High Blood Pressure: అధిక రక్తపోటు ఎక్కువైపోతే ఎలాంటి సమస్యలు తలెత్తుతాయి?

By manavaradhi.com

Published on:

Follow Us
Blood Pressure

హైబీపీ అనేది నేటి త‌రుణంలో చాలా మందిని ఇబ్బందుల‌కు గురి చేస్తుంది. చాప కింద నీరులా ఇది అనేక మందికి వ‌స్తుంది. హైబీపీ ఉంటే దాని ల‌క్ష‌ణాలు కూడా చాలా మందికి తెలియ‌వు. దీంతో హైబీపీ ఉంద‌ని తెలుసుకునే స‌రికే జ‌రగాల్సిన న‌ష్టం జ‌రిగిపోతుంది. హై బీపీని ముందుగానే గుర్తిస్తే దాంతో జాగ్ర‌త్త ప‌డ‌వ‌చ్చు. శరీరంపై హై బీపీ ఎలాంటి ప్రభావాన్ని చూపెడుతుంది.

మారిపోతున్న జీవనశైలి నుంచి అనారోగ్యకర ఆహారపుటలవాట్ల కారణంగా రక్తపోటు పెరిగిపోతుంది. సాధారణంగా గుండె, రక్త నాళాల్లో ఉండే రక్తం, వాటి గోడల మీద చూపించే వత్తిడిని రక్తపోటు లేదా బ్లడ్ ప్రెజర్ అంటారు. ఇది గుండె కండరాలు పంపు చేసే శక్తి, రక్తనాళాలు పంపు చేసిన రక్తాన్ని ఎంత వరకూ తీసుకుంటాయి అనే రెండు అంశాల మీద ఆధారపడి ఉంటుంది. ఆరోగ్యవంతుల రక్తపోటు సాధారణంగా సిస్టోలిక్ ప్రెజర్ 90 నుండి 120, డయాస్టోలిక్ ప్రెజర్ 60 నుంచి 80 వరకూ ఉండాలి. ఇది మనిషి వయసును బట్టి, సమయాన్ని బట్టి మారుతుంది. ఇది సాధారణ స్థాయిలో ఉన్నంత వరకూ ఏ విధమైన సమస్య ఉండదు. ఈ రెండింటిలో ఏది ఎక్కువ తక్కువలకు చేరుకున్నా… ప్రమాదం చుట్టుముడుతుంది. అందుకే బి.పి.ని ఎట్టి పరిస్థితుల్లో అదుపులో ఉంచుకోవాలని వైద్యులు చెబుతారు.

వీటిలో మొదటి సంఖ్య మరింత కీలకం. దీన్ని ‘సిస్టాలిక్‌ రక్తపోటు’ అంటారు. ఈ సంఖ్య ఎంత పెరిగితే వ్యాధుల ముప్పు కూడా అంతగా పెరుగుతుంటుంది. బీపీ ఎక్కువగా ఉంటే గుండె జబ్బులు, పక్షవాతం, కిడ్నీ వ్యాధుల ముప్పు పెరుగుతుంది. ముఖ్యంగా పైసంఖ్య ఎంత ఎక్కువగా ఉంటే ఈ ముప్పు అంతగా పెరుగుతుంది. కాబట్టి యుక్త వయసు నుంచే ప్రతి ఒక్కరూ బీపీ మీద దృష్టి పెట్టటం, దాన్ని సాధ్యమైనంత తక్కువగా ఉంచుకోవటం ఉత్తమం. ఇందుకోసం మనం తీసుకునే ఆహారం మీద శ్రద్ధ పెట్టటం, బరువు ఎక్కువగా ఉంటే తగ్గటం, నిత్యం వ్యాయామం చెయ్యటం కీలకమైన అంశాలు. యుక్తవయసు నుంచే ఈ జాగ్రత్తలు తీసుకోవటం అవసరం.

బీపీ నియంత్రణలో లేకపోతే ఒంట్లో కీలక అవయవాలు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. అందుకే హైబీపీని ఏమాత్రం విస్మరించకూడదు. హైబీవీతో కళ్లు, కాళ్లలోని రక్తనాళాలు దెబ్బతింటాయి. కంట్లో రెటీనా పొరలోని సూక్ష్మ రక్తనాళాలు దెబ్బతింటే చూపు మందగిస్తుంది. ఇక కాళ్లల్లోని రక్తనాళాలు సన్నబడితే రక్త ప్రసరణ తగ్గుతుంది. దీంతో నడుస్తున్నప్పుడు కాలి కండరాలు నొప్పి పెడతాయి. కొద్ది దూరం నడకకే విశ్రాంతి తీసుకోవాల్సి రావొచ్చు. కొన్నిసార్లు నడక కూడా కష్టం కావొచ్చు. గుండెకు రక్త సరఫరా దెబ్బతింటే గుండెనొప్పి రావొచ్చు. అలాగే గుండె బలహీనపడితే ఆయాసం, కాళ్లకు నీరు పట్టటం వంటివి కనబడొచ్చు. కిడ్నీలకు రక్త సరఫరా తగ్గిపోయి మూత్రపిండాల పనితీరు దెబ్బతింటుంది. ఇది దీర్ఘకాల కిడ్నీ వైఫల్యానికి దారితీయొచ్చు. దీంతో మూత్రం సరిగా తయారుకాదు. మూత్రంలోని మలినాలు రక్తంలోకి చేరి.. ఆయాసం, రక్తహీనత, కాళ్లవాపులు వేధిస్తాయి.అధిక రక్తపోటుకి తగిన చికిత్స తీసుకోకపోతే పరిణామాలు తీవ్రంగా మారవచ్చు.

