Blood Sugar problems – రక్తంలో చక్కెర స్థాయిలను గుర్తించే సంకేతాలు

By manavaradhi.com

Published on:

Follow Us
Warning signs of Blood Sugar problems

ప్రస్తుత రోజుల్లో ఆధునిక జీవనశైలి వల్ల బ్లడ్ షుగర్ అనేది ఎంతోమందిని వేధిస్తున్న సమస్యగా మారింది. ఈ బ్లడ్ షుగర్ నియంత్రణలో లేకుంటే ఎదురయ్యే అనారోగ్య సమస్యలు అన్ని ఇన్ని కావు… కాబట్టి బ్లడ్ షుగర్ ను ఎప్పుడూ నియంత్రణలో ఉంచుకోవాలి. అసలు రక్తంలో చక్కెర స్థాయిలను గుర్తించే సంకేతాలు ఏవి….వీటిని నియంత్రణలో ఉంచుకునేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..!

రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పరిమితికి మించి పెరిగిపోవడాన్నే డయాబెటిస్ అంటారు. దీని వల్ల శరీర పనితీరు దెబ్బతింటుంది. రక్తంలో చక్కెర స్థాయి పెరగటం వల్ల ఎన్నో రకాల సమస్యలు ఎదురౌతుంటాయి. ఇలా గ్లూకోజ్ స్థాయులు పెరిగిపోవడానికి కారణం క్లోమ గ్రంథి ఇన్సూలిన్ ను తగిన స్థాయిలో విడుదల చేయకపోవడమే. రక్తంలో చక్కెర శాతాలను పరీక్షించడం ద్వారా ప్రాథమికంగా డయాబెటిస్ ను గుర్తించవచ్చు. రక్తప్రవాహంలోకి వచ్చే చక్కెర మొత్తాన్నీ శక్తిగా మార్చే ప్రక్రియకు ఆటంకం కలిగినప్పుడు మ‌ధుమేహం తలెత్తుతుంది.

మధుమేహం ఉన్నవారిలో కొన్ని లక్షణాలు కనిపిస్తుంటాయి. అతిగా దాహం వేయ‌డం, ఎక్కువ‌గా మూత్రానికి వెళ్ల‌డం అనేది ర‌క్తంలో చ‌క్కెర‌ స్థాయిలు పెరిగిందనడానికి సంకేతాలుగా గుర్తించవచ్చు. మధుమేహాంతో బాధపడుతున్నవారు సాధారణం కంటే ఎక్కువగా బాత్రూంకు వెళాల్సివస్తుంది. అలాగే శ‌రీరం పూర్తిగా అల‌సిపోయిన‌ప్పుడు కూడా చ‌క్కెర స్థాయిలు పెరిగినట్టుగా గుర్తుంచుకోవాలి. మ‌గ‌త‌గా ఉండ‌టం, త‌ల తిప్పుతున్న‌ట్టు ఫీలింగ్ అనిపిస్తుందంటే చ‌క్కెర‌లు ఎక్కువ కావ‌డం వ‌ల్లే అని గుర్తించుకోవాలి.

మధుమేహాంతో బాధ‌ప‌డుతున్న‌వారిలో మరికొన్ని లక్షణాలు కనిపిస్తాయి. కార‌ణం లేకుండానే అర‌చేతులు, పాదాల్లో చెమ‌ట‌లు ప‌డతాయి. అంతేకాదు కాలివేళ్లు, పాదాలు మొద్దుబారిన‌ట్టుగా, జ‌ల‌ద‌రింపుకు గురైన‌ట్టుగా అనిపిస్తుంది. హైబ్ల‌డ్ షుగ‌ర్‌, హైబీపీ స‌మ‌స్య‌లు రెండూ కళ్ల‌పై ఎక్కువ ప్ర‌భావం చూపుతాయి. ర‌క్తంలో షుగ‌ర్ లెవ‌ల్స్ పెరిగినట్టు అనిపించ‌గానే క‌ళ్ళు మసకబారతాయి. ఎలాంటి వ్యాయామాలు చేయ‌కుండానే శ‌రీరం బ‌రువు త‌గ్గుతున్న‌ట్ట‌యితే కూడా ర‌క్తంలో చ‌క్కెర‌ల స్థాయిలు పెరిగాయని భావించాలి. గాయాలు మాన‌డానికి చాలా స‌మ‌యం ప‌డుతుంది. ఉన్న‌ట్టుండి ఒకేసారి చ‌క్కెర స్థాయి పెరిగినట్టు అనిపించ‌గానే వెంట‌నే వైద్యుడ్నిసంప్ర‌దించి త‌గు వైద్యం తీసుకోవాలి.

