మన శరీరంలో ముఖ్యమైన భాగాల్లో కాలేయం ఒకటి. ఈ అవయవం దెబ్బతింటే ఎన్నో అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. కొన్ని రకాల వైరస్‌ల కారణంగా కాలేయానికి వచ్చే ఇన్ఫెక్షన్ కారణంగా హెపటైటిస్ వ్యాధి వస్తుంది. చాలామంది హెపటైటిస్‌తో బాధపడుతున్నప్పటికీ, అది తమకు ఉన్నట్లే తెలియదు. మరీ దీన్ని మనం ఎలా గుర్తించాలి. హెపటైటిస్ నివారణకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.
కాలేయం మన శరీర అవయవాలన్నింటిలో కల్ల అతి పెద్ద గ్రంథి. ఇది ఆహారం జీర్ణం చేసుకోవడానికి, శక్తిని నిల్వ ఉంచుటకు, వ్యర్థపదార్థాలు బయటకు పంపుటకు సహాయపడుతుంది. కాలేయవాపును హెపటైటిస్ అంటారు. హెపటైటిస్ ప్రపంచంలోనే అతి పెద్ద ఆరోగ్యసమస్య. ఇది బ్యాక్టీరియా, వైరస్ వంటి సూక్ష్మజీవులు, కొన్ని రకాల మందులు, వివిధ రకాల కారణాల చేత వస్తుంది. వీటిలో వైరస్ వల్ల కలిగే హెపటైటిస్ ను వైరల్ హెపటైటిస్ అని అంటారు. వీటిని హెపటైటిస్ ఎ, బి, సి, డి, ఇ, ఎఫ్ అని ఆరు రకాలుగా విభజించారు. ఇందులో హెపటైటిస్ ఎ, బి, సి మానవులపై తీవ్రప్రభావాన్ని చూపడమే కాకుండా ప్రాణాంతకంగా పరిణమిస్తాయి. హెపటైటిస్ వైరస్ శరీరంలో ప్రవేశించిందంటే దాని సంఖ్య లక్షల్లో పెరిగిపోతూ కాలేయాన్ని దెబ్బతీయడం ప్రారంభిస్తుంది.
హెపటైటిస్ వ్యాధిరావడానికి చాలా కారణాలు ఉన్నాయి. హెపటైటిస్ ఎ, బి, సి, డి, ఇ వైరస్‌లు కాలేయ ఇన్‌ఫెక్షన్‌ను కలగజేస్తాయి. ఈ వైరస్‌లే కాకుండా మితిమీరిన, దీర్ఘకాల మద్యపానం, కొన్ని రకాల మందులు, ఊబకాయం కూడా కాలేయాన్ని దెబ్బతీస్తాయి. కాలేయం వ్యాధికి గురైతే మొదట కనిపించే లక్షణం కామెర్లు . అయితే కామెర్లకు కారణం, వైరస్ రకాలను గుర్తించి అందుకు అనుగుణంగా చికిత్స తీసుకోవాలి. హెపటైటిస్ వైరస్‌లు కలుషిత ఆహారం, నీరు, వ్యాధి ఉన్న రక్తం ఎక్కించుకోవటం ద్వారా సోకుతాయి. అయితే ఈ వైర్‌సలు శరీరంలో చేరి వ్యాధిగా బల్పడటానికి కొంత సమయం పడుతుంది. ఈ ఇంక్యుబేషన్ పీరియడ్ హెపటైటిస్ ఎ, ఇ లైతే రెండు నుంచి ఆరు నెలలు సమయం పడితే, హెపటైటిస్ బి, సి వైరస్‌లకు 8 నుంచి 26 వారాల సమయం పడుతుంది.
వైరస్ లేదా మద్యపానం ఏ కారణం వల్ల కాలేయం రోగగ్రస్థమైనా తక్షణ చికిత్స తీసుకోవటం అత్యవసరం.హెపటైటిస్ ను కొన్ని లక్షణాల ద్వార గుర్తంచవచ్చు. కామెర్లు, నీరసం, ఆకలి లేకపోవడం, వికారం, వాంతులు, జ్వరం, మూత్రం పచ్చరంగులో రావడం, మలం వివర్ణంగా ఉండటం, కడుపునొప్పి, ముఖ్యంగా కుడివైపు రావడం, ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలు గమనించవచ్చు. కొందరు కామెర్లు వస్తే పత్యం ఉండటం, నాటు మందులు వాడటం చేస్తూ ఉంటారు. ఇది చాలా ప్రమాదకరం. కాబట్టి కామెర్ల లక్షణాలు కనిపించగానే సొంత వైద్యం మానుకుని వైద్యుల్ని సంప్రదించాలి.
కాలేయ ఆరోగ్యం కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ?
హెపటైటిస్ నివారణ మన చేతుల్లోనే ఉంది. కొన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా కాలేయాన్ని వ్యాధుల నుంచి కాపాడుకోవచ్చు. ఎల్లప్పుడు పరిశుభ్రమైన నీరు తాగాలి. రివర్స్ ఆస్మోసిస్ లేదా యు.వి వాటర్ ఫిల్టర్లు వాడటం వల్ల ఉపయోగం ఉంటుంది. వీధుల్లో దొరికే పళ్ల రసాలు, తినుబండారాలకు దూరంగా ఉండాలి.బ్యూటీ పార్లర్లలో ఉపయోగించే పరికరాలు డిస్పో జబుల్ తరహావై ఉండాలి.ఇంట్రావీనస్ ఇంజెక్షన్ల ద్వారా డ్రగ్స్ తీసుకోవటం హెపటైటిస్ సోకటానికి మరో ప్రధాన కారణం.హెపటైటిస్ వైరస్‌ల నుంచి రక్షణ పొందటం కోసం టీకాలను ఆశ్రయించాలి. కాయగూరలు, పళ్లను ఎక్కువ నీళ్లతో శుభ్రంగా కడిగి వాడాలి. ఇటువంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మన కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
హెపటైటిస్ ప్రపంచంలోనే అతి పెద్ద ఆరోగ్యసమస్య. కాలేయ జబ్బులు ప్రాణాంతకంగా మారతాయి. కాబట్టి దీని పట్ల అవగాహనతో తగుజాగ్రత్తలు తీసుకోవడం ద్వారా హెపటైటిస్ బారిపడకుండా జాగ్రత్తపడుతూ… మన కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.