మెదడుకు వెళ్లే రక్తనాళాల్లో రక్తప్రసారవేగం పెరగి..రక్తనాళాలు చిట్లటం వలన గాని, రక్త నాళాల్లో రక్తం గడ్డకట్టటం వలన గానీ పక్షవాతం వచ్చే ప్రమాదం ఉంటుంది. మూత్ర పిండాలు, ఊపిరితిత్తులకు సబంధించిన అనారోగ్యాలు తలెత్తవచ్చు.సాధారణంగా ఇతర సమస్యలకోసం ఆసుపత్రికి వెళ్లినప్పుడు అధిక రక్తపోటుని గుర్తిస్తుంటారు. లేదా రక్తపోటు కారణంగా ఇతర అనారోగ్యాలు వచ్చినప్పుడు వాటి చికిత్సకు ఆసుపత్రికి వెళితేనే… అధిక రక్తపోటు ఉన్న విషయం బయటపడుతుంటుంది. అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే క్రమం తప్పకుండా బీపిని చెక్ చేయించుకుంటూ ఉండాలి. అప్పుడే బీపీ కారణంగా ఇతర అవయవాలకు హాని కలగకుండా ఆపవచ్చు.

ఒక్కసారి మనకు హైబీపీ వచ్చిందంటే అనే రకాల ఇబ్బందులకు గురికాకతప్పదు. శరీరంలోని అనేక అవయవాల మీద ప్రభావాన్ని చూపి, జీవితాన్ని అస్తవ్యస్తం చేస్తుంది. అందుకే రక్తపోటును తగ్గించుకునేందుకు ఉన్న మార్గాలను తప్పకుండా పాటించాలి. ఇందులో ప్రధానమైనది అధిక పొట్టను, బరువు తగ్గించుకోవడం. మన బరువు పెరిగే కొద్దీ గుండె మీద రక్తాన్ని నెట్టాల్సిన భారం పడుతుంది. ఫలితంగా ఎక్కువ పని చేసి, అనేక సమస్యలకు కారణమౌతుంది. అందుకే ముందు బరువు తగ్గించుకోవాలి. ఆల్కహాల్ తీసుకోనే అలవాటు ఉంటే వెంటనే మానేయాలి. ధూమపానానికి దూరంగా ఉండాలి. ఇతరులు వదే పొగ పీల్చడం వల్ల కూడా ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. అందుకే ధూమపానం మానేయడంతో పాటు ధూమపానం చేసే వారికి వీలైనంత దూరంగా ఉండాలి.

కాపీ లాంటి కేఫినేటెడ్ పానీయాల వల్ల రక్తపోటు అధికం అవుతుంది గనుక వీటిని కూడా వీలైనంత వరకూ తగ్గించాలి. రక్తపోటు విషయంలో ఉప్పు తెచ్చే ప్రమాదం అంతా ఇంతా కాదు. రోజుకు ఒక వ్యక్తికి 6 గ్రాముల ఉప్పు అవసరం. పళ్ళు, కూరగాయల్లో ఉప్పు ఉంటుంది. శరీరానికి ఇది సరిపోతుంది. ఉప్పును తగ్గించాలంటే… ముందు నిల్వ ఉన్న ఆహారాన్ని అంటే పచ్చళ్ళు, ప్రాసెస్ ఫుడ్స్ తగ్గించాలి. ఎక్కువ ఒత్తిడి, ఆందోళన రక్తపోటును పెంచుతుంది. కాబట్టి ఏ విషయంలో ఆందోళన వద్దు. వీలైనంత మేర ఆందోళన కలిగించే అంశాలకు దూరంగా ఉండడం మంచిది. దీని కోసం యోగ, ధ్యానం, వ్యాయామం, విహార యాత్రల వంటి వాటికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఎప్పటికప్పుడు రక్తపోటు పరిస్థితి తెలుసుకుంటూ అదుపులో ఉంచుకునేందుకు డాక్టర్ సలహా మేరకు మందులు వాడుతుండాలి.

చాలామందికి తమకు అధిక రక్తపోటు వచ్చిన విషయాన్నీ గమనించ లేకపోతున్నారు. ఇది నిశ్శబ్ద హంతకి. ఎటువంటి లక్షణాలూ కనిపించకుండానే అధిక రక్తపోటు ప్రాణాలను తీసుకుంటుంది. అధిక రక్తపోటును ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా హైపర్‌టెన్షన్‌ తీవ్రపరిణామాలకు దారితీస్తుంది. జీవనశైలిలో మార్పులు చేసుకుంటూ ఆహారం, మెడిసిన్ ల ద్వారా నియంత్రించాలి.

Leave a Comment