ఈ అందమైన రంగుల ప్రపంచాన్ని చూడాలంటే కళ్లు చాలా ముఖ్యం. కానీ కంటి చూపు లేనివారికి ఇది సాధ్యం కాదు. ఐతే అలాంటి వారి కంటి చూపు కోసం ఇప్పుడు కొత్త చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి . కానీ ఎవరైనా కళ్లు దానం చేస్తేనే ఇది ముందుకు వెళ్లగలిగే పరిస్థితి ఉంది. కళ్లు దానం చేయడంపై చాలా మందికి పెద్దగా అవగాహన లేదు. ఇందుకోసం ప్రతి సంవత్సరం నేత్ర దానంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నేత్ర దానం ఎవరెవరు చేయవచ్చో?
ఏ వ్యక్తైనా మరణించిన తర్వాత వారి అవయవాలను మరొకరికి అమరిచినట్లైతే వారికి పునర్జన్మను ప్రసాదించినమారమవుతాము. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఇతరులు అవయవాలు ఉపయోగించుకునే అవకాశం కల్పించడాన్నే అవయవదానం అంటారు. మన కళ్లు కూడా ఇతరులకు దానం చేయవచ్చు. తద్వారా అందమైన ప్రపంచాన్ని ఇతరులకు చూపించే అవకాశం కలుగుతుంది. ఈ నేత్రదానం అంధత్వం ఉన్న వారికి ఎంతో ఉపయోగపడుతుంది. కానీ నేత్ర దానంపై చాలామందికి ఇప్పటికీ అవగాహన లేదు. ఫలితంగా చనిపోయిన తర్వాత కూడా పనికి వచ్చే నేత్రాలు వృధాగా మట్టిలో కలిసిపోతున్నాయి.
పుట్టుకతో వచ్చే కంటి సమస్యలే కాకుండా రకరకాల కంటి సమస్యలు చాలామందిని వేధిస్తున్నాయి. ప్రపంచంలో పెరుగుతున్న నేత్ర రోగుల్లో . . ప్రతి ఐదు మందిలో ఒకరు భారత్ నుంచి ఉంటున్నారని నివేదికలు చెబుతున్నాయి. అంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఏటా దాదాపు 46 లక్షల మంది కార్నియా అంధత్వం ద్వారా బాధపడుతున్నారు. వీరికి శస్త్రచికిత్సలతో నయం చేయవచ్చు. కానీ ఏడాదికి 35 వేలకు మించి నేత్రాలు డొనేషన్ ద్వారా లభించడం లేదు. ఫలితంగా అవసరానికి, లభ్యతకు మధ్య చాలా గ్యాప్ ఉంది. దీన్ని తగ్గించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి…
ఏటా నేత్ర అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రజల్లో నేత్ర దానంపై పూర్తి అవగాహన కల్పించడమే దీని ప్రధాన ఉద్దేశ్యం. ఇందుకోసం దేశంలో పలు చోట్ల శిబిరాలు నిర్వహించి అవగాహన కల్పిస్తున్నారు. ఏటా దాదాపు 20వేల అంధత్వ కేసులు పెరుగుతున్నాయని వైద్య చరిత్ర చెబుతోంది. ఇందులో ముఖ్యంగా ఇన్పెక్షన్లు, విటమిన్ A లోపాలు, సమతుల ఆహారం లోపాలు, గాయాల వల్ల వచ్చిన కంటి సమస్యల కారణంగా వస్తున్నాయి. ఇందులో చాలావరకు కంటి సమస్యలను నేత్రదానం ద్వారా వచ్చి నేత్రాలు ఉపయోగించి చికిత్స చేయవచ్చు. అంటే కార్నియా ట్రాన్స్ ప్లాంటేషన్ ద్వారా చికిత్స చేస్తారు. ఇందుకోసం కార్నియాలు కావాల్సి ఉంటుంది. ఎవరైనా నేత్ర దానం చేస్తేనే కార్నియాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి. . నేత్రదానంపై అవగాహన పెంచాల్సిన అవసరం ఉంది. అందుకే ఏటా ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 8 వరకు 15 రోజులపాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ డిమాండ్ కు , సరఫరాకు మధ్య అంతరం తగ్గడం లేదు. అందువల్ల ఇకనుంచియానా చిన్న, పెద్దలందరూ నేత్ర దానంపై అవగాహన కల్పించుకొని తమ చుట్టూ ఉన్నవారికి కూడా అవగాహన కల్పిస్తే నేత్ర దానం ఫలితాలు అవసరమున్నవారికి తప్పకుండా అందుతాయి.
కళ్లు దానం చేయాలనే ఆలోచన అందరికీ ఉంటే మంచిది. ఎందుకంటే ఒక్కరు కళ్లు దానం చేయడం ద్వారా .. కనీసం ఇద్దరికి చూపు తెప్పించవచ్చు. అందమైన లోకాన్ని వారికి పరిచయం చేయవచ్చు.