Health Tips: ఎండాకాలం.. ఏం చేయకూడదు?

By manavaradhi.com

Published on:

Follow Us
summer health tips

ఎండాకాలం అంటే ఎవ‌రికి హాయిగా ఉండదు చెప్పండి. అంద‌రూ వేసివి కావాలని…., రావాల‌నే అనుకుంటారు. సెల‌వులు, బంధువులు, స్నేహితులు, శుభ‌కార్యాల సంద‌డి.. ఇలా చెప్పుకుంటూ పోతే సమ్మర్‌లో ఉండే స‌ర‌దాలు అన్నీ ఇన్నీ కావు. కానీ ఆ ఒక్కటీ త‌ప్ప అంటారు అంద‌రు. ఇంత‌కీ ఏంటా ఆ ఒక్కటీ. ఎండ‌.. న‌ల‌భై డిగ్రీలు దాటి హాఫ్ సెంచ‌రీకి చేరువ‌య్యే ఎండ‌లు, ఉక్క, చెమ‌ట‌లు మొత్తం ఎంజాయ్‌మెంట్ ప్ర‌ణాళిక‌ల్ని నీరుగార్చేస్తాయి. దీంతో ఎండ‌కు విరుగుడుగా చాలా మంది స‌న్ స్క్రీన్స్‌ను వాడ‌తారు. అస‌లేంటి ఈ స‌న్ స్క్రీన్స్‌, వీటి ప‌నితీరు ఎలా ఉంటుంది.

సూర్యుడ్ని ప్రత్యక్ష భగవానుడంటారు. కారణం మనం తినే ఆహార పంటల నుంచి మన ఆరోగ్యం వరకు అనేక విధాలుగా సూర్యుడే ఆధారం. శరీరానికి అత్యవసరం అయిన విటమిన్‌ డి కేవలం సూర్యరశ్మి ద్వారా మాత్రమే మనకు అందుతుంది. మనిషి ఉత్సాహంగా ఉండాలన్నా…, ఆరోగ్యంగా తిరగాలన్నా సూర్యరశ్మి అవసరం. అయితే ఎండ తీవ్రంగా ఉన్నప్పుడు బయట తిరిగితే శరీరానికి మంచి కంటే చెడే ఎక్కువ జరుగుతుంది. ఎండ వేడిమి ఎక్కువ అవడం వలన శరీరంలో నీటి శాతం గణనీయంగా పడిపోతుంది. హైడ్రేషన్‌ ప్రభావంతో మనిషికి నీరసం రావడం, వడదెబ్బ తగలడం లాంటివి జరుగుతాయి. చికాకు, తలనొప్పి, అతిదాహం లాంటి సమస్యలు సాధారణంగా కనిపిస్తాయి. ఈ ఇబ్బందుల్ని మనిషి గుర్తించగలడు. అయితే ఎండ వేడి వలన నష్టపోయే చర్మం గురించి అంత త్వరగా అర్ధం కాదు.

