మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమా మరి కొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.. ఈ తరుణంలో ఈసారి టికెట్ల వేలంతో కొత్త చరిత్ర సృష్టిస్తున్నారు మెగా అభిమానులు. ఎన్నో భారీ విజయాలు ఖాతాలో వేసుకున్న చిరంజీవి.. నేటితరం హీరోలకు కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. ఇప్పటికీ టాలీవుడ్ లో చిరు హవా అలాగే ఉంది. చిరంజీవి సినిమా వస్తుందంటే ఏకంగా మూడు తరాలు ఎగిరిగంతేస్తున్నాయి..ఇదీ మెగాస్టార్ రేంజ్.
ఈ నెల 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమా కోసం అభిమానులు ఏకంగా లక్షలు వెచ్చించి టికెట్లు కొనుగోలు చేయడం ఇప్పుడు ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. తాజాగా కోనసీమ జిల్లా అమలాపురంలో మెగా ఫ్యాన్స్ నిర్వహించిన తొలి టికెట్ వేలంలో రికార్డు స్థాయి ధర పలికింది. ఈ వేలంలో ఒక బీజేపీ నాయకుడు ఏకంగా రూ. 1,11,111 (లక్షా పదకొండు వేల నూట పదకొండు రూపాయలు) వెచ్చించి సినిమా తొలి టికెట్‌ను సొంతం చేసుకున్నారు, తన అభిమాన హీరో సినిమాను ఫస్ట్ డే, ఫస్ట్ షో చూడాలనే ఆరాటంతో ఆయన ఈ స్థాయి ధరకు వెనుకాడలేదు.
నరసాపురంలోని ప్రముఖ థియేటర్ ‘అన్నపూర్ణ’లో జరిగిన వేలం కూడా మొదటి టికెట్ ధర రూ. 1,02,000 (లక్షా రెండు వేలు) పలికింది. ఒక సామాన్యమైన సినిమా టికెట్ ఈ స్థాయిలో ధర పలకడం మెగాస్టార్ క్రేజ్‌కు నిదర్శనమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ వేలం ద్వారా వచ్చిన డబ్బును అభిమానులు తమ సొంతానికి వాడుకోకుండా ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు, అదేమంటే వేలంలో పోగైన ఈ భారీ మొత్తాన్ని చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ (CCT)కు విరాళంగా ఇవ్వనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు.