రక్తంలో చక్కెర శాతాన్ని ఎప్పటికప్పుడు పరీక్షించుకోవడానికి బ్లడ్ గ్లూకోజ్ మానిటర్లు అందుబాటులో ఉన్నాయి. వేలిపై సూదితో గుచ్చి, ఓ ప్రత్యేకమైన స్ట్రిప్ పై రక్తపుబొట్టును వేసి పరికరంలో ఉంచడం ద్వారా నిమిషాల్లోనే గ్లూకోజ్ స్థాయిని తెలుసుకోవచ్చు. షుగర్ ను ప్రభావితం చేసే అంశాలు ఎన్నో ఉంటాయి. ఆహారం, చేస్తున్న పని, ఒత్తిడి, వ్యాధులు సహా ఎన్నో అంశాలు రక్తంలో షుగర్ స్థాయిని ప్రభావితం చేస్తాయి. వీటిని ముందే గుర్తించడం ద్వారా ఆహారం, వ్యాయామం, ఇన్సులిన్ తో రక్తంలో షుగర్ స్థాయిని అదుపులో పెట్టుకోవచ్చు. మధుమేహంతో బాధపడే వారు ఎండలో ఎక్కువగా తిరగడం మంచిది కాదు. బయటకు వెళ్ళేటప్పుడు గొడుగుల్లాంటివి వాడడం, సన్ స్క్రీన్ లోషన్ వాడడం లాంటివి చేయాలి.

వయసు పెరిగే కొలదీ చాలా మందిలో నిద్ర పోయే సమయం తగ్గిపోతూ వస్తుంది. ఇలాంటి వారిలో కూడా రక్తంలో షుగర్ లెవల్స్ తీరు మారిపోతుంది. అందుకే షుగర్ తో ప్రభావితం అయ్యే వాళ్ళు కంటి నిండా నిద్రపోవాలని వైద్యులు చెబుతున్నారు. రక్తంలో ఒక్క సారి షుగర్ స్థాయి పెరిగిన వెంటనే దానికి తగిన చర్యలు తీసుకోవాలి. లేదంటే అది మరింత పెరిగే ప్రమాదం ఉంది. అదే విధంగా వెంటనే తగ్గడం వల్ల కూడా కొన్ని సమస్యలు వస్తాయి. వైద్యుల పర్యవేక్షణలో షుగర్ స్థాయిని అదుపులోకి తెచ్చే మందులను వాడే ప్రయత్నం చేయాలి. వేళకు సమతుల ఆహారం తీసుకోవడం, తగిన వ్యాయామం చేయడం, స్మోకింగ్ మరియు ఆల్కహాల్ కు దూరంగా ఉండడం లాంటి జీవనశైలి మార్పులు తప్పనిసరిగా చేసుకోవాలి.

తరచూ రక్తంలో షుగర్ స్థాయి ఎలా ఉందనే విషయాన్ని పరీక్షించుకుంటూ ఉండాలి. అంత కంటే ముందుగా షుగర్ స్థాయిని ప్రభావితం చేసే అంశాలు ఏమిటనే విషయాన్ని తెలుసుకోవలసిన అవసరం ఉంది. వీటి గురించి తెలుసుకుని, వాటిని అదుపు చేయగలిగితే, రక్తంలో షుగర్ స్థాయిని కూడా అదుపు చేయడం సులభమౌతుంది.

Leave a Comment