శ్రీలంకపై తొలి టెస్టులో భారత్ ఘన విజయం

By manavaradhi.com

Published on:

Follow Us
IND vs SL 1st Test

శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. 372 పరుగుల లక్ష్య ఛేదనలో శ్రీలంక 206 పరుగులకే ఆలౌట్ కావడంతో టీమ్‌ఇండియా 165 పరుగుల తేడాతో గెలుపొందింది. దీంతో రెండు టెస్టుల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది.

భారత్‌ బౌలర్లలో మానవ్ సుతార్ అద్భుత ప్రదర్శన చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో 6/55తో ఫైఫర్‌ నమోదు చేసిన అతడు.. మ్యాచ్‌లో మొత్తం 10 వికెట్లు పడగొట్టాడు. ప్రసిద్ధ్ కృష్ణ రెండు వికెట్లు తీయగా.. మహ్మద్ సిరాజ్, రవీంద్ర జడేజా చెరో వికెట్ సాధించారు.

372 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన శ్రీలంకకు సోనాల్ దినుష (84), ధనంజయ డిసిల్వా (59) అర్ధ సెంచరీలతో పోరాడారు. అయితే భారత బౌలర్ల ధాటికి మిగతా బ్యాటర్లు ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయారు.

అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 462 పరుగులు చేయగా.. శ్రీలంక 284 పరుగులకే పరిమితమైంది. రెండో ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా 193 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో భారీ సెంచరీతో రాణించిన దేవదత్ పడిక్కల్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

ఇదిలా ఉండగా.. భారత్‌కు ఇది 600వ టెస్టు మ్యాచ్ కావడం విశేషం. ఈ విజయంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) పాయింట్ల పట్టికలో భారత్ స్థానం మారకపోయినా.. పాయింట్ల శాతాన్ని గణనీయంగా మెరుగుపరుచుకుంది. ప్రస్తుతం 53.33 శాతం పాయింట్లతో భారత్ ఐదో స్థానంలో ఉంది. భారత్ ఖాతాలో 60 పాయింట్లు ఉన్నాయి.

Leave a Comment