Constipation : ప్రయాణాలు చేస్తున్నారా.. అయితే ఆహారంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి

By manavaradhi.com

Published on:

Follow Us
Constipation on Vacation

సెలవు రోజులు సంతోషాన్ని , ఆనందాన్ని రెట్టింపు చేస్తాయి. ముఖ్యంగా సెలవు రోజుల్లో చాలా మంది ఆనందంగా గడిపేందుకు టూర్లు పెట్టుకుంటారు. ఐతే దీని వల్ల లైఫ్ సైకిల్ మారిపోతుంది. ఆహారం, ఆహారపు అలవాట్లలో తేడా వస్తుంది. ఫలితంగా కొద్ది రోజుల్లోనే కొంత మందిలో మలబద్ధకం మొదలయ్యే అవకాశం ఉంది. మరి దూర ప్రయాణాలు చేసేటప్పుడు ఈ మలబద్ధకం బారిన పడకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి.

సెలవు రోజు వచ్చిందంటే చాలు ఎవరైనా వీలైనంత వరకు సంతోషంగా ఉండటానికే ఇష్టపడతారు. ఇంకొందరు టూర్ ప్లాన్ చేసుకుంటారు. ఐతే ఈ సెలవుల వల్ల రోజువారీ జీవన విధానం పూర్తిగా మారిపోతుంది. ముఖ్యంగా ఆహారం విషయంలో చాలా మార్పులు వచ్చేస్తాయి. ముఖ్యంగా ప్రయాణాల్లో పెద్ద ఎత్తున ఆహార మార్పులు చేసుకోవాల్సి వస్తుంది. దీంతో చాలామందికి మలబద్దకం సమస్య వచ్చే అవకాశం ఉంది. పీచు పదార్థాలు తీసుకోకపోవడం, ఎక్కువగా ప్యాకేజీ ఫుడ్స్ పై ఆధారపడడం, కొత్త కొత్త వంటకాలు తినడం, నీరు సరిగా తీసుకోకపోవడం, ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం.. వాతావరణ మార్పులు లాంటి కారణాలు ఎన్నో ఉన్నాయి…

ప్రయాణాలు చేసేటప్పుడు చాలా మంది ఎక్కువగా ప్యాకేజీ పుడ్స్ మీదే ఆధారపడుతూ ఉంటారు. ఈ ప్యాకేజ్డ్ ఫుడ్స్ ఆరోగ్యకరంగా ఉంటుందని ఆశించడం అంతా మంచిది కాదు. వీటిలో పీచు పదార్థం పాళ్లు చాలా తక్కువ. కాబట్టి ప్రయాణాలు చేసేవారు వీలైనంత వరకు ఈ ప్యాకేజీ ఫుడ్ తీసుకోకుండా ఉంటే మంచిది. మరోవైపు శరీరానికి తగినంత పీచు పదార్థం అందించేందుకు పండ్లు తీసుకోవచ్చు. ఇంటి దగ్గర నుంచి తృణధాన్యాలు తీసుకుని వెళ్ళాలి. వీలైతే డ్రై ఫ్రూట్స్ తీసుకుని వెళితే మరింత మంచిది. ప్రయాణాలు చేసినా, ఇంట్లో ఉన్నా మంచి పీచు పదార్థం ఉన్న ఆహారం తీసుకోకపోవడమే మలబద్దకానికి ప్రధాన కారణం. ప్రయాణాలు చేసే వారు తరచూ స్వీట్లు, చాక్లెట్లు తింటూ ఉంటారు. దీనివల్ల మలబద్దకం మరింత పెరుగుతుంది. ప్రయాణాల్లో ఉన్నా రోజూ రెండున్నర కప్పుల కూరగాయలు, 2 కప్పులు పండ్లు, బీన్స్ తీసుకునేలా చూసుకోవాలి. కాబట్టి తక్కువ ఫైబర్ ఉన్న పదార్థాలను వీలైనంత వరకు తగ్గించడం మంచిది. ముఖ్యంగా చిరు తిళ్లు, పిజ్జాలు, చిప్స్, ఐస్ క్రీములు, డెజర్ట్ లకు దూరంగా ఉండటమే మేలు.

ప్రయాణాల్లో ఎట్టి పరిస్థితుల్లో శరీరాన్ని డీహైడ్రేషన్ కానివ్వకూడదు. డీహైడ్రేషన్ అయితే జీర్ణవ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుంది. కాబట్టి ఎక్కువగా మంచి నీరు తీసుకోవాలి. అలాగే ప్రయాణాల్లో కాఫీ, టీతోపాటు ఆల్కహాల్ కూడా తగ్గించాలి. ప్రయాణాల్లో ఎక్కువ గంటలు కూర్చునే ఉండాల్సి వస్తుంది. కాబట్టి ప్రయాణం ముగిసిన వెంటనే శరీరానికి తగిన వ్యాయామం ఉండేలా చూసుకోవాలి. ప్రయాణాల్లో టాయిలెట్ల సౌకర్యం సరిగ్గా ఉండదు. దీంతో ఒక్కోసారి మల, మూత్ర విసర్జనను ఆపుకోవాల్సి వస్తుంది. ఇది చాలా ప్రమాదకరం. దీని వల్ల కూడా మలబద్ధకం ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి టాయిలెట్ సమయాలను సరిగ్గా ప్లాన్ చేసుకోవడం మంచిది..

ఈ పద్ధతులు పాటించి . . మలబద్దకాన్ని నివారించుకోండి. హాయిగా సెలవు రోజులను ఆనందించండి. ఒకవేళ సెలవు దినాల్లో ఇంటి దగ్గర ఉన్నప్పుడు కూడా తమ డైట్ లో మార్పులను గమనించుకోవడం మంచిది. ముఖ్యంగా ఆహారంలో పీచు పదార్థాలు ఉండేలా చూసుకోవాలి. రోజూ చేసే వాకింగ్ లేదా తేలికపాటి వ్యాయామాలను మరిచిపోవద్దు .

Leave a Comment