Root vegetable – దుంపలు తింటే కలిగే లాభాలు ఇవే!

By manavaradhi.com

Published on:

Follow Us
Healthiest root vegetables

నోటికి రుచి, శరీరానికి శక్తి అందించడం కోసం మనం అనేక రకాల పదార్ధాలను ఆహారంలో భాగం చేసుకున్నాం. వాటిలో భూమి కింద పండేవి అనేకం ఉన్నాయి. వీటినే రూట్ వెజిటబుల్స్ అంటారు. అంటే మొక్కల వేర్ల రూపంలో పెరిగి, మనకు ఆహారంగా మారుతున్నాయి. దుంపలు, గెడ్డలు, పాయలు.. ఇలా రకరకాలుగా పిలుచుకుంటాం. వీటిలో చెప్పుకోవాల్సింది, నిత్యం మనం ఉపయోగించేది బంగాళదుంప. ఏదో ఒక విధంగా బంగాళదుంప మన రోజువారీ ఆహారంలో భాగమయిపోయింది. అన్నింటిలోనూ రుచికరంగా ఉండే బంగాళదుంపలో పోషకాలు కూడా ఎక్కువే. పోటాషియం, మాంగనీస్, విటమిన్ బి6, విటమిన్ సితో పాటు ఫైబర్ కూడా కావాల్సినంత దొరుకుతుంది. ప్రేగుల్లో జీర్ణం కాకుండా మిగిలిపోయిన ఆహారంలోకి చేరిపోయి.., దాన్ని బయటకు పంపే ప్రయత్నం చేస్తుంది బంగాళాదుంప. దీని వలన జీర్ణ సమస్యలు తప్పుతాయి. అలాగే బంగాళదుంపలతో చేసిన ఆహారం కాస్త తిన్నా కడుపు నిండినట్టు అనిపిస్తుంది. దీంతో పదే పదే ఆహారం తినడం తగ్గుతుంది.

బరువు తగ్గాలనుకునేవారికి ఆలూ ఈ విధంగా మేలు చేస్తుంది. అయితే బంగాళదుంపల్ని ఇష్టమొచ్చినట్టు తిన్నంతమాత్రాన శక్తి రాదు. కొన్నిసార్లు ఆరోగ్య ఇబ్బందులు తలెత్తవచ్చు. పచ్చి కూరగాయలు తినడం ఆరోగ్యం అని చెబుతారు. కానీ ఆలుగడ్డ విషయంలో అది కరెక్ట్ కాదు. ఆలూను పచ్చిగా తినకూడదు. ఇక ఆలూను చాలా మంది స్నాక్స్, చిప్స్ రూపంలో తింటారు. ఇది శరీరానికి మేలు చేయదు. కేవలం ఉడకబెట్టిన, వేపిన ఆలూ మాత్రమే మంచిది.

దుంపల జాతికే చెందిన రూట్ వెజిటబుల్ స్వీట్ పొటాటో. చిలగడదుంపగా పిలుచుకునే ఈ రకాన్ని మనం చాలా నిర్లక్ష్యం చేస్తున్నాం. బరువు తగ్గాలనుకునేవారు, వెంటనే శక్తి కావాలనుకునేవారికి చిలగడదుంప చాలా మేలు చేస్తుంది. ఫైబర్, మాంగనీస్, విటమిన్ సి, విటమిన్ ఎతో పాటు వ్యాధినిరోధక శక్తి పెంచే గుణాలు చిలగడదుంపలో పుష్కలంగా ఉంటాయి. తియ్యగా ఉందని చిలగడదుంపను దూరం పెడుతుంటారు డయాబెటిస్ పేషెంట్లు. నిజానికి స్వీట్ పొటోటా వలన మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా ఉపయోగం ఉంటుంది. పన్నెండు వారాల పాటు చిలగడదుంపల్ని ఆహారంలో ఉపయోగించినవారికి షుగర్ లెవల్స్ తగ్గినట్టు ఓ సర్వేలో తేలింది. కంటిచూపు మెరుగుపడటం, చర్మ ఆరోగ్యానికి సహకరించడం చిలగడదుంప ప్రత్యేకతలు.

రూట్ వెజిటబుల్స్లో తిరుగులేని ఆరోగ్య శక్తి ఉల్లిపాయ. ఉల్లి నిండా పోషక విలువలే. పచ్చిగా తిన్నా, ఉడికించి తిన్నా కూడా దీని వలన కలిగే ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. యాంటీ సెప్టిక్, యాంటీ బయాటిక్ల నిలయం ఉల్లి. విటమిన్ బి 12, విటమిన్ బి6, విటమిన్ సితో పాటు కాల్షియం, ఫోలిక్ యాసిడ్, ఫైబర్, సల్ఫర్, పొటాషియం ఇలా ఎన్నో మూలకాలు ఉల్లిలో ఉన్నాయి. దీంతో శరీరంలో రోగనిరోధక వ్యవస్థ బలపడటానికి ఉల్లి ఉపయోగపడుతుంది. రక్తశుద్ధికి, రక్తవృద్ధికి కూడా ఉల్లి ఉపకరిస్తుంది. ఇక ఉల్లిలో అధికంగా ఉండే క్రోమియం వలన శరీరంలో షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి. అలాగే బరువు పెరగకుండా కంట్రోల్ చేయాలనుకున్నా కూడా ఉల్లి సహకరిస్తుంది.వీటితో పాటు దగ్గు, చెవినొప్పి, జ్వరం, జుట్టు ఊడిపోవడం లాంటి సమస్యలు నయం చేయడానికి పాటించే చిట్కాల్లో కూడా ఉల్లి అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఉల్లిగడ్డల్ని రోజువారీ ఆహారంలోభాగం చేసుకోవడం ద్వారా ఎముకల బలహీనత కూడ అధిగమించవచ్చు.అలాగే మూత్రపిండాలు, మూత్రాశయంలో రాళ్లతో బాధపడేవారికి మేలు చేస్తుంది.

