వంటకాల్లో ఉప్పు లేకపోతే రుచి రాదు. అదే సందర్భంలో వంటకాల్లో ఉప్పు ఎక్కువయితే ఏమి చేయలేని పరిస్థితి తలెత్తుతుంది. వంటకాల రుచికి ఉప్పు ఎంత ముఖ్యమో.. మనం ఆరోగ్యంగా ఉండటానికి ఉప్పును తగిన మోతాదులో తీసుకోవడం అంతే ముఖ్యమని సెలవిస్తున్నారు పోషకాహార నిపుణులు. ఉప్పు అధికంగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండటం చాలా మంచిది.
నిత్యం మనం చేసుకునే ఏ వంటలో అయినా ఉప్పు కచ్చితంగా ఉండి తీరాల్సిందే. ఉప్పు లేకుండా కూరలను చేసుకుని తింటే అవి రుచించవు. అయితే ఉప్పుతో వంటలకు రుచి వచ్చే మాట వాస్తవమే అయినప్పటికీ ఉప్పును ఎక్కువగా తింటే అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. సాధారణంగా ఒక ఆరోగ్యవంతమైన వ్యక్తి నిత్యం 3.75 గ్రాముల వరకు ఉప్పు తినవచ్చని చెబుతుంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. అయితే భారతీయులు రోజూ దాదాపు 11 గ్రాముల ఉప్పు తినేస్తున్నారు. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాల్లో ఉప్పు వాడకం ఎక్కువ. ఉప్పు ద్వారా ఒంట్లో సోడియం స్థాయి పెరుగుతుంది. కాబట్టి ఉప్పు మోతాదు తగ్గించుకోవడం మంచిది.
ప‌్రస్తుత రోజుల్లో ఎవరి నోట విన్నా ఆహారంలో ఉప్పు తగ్గించాలనీ.. ఉప్పు వాడకం పెరిగితే రక్తపోటు వచ్చి ప్రమాదకరమైన పరిణామాలెన్నో జరుగుతాయనే మాటలు సర్వత్రా వింటున్నాం. చిటికెడే కదా అని ఉప్పును తేలికగా తీసుకొంటే దాని పరిణామాలు విపరీతంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు వైద్యనిపుణులు.
శరీరానికి అవసరమైన ప్రధానలవణాల్లో ఉప్పు ఎన్నో కీలకమైన బాధ్యతలు నిర్వహిస్తుంది. అయితే మితిమీరిన ఉప్పు రక్తనాళాల్లో రక్తం ప్రవహించే వేగం పెరిగి మూత్రపిండాలపై తీవ్రప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. అలాగే రక్తపోటు, డయాబెటిస్, గుండెజబ్బులు, పక్షవాతం వంటి సమస్యలు ఉన్నవారిలో కూడా ఉప్పు ఎక్కువ ప్రభావం చూపుతుంది. ఉప్పు ఎక్కువగా తినడం వల్ల శరీరం డీహైడ్రేషన్‌కు లోనవుతుంది. ఫలితంగా వికారం, వాంతులు, కళ్లు తిరగడం, డయేరియా వంటి సమస్యలు వస్తాయి. సోడియం కాంటెంట్ పెరగడం వల్ల ఆస్ట్రియోపోరోసిస్ వంటి ఎముకల వ్యాధులు కూడా దండెత్తుతాయి. ఎక్కువ ఉప్పును తీసుకోవడం వల్ల జీర్ణాశయ లైనింగ్ ను డ్యామేజ్ చేసి హెలికోబ్యాక్టర్ ఫైలోరి ఇన్ఫెక్షన్ పెంచుతుంది.
ప్యాక్ చేయబడిన చిక్కుళ్లు, టిన్నుల్లో అమ్మే ట్యూనా ఫిష్, నిల్వ ఉంచిన చేపలు, నిల్వ ఉండే ఆహారాలను తినకూడదు. ఇవి రక్తంలో సోడియం పరిమాణాన్ని పెంచుతాయి. అప్పడాలు, పచ్చళ్లు, బేకరీ ఐటమ్స్, సాస్, నిల్వ ఉంచే ఫ్రోజెన్ ఫుడ్స్, ఫాస్ట్‌ఫుడ్స్, స్మోక్‌డ్ మాంసాహారం, చీజ్, సలాడ్స్, సాల్టెడ్ చిప్స్ వంటి నిల్వ ఉంచే చిరుతిండ్లు, దీర్ఘకాలం నిల్వ ఉంచేందుకు వీలుగా రూపొందించిన శ్నాక్స్ లలో ఉప్పు శాతం ఎక్కువగా ఉంటుంది. అందుకని వీటికి దూరంగా ఉండాలి. పాలతో తయారు చేసే చీజ్‌లో కొన్ని కంపెనీలు రుచి కోసం ఉప్పు కలుపుతాయి. ఇలాంటి చీజ్‌ను తింటే శరీరంలో సోడియం పెరిగిపోయి హైబీపీ వస్తుంది.
జాతీయాల్లో, నుడికారాల్లో అది కోరికలకూ, కృతజ్ఞతకూ ప్రతీక. ఇలా సంస్కృతిలో దానిస్థానం ఎంత పదిలమో.. ఆరోగ్యం విషయంలోనూ అంతే ప్రధానం. ఉప్పు తక్కువైతే మనం తినే ఆహారం ఎలా రుచిలేకుండా ఉంటుందో.. ఉప్పు ఎక్కువైతే కూడా ఆరోగ్యాన్ని నాశనం చేస్తుంది. సో ఉప్పుతో తస్మాత్ జాగ్రత్త.