కంటి అలసట అన్నది నేడు సాధారణ సమస్యగా మారిపోయింది. దీనికి అనేక కారణాల వలన కలుగుతుంది. నిద్రలేమి, విశ్రాంతి లేకపోవటం, అలర్జీలు, దృష్టి లోపం, ప్రకాశవంతమైన కాంతికి ఎక్స్పోజర్, తక్కువ కాంతిలో ఎక్కువసేపు చదవడం, దీర్ఘకాలం డిజిటల్ పరికరాల వద్ద గడపటం ,కొన్ని రకాల కంటి సమస్యలు. ఐ స్ట్రెయిన్ చాలా అసౌకర్యానికి కారణమవుతుంది.
సర్వెంద్రీయానాం నయనం ప్రధానం అన్నారు పెద్దలు. నిజమే.. మన శరీరంలో ఎంతో ముఖ్యమైన అవయవాల్లో కళ్ళు కీలకమైనవి. ఇలాంటి కంటి పట్ల చాలామంది అశ్రద్ధ చూపిస్తున్నారు. విపరీతమైన ఒత్తిడికి గురిచేస్తున్నారు. దీంతో అలసటకు గురవుతాయి. ఈ కంటి అలసట తగ్గించటానికి ఐ డ్రాప్స్ తో పాటు ఇతర మందులు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. అంతేకాదు కొన్ని టిప్స్ పాటిస్తే కూడా ఎంతో ప్రయోజనం ఉంటుంది. ముఖ్యంగా ప్రతిరోజూ రోజువారీ మీ కనురెప్పలకు నిదానంగా మసాజ్ చేయండి. ఇలా చేయటం వలన కళ్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.
మీ కళ్ళ చుట్టూ ఉన్న కండరాలకు విశ్రాంతి లభిస్తుంది. అదే సమయంలో కన్నీటి గ్రంధులను ప్రేరేపించి కళ్ళను పొడి బారకుండా ఉంచుతుంది. ఎక్కువగా చదవడం లేదా డెస్క్టాప్, ల్యాప్టాప్ లేదా టెలివిజన్ తెర ముందు చాలా సమయం గడపటం వలన కలిగే కళ్ల అలసట దూరం చేసి విశ్రాంతి కలుగజేయడానికి ఉపయోగపడుతుంది . సూర్యకాంతి మీ కళ్ళకు చాలా మంచిది. చర్మం కమలిపోకుండా నివారించేందుకు ఉదయం తొమ్మిది గంటల లోపు ఎండ తగిలే ప్రదేశంలో నిలుచోవాలి. కళ్ళు మూసుకుని సూర్యకాంతి మీ కనురెప్పలపైన పడేట్లుగా చూసుకోవాలి. మీ కళ్ళకు వేడి తగిలిన భావన కలగగానే నెమ్మదిగా పైకి, క్రిందికి మీ కళ్ళను ఎడమవైపుకు,కుడివైపుకు , అపసవ్యంగా కదిలించాలి.
సాధారణంగా కంటి వ్యాయామాలు కళ్ళ ఒత్తిడి నుండి ఉపశమనం కలిగిస్తాయి. కంటి వ్యాయామం వలన కళ్ళ రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. కంటి కండరములు అనువుగా తయారవుతాయి. మీకు ఎదురుగా మీ భుజం పొడవు ఉన్న ఒక పెన్ లేదా పెన్సిల్ గాని పట్టుకోండి. దానిపై దృష్టి పెట్టండి. కంటి అలసటను నిరోధించడానికి మంచి కంటి చూపు ఆస్వాదించడానికి కంటి వ్యాయామాలు ప్రతిరోజూ చేయాలి. ఇందుకు కోల్డ్ వాటర్ చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇది రక్త ప్రసరణ మెరుగుపరచడానికి, అలసటతో ఉన్న కళ్ళ చుట్టూ కండరాలకు విశ్రాంతి కలగటానికి ,కంటి వాపును తగ్గించడానికి ఉపయోగపడుతుంది.

నేడు పిల్లలు ఎక్కువసేపు టీవీ, కంప్యూటర్, ఐ పాడ్, వీడియో గేమ్స్ తో గడపడం వల్ల కంటి అలసట మరింతగా పెరుగుతోంది. దృష్టి లోపం ఎదురవుతుంది. దీంతో చాలామంది అతి చిన్న వయసులోనే కళ్లద్దాలు వాడాల్సి వస్తోంది. అయితే పిల్లల కండ్ల అలసట నివారణకు అనేక మార్గాలు ఉన్నాయి. రెండు సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలు టీవీ, కంప్యూటర్ లేదా ఇతర డిజిటల్ వస్తువుల మీద అస్సలు సమయాన్ని వెచ్చించకూడదు. రెండు సంవత్సరాలకంటే ఎక్కువ వయసున్న పిల్లలు రోజుకి రెండు గంటలకి మించి వీటి మీద సమయం గడపకుండా చూసుకోవాలి. స్క్రీన్కీ కళ్ళకీ మధ్య 35 అంగుళాల దూరం ఉంటే కండ్ల అలసట తగ్గుతుందని రుజువు అయింది. దీనికి తగ్గట్టుగా మీ పిల్లల కంప్యూటర్ మానిటర్ని సరి చేసి కావాల్సి వస్తే అక్షరాల సైజుని పెంచండి. వీడియో గేమ్స్ ”హార్మోన్ డిస్టెన్స్” ని పాటించాలి. అంటే వారి మోచేయి, మొదటి వేలి కణుపు మధ్య ఉన్న దూరం అన్నమాట. మీ పిల్లలు కంప్యూటర్ మీద పనిచేస్తూ మధ్య మధ్యలో పుస్తకాలని రెఫర్ చేస్తోంటే పుస్తకాలని కూడా మానిటర్ అంత దూరంలోనే ఉంచండి. అందువల్ల తరచూ కండ్లు ఫోకస్ సరిచూసుకోవాల్సిన అవసరం తగ్గి కంటి అలసట కూడా తగ్గుతుంది. అలాగే విటమిన్ ఏ ఎక్కువగా ఎండే ఆహారాలు తీసుకోవాలి. గదిలో సరైన వెలుతురు ఉండేలా చూసుకోవాలి. ప్రతీ 20 నిమిషాలకొకసారి కంప్యూటర్ తెర నుండి బయటకి చూసి కనురెప్పతో అటూయిటూ వ్యాయామం చేయాలి. ఇది కండ్లు పొడిబారడాన్ని, కంటి అలసటని కూడా తగ్గిస్తుంది.
శరీరంలోని ఇతర భాగాల వలే కండ్లు కూడా అలసిపోతాయి. అందువల్ల మీ పిల్లలు కనీసం రోజులో అరగంటైనా హాయిగా కండ్లు మూసుకుని విశ్రమించేటట్లు చూడండి. అలా కండ్లు మూసుకున్నప్పుడు కండ్ల మీద చక్రాల్లా తరిగిన కీరా దోసకాయలు లేదా రోజ్ వాటర్లో ముంచిన దూది లేదా వాడేసిన తరువాత ఫ్రీజర్లో ఓ నాలుగైదు గంటలు ఉంచిన టీ బ్యాగ్లని ఉంచండి. వాటిని కండ్లపై ఉంచుకున్నా మంచి ఫలితం ఉంటుంది.