సూర్యకిరణాలు సరాసరి చర్మానికి తగలడం వలన దురద లాంటి చిన్న సమస్య నుంచి చర్మ క్యాన్సర్‌ వరకు అనేక అనర్ధాలు ఉంటాయి. ఎండలో ఎక్కువ సేపు తిరిగిన తరువాత చర్మం ఎర్రగా మారుతుంది. ముట్టుకుంటే మంటగా అనిపిస్తుంది. దీనిని ఫస్ట్‌ డిగ్రీ సన్‌ బర్న్‌ అంటారు. ఈ స్టేజ్‌లో చర్మం విపరీతంగా మంటపుట్టడం, కొద్దిగా నొప్పి ఉండవచ్చు. ఆల్ట్రా వయెలెట్‌ కిరణాలు ఎక్కువ సమయం చర్మానికి తగలడం వలన లోపలి కణాలు కూడా దెబ్బతినే అవకాశం ఉంది. శరీరం బొబ్బలెక్కుతుంది. కొందరిలో దద్దుర్లు కనిపిస్తాయి. బొబ్బలెక్కినట్టయితే చర్మం లోపలి వరకు దెబ్బతిన్నట్టే. పొరపాటున ఆ బొబ్బలు పగిలితే వాటి వలన ఇన్‌ఫెక్షన్‌ సోకే ప్రమాదమూ ఉంది. దీన్ని సెకండ్‌ స్టేజ్‌ బర్న్‌ అంటారు. ఈ స్థాయిలో చర్మం దెబ్బతింటే నయం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఎండ తీవ్రంగా ఉన్నప్పుడు అతిగా తిరగడం వలన చర్మానికి వచ్చే మరో సమస్య రింకిల్స్‌. అతిగా అల్ట్రా వయోలెట్‌ కిరణాలు తగలడం వలన చర్మంలో ఉండే ఫైబర్‌ కణాలు దెబ్బతింటాయి. దీని వలన చర్మం సాగిపోయి.. ముసలివారిలా కనిపిస్తారు. ఇక ఎండ తీవ్రత వలన చర్మం రంగు కూడా మారిపోతుంది. ఎండ తగిలిన భాగాల్లో ఓ రకంగానూ, ఎండ తగలని ప్రదేశాల్లో మరో రంగులోనూ ఉంటుంది. చర్మం కింద ఉండే రక్తకణాలు పూర్తి స్థాయిలో దెబ్బతినడం వలన చర్మం కొన్ని చోట్ల ఎర్రగానూ, మరికొన్ని చోట్ల తెల్లగానూ, ఇంకొన్ని చోట్ల నల్లగానూ మారుతుంది. ఇలా వేసవికాలంలో ఎండలో అతిగా తిరగడం వల్ల వచ్చే చర్మ సమస్యలు చాలానే ఉన్నాయి.

ఎండ వేడి నలభై డిగ్రీలు దాటిన తరువాత నుంచి చర్మం ఇబ్బంది పడటం మొదలవుతుంది. దీన్నుంచి తప్పించుకోవడానికి సన్‌ స్క్రీన్‌ లోషన్‌లు వాడుతుంటారు. ఇది మంచి పరిష్కారమే. తప్పనిసరి పరిస్థితుల్లో ఎండలో తిరగాల్సి వచ్చినప్పుడు సన్‌స్క్రీన్‌ లోషన్‌లు ఉపయోగించాలి. ఎక్కడ చర్మం ఎండ బారిన పడుతుందో ఆయా ప్రదేశాల్లో సన్‌ స్క్రీన్‌ లోషన్‌ పూసుకోవచ్చు. దీనివలన అల్ట్రా వయోలెట్ కిరణాలు చర్మంపై సరాసరి తగలకుండా ఉంటాయి. దీంతో చర్మ క్యాన్సర్‌ లాంటి తీవ్రమైన సమస్యలు రావు. అలాగే చర్మం టాన్‌ అవ్వకుండా కాపాడుతుంది. అలాగే సన్‌స్క్రీన్‌ లోషన్లు మాయిశ్చరైజర్‌గా పనిచేస్తాయి. దీంతో చర్మం పొడిబారదు. మృదువుగా ఉండటానికి ఈ లోషన్లు ఉపకరిస్తాయి. అయితే సన్ స్క్రీన్‌ లోషన్లు ఉన్నాయి కదా అని ఎండను పట్టించుకోకుండా ఆరుబయట తిరిగితే ఇబ్బందులు తప్పవు. సన్‌స్క్రీన్‌ లోషన్ల ప్రయోజనాలకు కూడా పరిమితి ఉంటుంది. సహజంగా ఈ లోషన్లు రెండు గంటలకు మించి పనిచేయవు. కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే సన్‌ స్క్రీన్‌ లోషన్లు వాడుకోవాలి. అలాగే వీటిలో ఉండే PABA అనే మూలకం వలన కొందరిలో అలర్జీలు వచ్చే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితి తలెత్తితే లోషన్లు వాడటం మానేయడమే మంచిది. అలాగే పుండ్లు, మొటిమలు, మచ్చలు ఉంటే సన్‌ స్క్రీన్‌ లోషన్లు రాసుకోవడం అంత మంచిది కాదు. వీటిలో వాడే రసాయినాలు చర్మాన్ని మరింత ఇబ్బంది పెట్టవచ్చు. అలాగే సన్‌స్క్రీన్‌ లోషన్లను ముఖానికి రాయడం కూడా సరికాదు. ఫేస్‌ క్రీమ్‌, సన్‌స్క్రీన్‌ లోషన్లు వేర్వేరని గుర్తించాలి. ముఖ్యంగా కళ్ల దగ్గర సన్‌స్క్రీన్‌ లోషన్‌ రాసుకుంటే ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి సన్‌స్క్రీన్‌ లోషన్లు అవసరం మేరకు మాత్రమే ఉపయోగించాలి.

