Health Tips – డైట్ విషయంలో మనం చేసే తప్పులు ఏంటి?

By manavaradhi.com

Published on:

Follow Us
10 Diet Mistakes and How to Avoid Them

కొంతమంది తమకు నచ్చిన ఫుడ్స్ ని నోటికి రుచిగా ఉంటే చాలు అదేపనిగా తినేస్తుంటారు. కానీ వారికి ఏది తినాలో, ఎంత మోతాదులో తినాలో, ఎప్పుడు తినాలో తెలియక అనేక అనారోగ్య సమస్యలను కొనితెచ్చుకుంటున్నారు. ఇలాంటివారికి డైట్ విషయంలో పోషకాహార నిపుణుల సలహాలు తప్పనిసరి.

ఇటీవ‌ల చాలామంది డైటింగ్ చేయ‌డంపై దృష్టిసారిస్తున్నారు. త‌మ శ‌రీరానికి ఏది సరిపడుతుందో తెలియ‌కుండానే ఇష్టం వచ్చినట్లు డైటింగ్ చెస్తూ ఆరోగ్య స‌మ‌స్య‌ల‌ను కొనితెచ్చుకుంటున్నారు. ముందుగా మన శ‌రీరానికి ఎలాంటి డైటింగ్ అవ‌స‌ర‌ముంటుందో తెలుసుకోవాలి. డైటింగ్ పేరుతో రోజుల తరబడి కడుపు మాడ్చుకోవడం వలన జీవప్రక్రియ దెబ్బతింటుంది. దాని ప్రభావం కండరాల మీద పడి చిన్న వయసులోనే కీళ్ళనొప్పుల వంటి స‌మ‌స్య‌లు చుట్టుముడుతుంటాయి. త్వరగా తగ్గలన్న తొందరలో అప్పటికున్న ఆరోగ్య పరిస్థితులు, శారీరక, మానసిక సామర్థ్యాలను పట్టించుకోకుండా ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు డైటింగ్‌ చేసేస్తే ఉన్న ఆరోగ్యానికే ముప్పు ఏర్పడే ప్రమాదం ఉంది. అందుకే డైటింగ్‌ చేయబోయే ముందు కొన్ని నియమ నిబంధనలు తెలుసుకోవడం చాలా ముఖ్య‌మంటున్నారు పోష‌కాహార నిపుణులు.

డైటింగ్‌ ప్రారంభానికి ముందు మీ శారీరక, మానసిక సామర్థ్యాల స్థితిని అంచనా వేసుకోండి. ఇది మిమ్మ‌ల్ని క్ర‌మం త‌ప్ప‌కుండా ఆహార నియ‌మాలు పాటిచేలా చేస్తుంది. ఎప్పటికప్పుడు ఆ పూట భోజనాన్ని మానేద్దామని చూడకూడదు. ఇది మన శరీరాన్ని మనమే హింసించుకోవడం అవుతుంది. అందువల్ల వారమంతా పాటించే భోజన నియమాల గురించి ముందే ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటే అనుసరణలో ఒక అస్తవ్యస్త పరిస్థితి ఏర్పడదు.

ఇటీవల చాలామంది ఆరోగ్యకర జీవితంపై ఫిట్‌నెస్‌పై ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారు.. డైట్‌ విషయంలో అశ్రద్ధ వహిస్తున్నారు. డైటింగ్‌ చేయాలనుకునే వారు ముందుగా డైటీషియన్‌ను కలిసి వారి సూచనల మేరకు డైట్ ను ప్రారంభించాలి. భోజనానికీ భోజనానికీ మధ్య ఎక్కువ గ్యాప్‌ తీసుకుంటూ బరువు పెరగకుండా తామేదో చాలా జాగ్రత్తపడుతున్నట్లు కొందరు భావిస్తారు. వాస్తవానికి అలా ఎక్కువ గ్యాప్‌ పాటించేవారే ఆ తర్వాత భోజనంలో ఎక్కువగా తినేస్తారు. దీనివల్ల వారు పాటిస్తున్న డైటింగ్‌ అసలు లక్ష్యమే దెబ్బ తింటుంది. అందువల్ల రోజుకు మూడు సార్లే తినడం కాకుండా, తక్కువ మోతాదుల్లో రోజుకు నాలుగు లేదా ఐదుసార్లు తినే విధానాన్ని అనుసరించాలి. దీనివల్ల మీ ఆకలి అదుపులో ఉండి అతిగా తినే పరిస్థితిలో పడిపోకుండా ఉంటారు.

