Psoriasis – సోరియాసిస్‌ ‘అంటు వ్యాధా’? సోరియాసిస్ వస్తే ఇక తగ్గదా?

By manavaradhi.com

Published on:

Follow Us
Psoriasis – Myths and Facts

మారుతున్న జీవనశైలి, వాతావరణంలో జరుగుతున్న మార్పులు ఎన్నో చర్మసమస్యలకు కారణం అవుతున్నాయి. వాటిలో సొరియాసిస్ ఒకటి. వయసుతో సంబంధం లేకుండా వచ్చే ఈ వ్యాధి ….. జన్యుపరమైన కారణాల వల్ల ఎక్కువగా రావచ్చు.అసలు సోరియాసిస్ కు ప్రధాన కారణాలేంటి, దాని నివారణకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.

దీర్ఘకాలికమైన రోగనిరోధక శక్తిలో మార్పుల వలన సంభవించే వ్యాధి సొరియాసిస్. ఆరోగ్యవంతుల్లో చర్మం ఉపరితలం కింద కొత్తకణాలు నిరంతరం తయారవుతుంటాయి. సుమారు 24 నుంచి 30 రోజులకు ఇవి వెలుపలకు చేరుకుంటాయి. కాని సొరియాసిస్ బారినపడిన వారిలో ఈ వ్యాధి అదుపు తప్పి చర్మకణాలు, మూడు లేదా నాలుగు రోజులకే వేగంగా తయారై వెలుపలకు చేరుకుంటాయి.

దీనివల్ల చర్మం మందంగా తయారవ్వడం, దురద, పొలుసులు ఊడడం లాంటి సమస్యలు ఏర్పడతాయి. ముఖ్యంగా ముంజేతి వెనుక భాగం, మోకాలు ముందు భాగం, తల, వీపు, ముఖము, చేతులు, పాదాలకు ఈ వ్యాధి వస్తుంది. సరైన చికిత్స తీసుకోకపోతే…. దీర్ఘకాలం బాధించే మొండి వ్యాధిగా ఇది మారుతుంది.

సొరియాసిస్ ను ఎలాంటి లక్షణాల ద్వారా గుర్తించవచ్చు ?
చర్మం మాత్రమే కాకుండా గోళ్లు, తల వంటి ఇతర శరీర భాగాలు కూడా సొరియాసిస్ ప్రభావానికి లోనుకావచ్చు. పొట్టు రాలటం, దురద, జుట్టు రాలడం వంటివి సొరియాసిస్ ప్రథమ లక్షణాలు. కొంతమందిలో చర్మంలో మంటలు, గోకిన కొద్దీ దురదలు పెరగడం సర్వసాధారణంగా కనిపిస్తుంది. నిజానికి సొరియాసిస్ ప్రధాన లక్షణం దురద కాదు. అయితే వాతావరణం చల్లగా ఉంది, తేమ తగ్గిపోయినప్పుడుగానీ, ఇన్ఫెక్షన్ల వంటివి తోడైనప్పుడుకానీ దురద ఎక్కువ అవుతుంది.

బాధితుల్లో 10-30శాతం మందికి తీవ్రమైన కీళ్లనొప్పులు కూడా సంభవిస్తాయి. సొరియాసిస్ వ్యాధి ఏర్పడటానికి మానసిక ఒత్తిడి నుంచి ఇన్ఫెక్షన్ల వరకు ఎన్నో కారణాలు ఉంటాయి. వంశపారంపర్యంగా కూడా సొరియాసిస్ రావచ్చు. జన్యులోపాలకు కొన్ని రకాల ప్రేరేపిక అంశాలు తోడైనపుడు సొరియాసిస్ వంటి లక్షణాలుగా బయటపడుతాయి. వంశపారపర్యంగా రావడానికి అవకాశం ఉన్నా అదే కారణం కాదు.

ప్రొటీన్స్, పౌష్ఠికాహార లోపం, కొన్ని రకాల సబ్బులు, డిటర్జెంట్‌ల వల్ల , హార్మోన్ల సమస్య వల్ల రక్తప్రసరణ తగ్గినపుడు శరీరకణాలకు అవసరమైన ఆహారం లభించకపోవడంతో పాటు జీవక్రియలో ఏర్పడిన వ్యర్థాల తొలగింపులో జాప్యం జరగడం వాతావరణ మార్పులకు శరీరం అలవాటు పడకపోవడం, చిన్న చిన్న అనారోగ్య సమస్యలకు ఇష్టానుసారంగా మందులు వాడటం వల్ల జీవరసాయనాల అసమతుల్యత వల్ల సొరియాసిస్ ప్రారంభమవుతుంది. దీనిపట్ల అవగాహన లేకుండా… అందుబాటులో ఉన్న రకరకాల మందులు, షాంపూలు, పైపూతల ద్వారా తాత్కాలిక ఉపశమనంతో రాజీపడటం ద్వారా సమస్య మరింత జటిలమవుతుంది.

సొరియాసిస్ నివారణకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ?
సోరియాసిస్‌ను చాలావరకు లక్షణాలను బట్టే గుర్తిస్తారు. చర్మం, మాడు, గోళ్ల వంటి వాటిని పరీక్షించి సమస్యను నిర్ధరిస్తారు. అరుదుగా కొందరిలో చర్మం ముక్కను తీసి మైక్రోస్కోప్ ద్వారా పరీక్షిస్తారు. ఇందులో సోరియాసిస్ ఏ రకానికి చెందిందో గుర్తిస్తారు. సొరియాసిస్ తీవ్రతను బట్టి చికిత్స అందించవలసి ఉంటుంది.

ఇది దీర్ఘకాలికమైనది కాబట్టి ప్రతి ఇద్దరిలో జబ్బు తీవ్రతలో మార్పు ఉంటుంది. తగినంత శారీరక శ్రమ, విశ్రాంతి, సమతుల ఆహారము, మంచి అలవాట్లు, మెడిటేషన్, చర్మ రక్షణకు సంబంధించిన జాగ్రత్తలు, ఇతర ఇన్ఫెక్షన్లు రాకుండా శుచి, శుభ్రత పాటించడం, పొడి చర్మానికి తేమ కోసం నూనె పూసుకోవడంలాంటివి చేస్తూ ఉండాలి. సొరియాసిస్ చికిత్సలో చాలా వరకూ పైపూత మందులను వాడుకుంటే సరిపోతుంది. తీవ్రతను బట్టి మాత్రలు, ఇంజెక్షన్లు ఇస్తారు. ప్రస్తుతం ఈ వ్యాధికి బయోలాజికల్స్ అందుబాటులో ఉన్నాయి. ఇవినేరుగా రోగ నిరోధక వ్యవస్థ మీదనే పని చేస్తాయి గనుక… మంచి ఫలితాలు కనపడతాయి. అనుభవజ్ఞుడైన వైద్యుని అందుబాటులో చికిత్స ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి.

కొన్ని వాతావరణ పరిస్థితుల్లో ఈ వ్యాధి పెరుగుతూ ఉంటే, మరి కొన్ని వాతావరణ పరిస్థితుల్లో అదుపులోకి వచ్చినట్లే కనిపిస్తుంది. ఏదేమైనా సొరియాసిస్ బాధితులు శారీరకంగా ఇబ్బందిపడుతూ, మానసికంగా నలిగిపోతూ ఉంటారు. అందుకే దీన్నో మొండి వ్యాధిగా పరిగణిస్తారు. కాబట్టి దీనిపట్ల అవగాహానతో మన చర్మఆరోగ్యాన్ని కాపాడుకుందాం..

Leave a Comment