నేటి ఉరుకుల పరుగుల బిజీ జీవితంలో తల్లిదండ్రులకు తమ పిల్లలను సరిగ్గా చూసుకునే టైం కూడా లేకుండా పోతుంది. కొంత మంది ఐతే పిల్లలకు ఎలాంటి పోషకాలు లేని ఆహారం తినిపిస్తున్నారు. పిల్లలు ఆహారం ఎక్కూవగా తినకపోయినా… తినిపించేది తక్కువైన పౌష్టికమైన ఆహారం అందించడం ఎంతో అవసరం. ఎలాంటి ఆహారాలు పిల్లలకు ప్రతి రోజు ఇవ్వాలి… వారి ఆరోగ్యానికి ఏ ఆహారం మంచిదన్న విషయాలను తప్పని సరిగా తెలుసుకోవాలి.
పిల్లలు ఆటలు, చదువుల ధ్యాసలో పడి తిండి అసలు తినడం లేదని తల్లితండ్రులు తెగ భాదపడిపోతారు. చాలా మంది తల్లిదండ్రులు పిల్లల ఆహారంపై శ్రద్ధ చూపించడం లేదు. దీంతో పిల్లల్లో పోషకాహార లోపం ఏర్పడుతుంది. అంతేకాదు అది ఇతర అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది. పిల్లలకు ఉదయం 8 గంటల లోపే కచ్చితంగా అల్పాహారం ఇవ్వాలి. దాంతో వారికి త్వరగా శక్తి అందుతుంది యాక్టివ్‌గా ఉంటారు. ఆలస్యం చేసే కొద్ది శరీరంలో నీరసం పెరుగుతుంది. శక్తి లేకుండా ఉంటారు. కనుక ఉదయాన్నే వారికి త్వరగా ఆహారాన్ని ఇవ్వాలనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.
ఉదయాన్నే చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు జంక్ ఫుడ్ తినిపిస్తుంటారు. అలా చేయకూడదు. వాటి కన్నా ఇడ్లీ, చపాతి, పోహా, కిచ్‌డీ వంటి సాంప్రదాయ వంటకాలను తినిపించాలి. వాటి ద్వారానే పోషకాలు ఎక్కువగా లభిస్తాయి. అలాగే పిల్లలకు ఏ సీజన్‌లో లభించే పండ్లను తప్పనిసరిగా ఇవ్వాలి. దీంతో వారికి కావల్సిన విటమిన్లు, మినరల్స్ సమృద్ధిగా అందుతాయి. పిల్లలకు సాధ్యమైనంత వరకు బయటి ఆహారం పెట్టకూడదు. ముఖ్యంగా జంక్ ఫుడ్‌కు దూరంగా ఉంచాలి.
పిల్లలకు వారంలో కనీసం 4 రోజులపాటు తప్పని సరిగా ఆకు కూరలతో చేసిన ఆహారం ఇస్తే వారికి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. స్కూల్స్‌కు వెళ్లేటప్పుడు కూడా లంచ్ బాక్సులో పండ్లు, క్యారెట్లు, బీట్‌రూట్, కీర దోస వంటి పచ్చి కూరగాయలు ఉండేలా చూడాలి. వారు తినలేకపోతే అలవాటు చేయాలి. వాటిని తినడం వల్ల శరీరానికి తగినంత పీచు పదార్థం లభిస్తుంది. అది జీర్ణ సమస్యలను పోగొడుతుంది. అధిక బరువు పెరగకుండా ఉంటారు.
పిల్లలకు రోజూ ప్రోటీన్లు లభించేందుకు గుడ్డు, పాలు, పప్పు ఇవ్వాలి. అలాగే చేపలు, చికెన్, మటన్ వంటి ఆహారాలను పెట్టవచ్చు. వాటితో శరీర నిర్మాణం సక్రమంగా ఉంటుంది. పిల్లలు చక్కగా ఎదుగుతారు. శారీరక దృఢత్వాన్ని కలిగి ఉంటారు. మెదడుకు మరియు శరీరం కోసం శక్తిని అందించడానికి పాల ఉత్పత్తులు ప్రోటీన్ మరియు క్యాల్షియం బాగా సహాయపడుతాయి. గుడ్లులో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది.
ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో పిల్లలకు ఒక గ్లాసు పాలతో పాటు గుడ్డును అంధించాలి. వివిధ రకాల పండ్లలో ఏ పండైనా సరే పిల్లలకు ఆరోగ్యకరమే. పిల్లలు పండ్లు తినడం వల్ల పిల్లలకు అవసరం అయ్యే విటమిన్స్ మరియు మినిరలల్స్ పుష్కలంగా అందుతాయి. మరియు పండ్లలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. మరియు ఇవి పిల్లలను చురుకుగా ఉంచుతుంది.
మొదటి అయిదేళ్లు పిల్లల జీవితంలో చాలా ముఖ్యమైనవి. అప్పుడు శారీరక ఎదుగుదల బాగుంటుంది. జీర్ణవ్యవస్థ చురుగ్గా పనిచేస్తుంది. రోగనిరోధకశక్తి కూడా పెరుగుతుంది. పిల్లలు పొడుగవుతారు. బరువు కూడా పెరుగుతారు. ఈ వయసు పిల్లల్లో ఏకాగ్రత తక్కువ. ప్రతి పదినిమిషాలకూ వారి దృష్టి వేరే వాటిమీదికి మళ్లిపోతుంటుంది. అందుకే తల్లిదండ్రులు పిల్లలకు 20 నిమిషాల లోపు అన్నం తినిపించాలి. ఆకలేసినప్పుడే పిల్లలకు అన్నం పెట్టాలి. ఆకలి కాకుండానే అన్నం పెడితే వారు సరిగా తినరు.
పిల్లలకు ఏది ఇష్టమో తెలుసుకునే ప్రయత్నం చేయాలి. వాళ్ల స్నేహితులు ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ తెచ్చుకుంటారో అడిగి తెలుసుకుంటే మరీ మంచిది. అలా చేస్తే ఫుడ్‌కి సంబంధించి పిల్లల ఇష్టాయిష్టాలు ఏమిటో తల్లిదండ్రులకు తెలిసే అవకాశం ఉంటుంది. ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ వారికి ఇష్టం, ఎలాంటివి ఇష్టం లేదు తెలుసుకుని తదనుగుణంగా మెనూ టైమ్‌టేబుల్ తయారుచేసి పిల్లలకు పెట్టాలి. టైమ్‌కు అనుగుణంగా ఆహారం వారికి పెట్టాలి.
అన్నం తినే వేళలు సరిగ్గా పాటిస్తే పిల్లలు ఎప్పుడూ హుషారుగా, ఎనర్జిటిక్‌గా ఉంటారు. కుటుంబసభ్యులతో కలిసి అన్నం తినడాన్ని పిల్లలకు చిన్నప్పటి నుంచే అలవాటు చేయాలి. నలుగురితో కూర్చుని తినడం వల్ల పిల్లలు బాగా తింటారు కూడా.
పిల్లలకు ఎక్కువగా తినిపించనవసరం లేదు, కొద్దిగా అయినా బలాన్ని చేకూర్చే ఆహారం పెట్టడం మంచిది. వాళ్ళు తినడం లేదు అని ఎక్కువగా అలోచించి కంగారు పడనవసరం లేదు, మీరు చెయ్యవలసిందల్లా, వాళ్ళు తినే కొంచెం ఆహారంలో అయినా పొషక పదార్దాలు నిండుగా ఉండేలా చుసుకుంటే సరిపోతుంది.