Measles: మీజిల్స్ వ్యాధి లక్షణాలు ఎలా గుర్తించాలి

By manavaradhi.com

Published on:

Follow Us
Measles Immunization

తట్టు లేదా పొంగు అనే ఈ వ్యాధినే ఆంగ్లంలో మీజిల్స్‌ అని పిలుస్తారు. ప్రధానంగా పిల్లలకు వైరస్‌ వల్ల వచ్చే అంటువ్యాధి ఇది. దీనికి కారణం మార్‌బిల్లీ వైరస్‌. ఇప్పటి దాకా 21 రకాల తట్టుని కలిగించే మీజిల్స్‌ వైరస్‌ జాతులను గుర్తించారు. అసలు మీజిల్స్ రావడానికి కారణాలు ఏంటి..? ఇది రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?

మీజిల్స్ వ్యాధి కలిగించే వైరస్‌ చాలా తేలికగా, వేగంగా గాలి ద్వారా వ్యాపిస్తుంది. వ్యాధి ఉన్న వ్యక్తికి దగ్గరగా ఉండడం వల్ల రోగి విడిచిన గాలిలో ఉండే క్రిములు సమీపంలో ఉన్న వ్యక్తి శ్వాసనాళ వ్యవస్థలోకి ప్రవేశిస్తాయి. రోగి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు ఆ క్రిములు మరింత వేగంగా వ్యాప్తి చెందుతాయి. ఒకసారి మరో శరీరంలోకి ప్రవేశించగానే ఈ క్రిములు శరీర ఉపరితలంపై ఉండే కణజాలానికి అంటుకొని అక్కడ నుండి కణాలలోకి ప్రవేశించి రక్తం ద్వారా వివిధ శరీర వ్యవస్థలకు చేరతాయి.

జనసాంద్రత ఎక్కువ ఉన్న ప్రదేశాలలో ఈ వ్యాధి ఎక్కువగా ప్రబలుతుంది. ఈ క్రిములు శరీరంలో ప్రవేశించినప్పటి నుంచి రోగ లక్షణాలు కనిపించడానికి 4-12 రోజుల సమయం పడుతుంది. తట్టు వచ్చిన వారు వేరే వారికి ఈ రోగాన్ని రోగలక్షణాలు కనిపించిన మూడు రోజులనుంచి మొదలుకొని దద్దుర్లు పూర్తిగా తగ్గిన ఐదు రోజుల వరకూ అంటించే ప్రమాదముంది.

తట్టు వ్యాధి లక్షణాలు ఇది సోకినవారి రోగనిరోధక శక్తిపై ఆధారపడి ఉంటాయి. కళ్లు బాగా ఎర్రబడతాయి. దీనిని కంజక్టైవల్‌ కంజషన్‌ అంటారు.నోటి లోపలి బుగ్గలలో ఇసుక రేణువులు వంటి మచ్చలు కన్పిస్తాయి. శరీరంపై దద్దుర్లు ఎక్కువై జ్వరం తగ్గుముఖం పట్టగానే ఇవి కనిపించవు. మూడు కంటే ఎక్కువ రోజులు జ్వరం ఉంటుంది. పిల్లలు బాగా నలతగా, నీరసంగా ఉంటారు. తిండి తినబుద్ధి కాదు. ముక్కు వెంట నీరుకారుతూ, నోరు ఎర్రగా అవుతాయి. దగ్గుతుంటారు. రెండు, మూడువిరేచనాలూ కావొచ్చు. పైగా తీవ్రమైన జ్వరం ఉంటుంది. ముందు ముఖం మీద, తర్వాత చెవుల వెనుక, తర్వాత ఛాతీ మీద, ఆ తర్వాతి రోజు కాళ్లకు.. ఇలా క్రమేపీ తల నుంచి కాళ్ల వరకూ శరీరమంతా దద్దు వ్యాపిస్తుంది.

ముఖ్యంగా శరీరంపై దద్దుర్లను పరీక్షచేసి, రోగ లక్షణాల ద్వారా కొంతవరకూ ఈ వ్యాధి నిర్ధారణ చేస్తారు. కొన్నిసార్లు ఇలా నిర్ధారించలేకపోతే ల్యాబరేటరీలో మరికొన్ని పరీక్షలు చేస్తారు. లాలాజలాన్ని వైరస్‌ పరీక్షకి పంపి తట్టు ఉందో లేదో నిర్థారిస్తారు. మీజిల్స్‌ వైరస్‌ దాడి చేస్తే, శరీరం వ్యాధి నిరోధక యాంటీబాడీస్‌ తయారు చేస్తుంది. వాటిని రక్త పరీక్ష ద్వారా పరీక్షించి వ్యాధిని నిర్థారిస్తారు. ఈ వ్యాధి నిరోధక యాంటీబాడీస్‌ రెండు రకాలు ఎల్‌జిఎమ్‌, ఎల్‌జిజి. మీజిల్స్‌ ఎల్‌జిఎమ్‌ రక్తంలో కనిపిస్తే మీజిల్స్‌ ఉన్నట్లు అర్థం. అదే మీజిల్స్‌ ఎల్‌జిజి రక్తంలో కన్పిస్తే అంతకుముందు కూడా ఈ వ్యాధి సోకిందని, మీజిల్స్‌ టీకా కూడా తీసుకున్నట్లు స్పష్టమౌతుంది.