ఎండ వేడి సహజం. తప్పనిసరి పరిస్థితుల్లో తగిన జాగ్రత్తలతో సన్‌స్క్రీన్‌ లోషన్లు వాడుకోవచ్చు. అయితే ఎండ వేడికి ముందు జాగ్రత్తలు తీసుకోవడమే మంచి పరిష్కారం. ఎండ వేడి ఎక్కువగా ఉన్న సమయంలో బయట తిరగడం తగ్గించుకోవాలి. ఉదయం పది గంటలకు ముందు లేదా సాయంత్రం నాలుగు గంటల తరువాతే బయట పనులు చక్కబెట్టుకునేలా ప్రణాళిక రూపొందించుకోవాలి. ఎండ తీవ్రంగా ఉన్న సమయంలో నీడ పట్టున ఉండాలి. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సి వస్తే తగిన జాగ్రత్తలు పాటించాలి. శరీరమంతా కప్పేలా దుస్తులు ధరించాలి. అలా అని బిగుతుగా ఉండేవి, దళసరిగా ఉండే బట్టలు వేసుకోవడం వలన చర్మం ఉడికిపోతుంది. కాబట్టి పలుచగా గాలి ఆడేలా చూసుకోవాలి. ఎండ వలన పెదవులు కూడా ఎక్కువగా దెబ్బతింటాయి. పొడిబారడం, పగలడం, పుళ్లు పడటం జరగవచ్చు. కాబట్టి పెదవులకు మాయిశ్చరైజ్‌ క్రీమ్‌లు వాడవచ్చు. అలాగే కళ్లను కాపాడుకోవడం ముఖ్యం. అల్ట్రా వయెలెట్‌ కిరణాలు సరాసరి కళ్లకు తగలడం మంచిది కాదు. ఎండలో ఎక్కువ సేపు తిరగడం వలన కంటిలోపల భాగాలు దెబ్బతింటాయి. కళ్లు కొన్నిసార్లు నొప్పిగా అనిపించవచ్చు. కొన్నిసార్లు ఎలాంటి నొప్పి లేకపోయినా కాటరాక్ట్‌ ఇబ్బందులు రావచ్చు. మసక మసకగా కనిపించడం, ఒక్కోటి రెండుగా కనిపించడం లాంటి సమస్యలు వస్తాయి. కాబట్టి ఎండలో తిరిగే సమయంలో సన్‌ గ్లాసెస్‌ వాడాలి. టోపీ పెట్టుకోవడం, గొడుగు వాడటం వలన కళ్లు దెబ్బతినకుండా ఉంటాయి. ఎండలో ఎక్కువ సేపు తిరిగిన తరువాత ఐస్‌ గడ్డలను కళ్లు, చర్మంపై పెట్టడం లాంటివి చేయవచ్చు. ద్రవపదార్ధాలను ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. శుభ్రమైన మంచినీరు, మజ్జిగ, బార్లీ, సబ్జా కలిపిన నీళ్లు తాగుతూ ఉండాలి. పుచ్చకాయ లాంటి పండ్లను ఎక్కువగా తినాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వేసవి వేడిని తప్పించుకుంటూ సెలవుల్ని ఆనందించవచ్చు.

స‌న్ స్క్రీన్ లోష‌న్లు ఖ‌చ్చితంగా ఉప‌యోగ‌మే. అయితే వాటిని రాసుకున్నాం క‌దా అని విచ్చలవిడిగా ఎండ‌లో తిరిగేస్తామంటే కుద‌రదు. ఎందుకంటే స‌న్ స్క్రీన్స్ వ‌ల‌న వంద శాతం రక్షణ దొరుకుతుంద‌ని చెప్పలేం. తప్పనిసరి ప‌రిస్థితుల్లో మాత్రమే స‌న్‌స్క్రీన్‌లు రాసుకోవాలి. అర‌చేతిని అడ్డంపెట్టి సూర్యుడ్ని ఆప‌లేన‌ట్టే.. స‌న్‌స్క్రీన్లు అడ్డుపెట్టి సూర్యర‌శ్మిని, దాన్ని ప్రభావాన్ని ఆప‌లేం.

Leave a Comment