మనసుకి బాధ కలిగినపుడు మన కళ్ళు కన్నీళ్ల ద్వారా బాధను వ్యక్తపరుస్తాయి. మరి కళ్లకే బాధ కలిగితే ? అప్పుడు కూడా కంటికి కన్నీళ్లే అవసరమవుతాయి. అవును… మన కంటి విషయంలో కన్నీళ్ళకు ఉన్న ప్రాముఖ్యత అటువంటిది. కంట్లో కన్నీళ్ళు తగ్గాయంటే ఇక ఆ కంటికి ఇబ్బందులు తప్పవు. బండి చక్రాలు తిరగడానికి ఆయిల్ ఎంతగా సహకరిస్తుందో మన కళ్ళను అటు ఇటు సునాయాసంగా తిప్పడానికి కన్నీళ్లు కూడా అంతే సహకరిస్తాయి. అసలు కంట్లో నీళ్ళు ఎందుకు తగ్గుతాయి ? కన్నీళ్లు తగ్గితే ఏమవుతుంది ?
ఈ రంగుల ప్రపంచాన్ని ముందుగా దర్శించేవి మన కళ్లే. ఎందుకంటే మనం దేన్నైనా ముందుగా కళ్ళతోనే ఆస్వాదిస్తాం కళ్ళతోనే స్వీకరిస్తాం. అందుకే ఇంద్రియాలన్నిటిలోకెల్లా నయనం ప్రధానం అన్నారు. అంతేకాకుండా మన అవయవాలన్నింటిలోకెల్లా అతి సున్నితమైన అవయవంగా కూడా కళ్ళనే చెప్పుకోవచ్చు. మరి కంటి చూపు సరిగా ఉండాలన్నా కంటికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా కళ్ళు పొడిబారకుండా ఉండాలన్నా కంట్లో తేమ ఆరిపోకుండా ఉండటం చాలా ముఖ్యం. ఎప్పుడైతే కంట్లో తేమ ఆరిపోతుందో అప్పుడు కళ్ళు పొడిబారతాయి. ఆ సమయంలో కంటికి కొంత ఇబ్బంది కలగవచ్చు. కళ్ళు పొడిబారినపుడు కన్ను నొప్పిగా ఉండవచ్చు, కళ్ళు సున్నితంగా మారవచ్చు, కంట్లో ఇసక పడినట్టుగా గరుకుగా అనిపించవచ్చు, కంట్లో దురద రావచ్చు, కళ్ళు ఎర్రబడవచ్చు లేదా చూపు మసకగా మారవచ్చు. ఈ లక్షణాలు మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతున్నట్టైతే మీరు తప్పకుండా డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది.
వాతావరణంలో మార్పులతో పాటూ కొన్ని రకాల జబ్బులు, వయసుపైబడటం, కొన్ని రకాల మందులు వాడటం వల్ల కూడా కళ్ళు పొడిబారవచ్చు. ఇవే కాకుండా సాధారణంగా 50సం. పైబడిన వారిలోనూ మనం ఈ సమస్యని చూడవచ్చు. స్త్రీ శరీరంలో హార్మోన్ల లో మార్పులు జరుగుతున్నపుడు కూడా ఈ సమస్యని గుర్తించవచ్చు. విటమిన్ ఎ తక్కువగా ఉన్న ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా ఈ సమస్యని ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే కాంటాక్ట్ లెన్సులు వాడుతున్నవారిలోనూ కళ్ళు తొందరగా పొడిబారే అవకాశం ఉంది అంటున్నారు నిపుణులు.
ఒటిసి ఐ డ్రాప్స్ వాడటం ద్వారా కళ్ళు పొడిబారకుండా కాపాడుకోవచ్చు. దీర్ఘకాలికంగా ఈ సమస్య మిమ్మల్ని వేధిస్తున్నట్టైతే ఐ డ్రాప్స్ రోజుకి రెండు మూడుసార్లు కూడా వాడుకోవచ్చు. కొన్ని జాగ్రత్తల ద్వారా కళ్ళు పొడిబారడాన్ని నివారించవచ్చు. వాహనాలు నడిపే సమయంలో గాలి నేరుగా మీ కంటికి తగలకుండా కంటి అద్దాలను ధరించాలి. కంప్యూటర్ ముందు చాలాసేపటి వరకు పనిచేయాల్సి వస్తే మధ్య మధ్యలో కళ్ళకు విశ్రాంతినివ్వాలి. మీ కంప్యూటర్ స్క్రీన్ ను కంటి చూపుకి సరిపోయే లెవెల్లో ఉంచుకోవాలి. పోగాత్రాగే అలవాటు ఉన్నవారు దానిని మానేయడం మంచిది. అలాగే పొగతాగేవారికి దూరంగా ఉండాలి. దీర్ఘకాలికంగా ఈ సమస్యతో బాధపడేవారు తరచుగా ఐ డ్రాప్స్ వాడటం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.
అయితే కళ్ళు పొడిబారడం అనేది ఏ వయసు వారిలోనైనా వచ్చే సమస్యే. కళ్ళు పొడిబారకుండా ఉండాలంటే ముందుగా బైక్ పై ప్రయాణాలు చేసే వారు నల్లని కూలింగ్ గ్లాసెస్ ధరించడం మంచిది. కొన్ని జబ్బులకు వాడే మందుల వల్ల కూడా ఈ సమస్య రావచ్చు. వాటిలో ముఖ్యంగా ఇఎన్ టి సమస్యలకు, బిపి వంటి దీర్ఘకాలిక జబ్బులకు వాడే మందులు కూడా కారణం అవుతాయి అంటున్నారు నిపుణులు. సరియైన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కళ్ళు పొడిబారడం, కళ్ళలో మంట నొప్పి వంటి ఇతర సమస్యలను కూడా దూరం చేస్కోవచ్చు.