సోషల్ మీడియా దిగ్గజం మెటా సంస్థకు చెందిన ఇన్‌స్టాగ్రామ్.. వీడియో ప్లాట్‌ఫామ్ యూట్యూబ్‌కు పోటీగా కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటివరకు ప్రధానంగా రీల్స్, షార్ట్ వీడియోలపై దృష్టి సారించిన ఇన్‌స్టాగ్రామ్.. తాజాగా సుదీర్ఘ వీడియోలపైనా దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా గరిష్ఠంగా 90 నిమిషాల నిడివి గల హారిజాంటల్ వీడియోలను అందించే ఫీచర్‌ను పరీక్షిస్తోంది.
బ్రెజిల్, అమెరికాలో ప్రయోగాత్మక పరీక్షలు
పాడ్‌కాస్టర్లు, కమెడియన్లు, ఇతర కంటెంట్ క్రియేటర్లను ఆకర్షించడమే లక్ష్యంగా ఇన్‌స్టాగ్రామ్ ఈ కొత్త ఫీచర్‌ను రూపొందిస్తోంది. ఇప్పటికే బ్రెజిల్‌లో ప్రయోగాత్మకంగా పరీక్షించిన ఈ ఫీచర్‌ను తాజాగా అమెరికాకు కూడా విస్తరించినట్లు కంపెనీ వెల్లడించింది.
ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే.. క్రియేటర్లు తమ చిన్న రీల్స్‌కు సుదీర్ఘ వీడియోలను లింక్ చేసుకోవచ్చు. యూజర్లు సంబంధిత రీల్‌ను వీక్షించినప్పుడు పూర్తి వీడియోను చూడటానికి ప్రత్యేక సందేశం కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయడం ద్వారా పూర్తి నిడివి గల వీడియోను వీక్షించవచ్చు. దీంతో చిన్న వీడియోల ద్వారా ప్రేక్షకులను ఆకర్షించి, వారిని పూర్తి వీడియోల వైపు మళ్లించే అవకాశం క్రియేటర్లకు లభిస్తుంది.
టీవీ యాప్‌పై మరింత దృష్టి
ఇన్‌స్టాగ్రామ్ తన టీవీ యాప్ వీక్షకుల సంఖ్యను పెంచుకునే ప్రణాళికలో భాగంగా ఈ ఫీచర్‌ను తీసుకొస్తోంది. మొబైల్ యాప్‌లోనే సుదీర్ఘ వీడియోలను అందించడం ద్వారా వినియోగదారులు ప్లాట్‌ఫామ్‌పై ఎక్కువ సమయం గడిపేలా చేయాలని సంస్థ భావిస్తోంది. ఇప్పటికే ‘ఇన్‌స్టాగ్రామ్ ఫర్ టీవీ’ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.







