LAUGHING HEALTH BENEFITS – నవ్వడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే..!

By manavaradhi.com

Published on:

Follow Us
LAUGHING HEALTH BENEFITS

నవ్వు దివ్యౌషధం లాంటిది. నవ్వడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలను ఇట్టే దూరం చేసుకోవచ్చు. మనసారా నవ్వుకోవడం ఓ మంచి మందు లాంటిదని చెప్పవచ్చు. దీనివల్ల మానసిక మరియు శారీరక ఒత్తిడి తగ్గిపోతుంది. రోగ నిరోధక వ్యవస్థ మరింత బలోపేతమవుతుంది. రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. పని ఒత్తిడి లేదా మానసిక ఒత్తిడి వల్ల చాలామందిలో స్ట్రెస్ హార్మోన్స్ ఎక్కువగా విడుదలవుతుంటాయి. ఈ కారణంగా రోగ నిరోధక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడి అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంది. ఐతే అలాంటి వారు నవ్వడం ద్వారా స్ట్రెస్ హార్మోన్స్ విడుదలను తగ్గించుకోవచ్చు. తద్వారా మంచి ఆరోగ్యప్రయోజనాలు పొందవచ్చు.

ఎక్కువగా నవ్వేవారిలో అనుకూల ఫలితాలు కనిపిస్తాయి. వారిలో శరీర ఆరోగ్యానికి ఉపయోగపడే ఎండార్ఫిన్స్, న్యూరోట్రాన్సిమిటర్స్ హార్మోన్లు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. ఇవి నొప్పుల బారి నుంచి ఉపశమనం కలిగించడమే కాకుండా.. టెన్షన్, కోపం రాకుండా రక్షిస్తాయి. న్యూరోట్రాన్స్ మిటర్స్ హార్మోన్ల వల్ల మెదడు చురుకుగా పని చేస్తుంది. రోజూ నవ్వే వారిలో యాంటీబాడీ సెల్స్ యాక్టివ్ గా పని చేస్తాయి. తెల్ల రక్తకణాల్లో ఉండే లింఫోసిట్స్ T సెల్స్ ఎక్కువగా ఉత్పత్తి అయి రోగాలు, ఇన్ఫెక్షన్లు కలిగించే కణాలతో చక్కగా పోరాడతాయి. రోజూ నవ్వడం వల్ల మనకు తెలియకుండానే శరీరంలో అన్ని అవయవాలకు వ్యాయామం చేసినట్లవుతుంది. ఒక్కో లాఫింగ్ స్టైల్ ద్వారా శరీరంలో కండరాలపై ప్రభావం పడుతుంది.. బిగ్గరగా నవ్వితే కాళ్లు, చేతులు, నడుం, వెన్ను, మెడ కండరాలు అన్నీ కదులుతాయి. మనసారా నవ్వే వారిలో ముఖం కండరాలు వ్యాయామం చేసినట్టే లెక్క.

రక్తపోటు ఉన్నవారు రోజూ నవ్వడం చాలా మంచిది. దీనివల్ల అధిక రక్తపోటు నియంత్రణలోకి వస్తుంది. ఫలితంగా రక్తపోటు ద్వారా వచ్చే హృద్రోగ సమస్యలకు ఎలాంటి మందులు వాడకుండానే చెక్ పెట్టవచ్చు. తద్వారా మందుల నుంచి వచ్చే సైడ్ ఎఫెక్ట్ ల నుంచి తప్పించుకున్నట్టు అవుతుంది. రోజూ నవ్వే వారిలో శ్వాసకోస వ్యవస్థ కూడా చక్కగా పనిచేస్తుంది. దీని ద్వారా ఆక్సిజన్ సరిగ్గా తీసుకునేందుకు అవకాశం లభిస్తుంది. తద్వారా రక్తప్రసరణ జరిగి మెదడుకు సరైన మోతాదులో ఆక్సిజన్ లభిస్తుంది. చక్కగా ఆక్సిజన్ లభిస్తే మెదడు కూడా చురుగ్గా పనిచేస్తుంది. అలాంటి వారిలో జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుందంటున్నారు వైద్యులు .

మనసారా నవ్వుకోవడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో.. కాబట్టి.. వీలైనంత వరకు జీవితంలో హాయిగా నవ్వుకునేందుకు తొలి ప్రాధాన్యం ఇవ్వండి. మంచి ఆరోగ్యాన్ని సొంతం చేసుకుని జీవితాన్ని పూర్తిస్థాయిలో ఆస్వాదించండి.

Leave a Comment