోపలి పోరలపై దుష్ర్పభావం చూపుతాయి. ఫలితంగా దగ్గు, జ్వరం, అకస్మాత్తుగా శ్వాస అందకపోవడం, ఊపిరితీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలు తలెత్తుతాయి.
ఆస్తమా రోగులకు కూడా ఈ మార్నింగ్ ఎక్సర్సైజ్ లు మరింత హానికరం. గాలిలోని కాలుష్యాలన్నీ ఆస్తమాను ప్రేరేపించే అంశాలే. గాలి కాలుష్యం వల్ల ఆస్తమా రోగుల్లో ఊపిరితిత్తులకు గాలిని తీసుకెళ్లే మార్గాలన్నీ ఒక్కసారిగా కుంచించుకుపోతాయి. ఆ మార్గంలో ఉన్న కణాల్లోనూ మంట, వాపు వస్తుంది. ఈ వాపువల్ల శ్వాసమార్గం మరింత సంకోచిస్తుంది. దాంతో శ్వాస తీసుకోవడం మరింత కష్టమవుతుంది. అందుకే ఈ ఆస్తమా వ్యాధిగ్రస్తులు చలికాలంలో మరింత జాగ్రత్తపడాలి. ఒక్క ఆస్తమాయే కాదు బ్రాంకైటిస్, క్రానిక్ అబ్‌స్ట్రక్టివ్ పల్మునరీ డిసీజ్ సమస్యలతో బాధపడుతున్నవారికి కూడా మార్నింగ్ ఎక్సర్సైజ్ లు అంత శ్రేయస్కరం కాదు. అజీర్ణం నుంచి అర్థరైటిస్ వరకు… రక్తపోటు నుంచి గుండెపోటు వరకు… మధుమేహం నుంచి మానసిక సమస్య వరకు ఏ సమస్య తీసుకున్నా .. నివారణకు ఉపయోగించే ఒకే ఒక్క మంత్రం వ్యాయామం. ఆరోగ్యాన్ని పదిలపర్చే వ్యాయామంతో ఇలాంటి వ్యాధులే కాదు… ఇతర మరెన్నో రోగాలనూ దూరం చేసుకోవచ్చు. మనస్సును నవయవ్వనంగా మలుచుకోవచ్చు.
ఆరోగ్యం కోసం మనం ఉదయం వేళ నడక సాగిస్తుంటాం. ఈ మార్నింగ్ వాక్‌తో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. కానీ పండుగ రోజు బాణాసంచా కాలడం వల్ల వెలువడ్డ పొగ రాత్రి అయ్యే కొద్దీ మరింత దట్టమవుతుంది. ఈ చలికాలంలో ఉదయం వేళల్లో మంచు కురుస్తుంటుంది, రాత్రివేళ వెలువడ్డ స్మోక్, ఉదయం వేళల్లో ఏర్పడే ఫాగ్ కలిసి ‘స్మాగ్’ అనే అపాయకరమైన పొగమంచుగా ఏర్పడుతుంది. ఈ స్మాగ్ ఆస్తమాతో పాటు ఎన్నో ఊపిరితిత్తుల సమస్యకు కారణం కావచ్చు. అందుకే పండుగ తర్వాత మర్నాటి ఉదయం ‘మార్నింగ్ వాక్’కు వెళ్లకపోవడమే మంచిది. శ్వాస సమస్యలతో ఇబ్బందిపడుతున్న వారికి నడుస్తున్నప్పుడు గుండెలో నొప్పి, ఆయాసం, అతిగా చెమట పట్టటం, అతి నీరసం, అలసట, కళ్లు తిరగటం, తూలి పోవటం, పక్కల్లో నొప్పి.. ఇలాంటి లక్షణాలు కనబడితే వెంటనే వ్యాయామాన్ని ఆపేసి వైద్యుడిని సంప్రదించాలి. అశ్రద్ధ పనికిరాదు. నలభై ఏళ్లు దాటిన వారూ, స్థూలకాయులూ, కొన్ని రకాల అనారోగ్యాలతో కొన్నేళ్లపాటు వ్యాయామం చేయని వారూ ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి.
సుఖవంతమైన శ్వాస కోసం జాగ్రత్తలు
- ఉదయం ఇంటి దగ్గరే ఉంటూ తేలికపాటి వార్మప్ ఎక్సర్సైజ్ లు చేయాలి.
- కిటికీలు, తలుపులూ అన్నే మూసి యోగా చేయండి.
- ఒకవేళ తప్పనిసరిగా బయటే వ్యాయామం చేయాలనుకుంటే ముఖానికి మాస్క్ ధరించాలి.
- చేతులకు గ్లౌస్ లు తొడుక్కోవాలి. .
- పాదాలకు రక్షణగా సౌకర్యంగా ఉన్న బూట్లను ధరించాలి.
- ఇంట్లోకి పొగ వస్తుంటే సర్జికల్ మాస్క్‌ను గానీ లేదా పరిశుభ్రమైన బట్టను ముక్కుకు కట్టుకోండి.
- ఆస్తమా సమస్యతో బాధపడుతున్నవారు సమస్య వచ్చిన సమయంలో వాడే ఇన్‌హేలర్‌తో పాటు సమస్య రాకుండానే నివారించే ‘ప్రివెంటర్ ఇన్‌హేలర్స్’ వాడాలి. కేవలం ఆస్తమా రోగులు మాత్రమే కాకుండా రక్తపోటును, చక్కెరను అదుపులో ఉంచే రోగులు సైతం ఈ జాగ్రత్తలను తప్పకుండా పాటిస్తే శ్వాస సమస్యలతో బాధపడేవారు ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా చూసుకోవచ్చు.