చాలా మందిలో సమయానుకూలంగా వ్యవహరించే తత్వం ఉండదు. అంటే పనిచేసే వేళలు కొందరికి మిగతా వారికన్నా భిన్నంగా ఉండవచ్చు. అలాంటి వారు అందుకు అనుకుణంగానే భోజనం వేళల్ని పాటించాలి. డైటింగ్‌ ప్రారంభించిన తొలి రోజుల్లో శరీరం బరువు కాస్త వేగంగానే తగ్గుతుంది. అయితే అంతే వేగంగా బరువు తగ్గడం ఆ తర్వాతరోజుల్లో తగ్గడం సాధ్యం కాదు. అది శరీరంలోని సహజ ధర్మం. ఆ విషయాన్ని గమనించకుండా అంతే వేగంగా తగ్గాలని, భోజనం మోతాదును మరింతగా తగ్గించివేయడం ఎంత మాత్రం సరికాదు. అలా చేయడం వల్ల శరీరం బాగా బలహీనపడి ఒక దశలో ఓపికే లేకుండా పోయి డైటింగ్‌ మానేసే ప్రమాదం ఉంది. అందువల్ల బరువు తగ్గడానికి ఒక నియమం పెట్టుకుని దానికి అనుగుణంగానే బరువు తగ్గడానికి ప్రయత్నించాలి.

ఆహారం ఏమేం తినాలి అనే దానితో పాటు ఏ విధంగా తినాలి అనే స్పష్టత కూడా ఉండాలి. బరువు తగ్గడానికి కొంతమంది పగలంతా తక్కువ ఆహారం తింటుంటారు. సాయంత్రం అయ్యేసరికి పూటుగా లాగించేస్తారు. ఇలా చేస్తే ఎంత డైట్ చేసినా ఫలితం ఉండదు. ముఖ్యంగా లేట్ నైట్ డిన్నర్లు మానేయాలి. అలాగే బరువు తగ్గాలనే ఉద్ధేశంతో కొందరు ఉదయం అల్పాహారం మానేస్తారు. ఇది మరింత ప్రమాదం. నిద్ర లేచిన తరువాత మూడు గంటల్లోపు ఖచ్చితంగా ఏదో ఒక ఆహారం తీసుకోవాలి. కొంత మంది బరువు తగ్గడానికి భోజనంలో కార్బోహైడ్రేట్లు పూర్తిగా మానేద్దామనుకుంటారు. కానీ, డైటింగ్‌ చేసే కాలంలో కూడా శరీరానికి కార్బోహైడ్రేట్లు తప్పనిసరి అవసరమవుతాయి. నిజానికి కార్బొహైడ్రేట్లు చాలా తొందరగా కడుపు నిండిన భావనను కలిగిస్తాయి. దీనివల్ల మనకు తెలియకుండానే బరువు తగ్గే అవకాశం ఉంది. కాకపోతే కార్బోహైడ్రేట్లను ఎంత మోతాదులో తీసుకుంటున్నామన్నదే ఇక్కడ ముఖ్యమవుతుంది.


ఏమైనా, బరువు తగ్గడానికి పరిమితిని పాటించడాన్ని మించిన పక్కా వైద్యం మరొకటి ఉండదు. మార్కెట్లో దొరికే ఫిజ్జ, డ్రింక్స్ క్యాలరీలతో నిండి ఉండటం వల్ల బరువు మరింతగా పెరుగుతుంది. కానీ బరువు తగ్గాలనుకుంటే వాటికి దూరంగా ఉండాలి. శరీర బరువు తగ్గాలని డైటింగ్ చేసే వాళ్లు ముంచినీళ్ల తాగే విషయంలో కూడా తప్పనిసరిగా జాగ్రతలు పాటించాలి. బాగా నీళ్లు తాగాలి. డీహైడ్రేషన్‌ శరీరానికి మచిది కాదు. అందులోనూ డైట్‌ పాటించేటప్పుడు తప్పనిసరిగా నీళ్లు తాగాలి.

Leave a Comment