ఉల్లి జాతికే చెందని మరొకటి వెల్లుల్లి. ఇది ఉల్లి కంటే ఎక్కువ ఔషధ గుణాలు కలిగి ఉంటుంది. అతిగా వెల్లుల్లి తినడం వలన కడుపులో మంట రావచ్చు. కాబట్టి అల్సర్లు, అలర్జీ సమస్యలున్నవారు మినహాయించి అందరికీ వెల్లుల్లి ఎంతో మేలు చేస్తుంది. వెల్లుల్లిలో ఉండే అలిసిన్ అనే మూలకం వలన రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. అలాగే రక్తనాళాల్లో ఎక్కడయినా బ్లాకులు ఏర్పడితే వాటిని తొలగించడంలో కూడా వెల్లుల్లి ఉపకరిస్తుంది. దీంతో గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. అలాగే రక్తంలో ఉన్న చెడు క్రొవ్వులు కరిగించడంలో కూడా వెల్లుల్లి పాత్ర కీలకం. శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెంచడంతో పాటు రక్తంలో చక్కెర నిల్వల స్థాయిని నియంత్రిస్తుంది. డాక్టర్ బైట్

రంగు, రుచి కోసం వంటల్లో ఉపయోగించే పసుపు ఆరోగ్యానికి కూడా అవసరమే. దీనిలో ఉండే కర్సమిన్ అనే మూలకం రక్తంలో సులభంగా కలిసిపోతుంది. రక్తంలోకి చేరిన తరువాత చెడు క్రొవ్వులను తగ్గించడం, రక్తనాళాల్లో పేరుకుపోయిన బ్లాక్లను తొలగించడం, క్యానర్లు రాకుండా నిరోధించడం చేస్తుంది. కీళ్లనొప్పులు తగ్గడానికి కూడా పసుపు ఉపకరిస్తుంది. ఇక మెదడు పనితీరు మెరుగుపరచడంలో పసుపు కీలక పాత్ర పోషిస్తుందని తేలింది. పసుపుతో పాటు అల్లం కూడా భూమిలో పండేదే. దీనిలో కూడా యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సి, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి.

రక్తంలో ఉన్న క్రొవ్వు, ట్రై గ్లిసరిన్ లాంటివి కరగడంలో అల్లం కీలకపాత్ర పోషిస్తుంది. వ్యాధినిరోధక శక్తి పెంచడానికి కూడా అల్లం ఉపయోగపడుతుంది. ఇక వంటతో సంబంధం లేకుండా తినగలిగే రూట్ వెజిటబుల్ క్యారెట్. చిన్నా, పెద్దా అందరూ ఇష్టంగా తింటారు. విటమిన్ ఎ, విటమిన్ కెలు క్యారెట్లో పుష్కలంగా ఉంటాయి. దీంట్లో ఉండే బీటా కెరోటిన్ అనే మూలకం కంటిచూపును మెరుగుపరచడంలో బాగా ఉపయోగపడుతుంది. అలాగే క్యారెట్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు…. వయసు పెరగడం వలన వచ్చే సమస్యలను ఎదుర్కోవడంలో బాగా ఉపయోగపడతాయి. కాబట్టి యాభై ఏళ్లు దాటిన వారు క్యారెట్లను ఆహారంలో భాగం చేసుకోవడం అవసరం. ప్రొస్టేట్, బ్రెస్ట్ క్యానర్లు లాంటివి దాడి చేయకుండా కూడా శరీరాన్ని కాపాడటంలో క్యారెట్ ఉపయోగపడుతుంది.

బీట్రూట్, ముల్లంగి, చామదుంప, కందలాంటివి శరీరానికి అందించే పోషకాలు ఎన్నో ఉన్నాయి. మొత్తంగా రూట్ వెజిటబుల్స్ను మన రోజువారీ ఆహారంలో ఏదో ఒక రకంగా తింటున్నాం. ఒకవేళ ఆహారంలో లేకపోతే ఇకపై అలవాటు చేసుకోవాల్సిందే. క్యాన్సర్లను ఎదుర్కోవడంలోనూ, వ్యాధి నిరోధక శక్తి పెంచడం, గుండె జబ్బులు, దీర్ఘకాల రోగాలు తగ్గించడంలోనూ ఇవి బాగా పనిచేస్తాయి.

అన్నంతోనో చపాతీలతోనో కూర యాధాలపంగా తినేస్తాం. కానీ ఆ కూరలో ఆలూతో పాటు ఉల్లి, అల్లం, వెల్లుల్లి, పసుపు, క్యారెట్…. ఇలా మనకు పోషకాలు, విటమిన్లు అందించేవన్నీ ఉన్నాయి. కాబ్టటి కూరలు.. ముఖ్యంగా భూమిలో పండే కూరల్ని సరిపడా తినాలి. అన్నం ఎక్కువ, కూర తక్కువగా తినడం సరికాదు. అన్నం నుంచి వచ్చే కార్బోహైడ్రేట్లు కడుపు నింపడానికి, శక్తికి ఎంత అవసరమో…, కూర ద్వారా రూట్ వెజిటబుల్స్ ఇచ్చే పోషకాలు, ఆరోగ్యం అంతే అవసరం.

Leave a Comment