మిగతా వైరల్‌ జబ్బుల వలే తట్టుకు ప్రత్యేకమైన చికిత్స లేదు. వ్యాధి లక్షణాలు అనుసరించి, మందులు వాడాలి. కొద్దిరోజులు విశ్రాంతి తీసుకోవాలి. మిగతా వారితో కలవకుండా చూడాలి. ముందుగా లక్షణాలను బట్టి తట్టును గుర్తించి, అత్యవసరంగా చికిత్స ఆరంభించాలి. చాలామంది ఇలాంటి సమయాల్లో పిల్లలను ఇంట్లోనే కూచోబెట్టి నానా పథ్యాలూ చేయిస్తుంటారు. ఇది సరికాదు. ఎందుకంటే దీనిమూలంగా ఇతర ముప్పులు పొంచి ఉంటాయి. కాబట్టి తప్పకుండా డాక్టర్‌ ద్వారానే చికిత్స పొందాలి. ఈ వ్యాధిసోకిన పిల్లలందరికీ విటమిన్‌ ఏ, బీ కాంప్లెక్స్‌ తప్పకుండా ఇవ్వాలి. తగినన్ని నీళ్లు తాగించాలి. ఏ రూపంలోనైనా ఆహారం ఇవ్వాలి. నోటితో తీసుకోలేకపోతే సెలైన్‌ పెట్టి, పోషకాలను అందించాలి.

తట్టు వ్యాధి పిల్లలకు చాలా ప్రమాదకరమైంది కాబట్టే జాతీయ టీకా కార్యక్రమంలో భాగంగా టీకాల ద్వారా నిరోధిస్తున్నారు. బిడ్డకు తొమ్మిది నెలలు నిండగానే దీన్నిస్తారు. దీంతో చాలావరకూ సమస్య దరిజేరదు. మీజిల్స్‌ వ్యాక్సిన్‌ (టీకా)లో ఉండే బలహీనమైన వైరస్‌ల కారణంగా అదే తరహా వైరస్‌లను అడ్డుకొనే సామర్ధ్యాన్ని శరీర రక్షణ వ్యవస్థ పొందుతుంది.

మీజిల్స్‌ వైరస్‌ వాక్సిన్‌ వైరల్‌ వాక్సిన్ల మందుల విభాగంలోకి వస్తుంది. ఇది యాంటీబాడీస్‌ని ఉత్పత్తి చేసి, శరీరాన్ని రక్షించేందుకు సహాయపడే ప్రోటీన్‌ రకానికి చెందినది. రోగ నిరోధక వ్యవస్థని సకాలంలో స్పందింపజేయడం ద్వారా మీజిల్స్‌ వైరస్‌కు వ్యతిరేకంగా రక్షణ అందించేలా పనిచేస్తుంది. అయితే మన దేశంలో కేవలం 60 శాతానికి పైబడి మాత్రమే పిల్లలు ఈ టీకాను తీసుకున్నారు. ఇంకా దాదాపు 40శాతం మంది తీసుకోవాల్సి ఉంది. దేశంలో 80 శాతం మంది పిల్లలు ఈ టీకాను తీసుకునేలా చేస్తే. ఇది ఒకరి నుంచి మరొకరికి వ్యాపించటం తగ్గుతుంది. అప్పుడు దీన్ని పూర్తిగా నిర్మూలించే అవకాశం ఉంటుంది.

టీకా తీసుకోవ‌డం త‌ప్ప‌నిస‌రి కాద‌నే అపోహలో చాలా మంది ఉంటారు. ఇది స‌రైంది కాదు. టీకా ప్రాణాంతక వ్యాధుల నుంచి కాపాడుతుంది. రోగ నిరోధక శక్తిని పెంచి రోగాలు రాకుండా కాపాడుతుంది. ముఖ్యంగా పెద్దలకు టీకాలపై అవగాహన ఎంతో అవసరం. ఈ టీకాలు చిన్నారులకు వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తాయి.

Leave a Comment