Eating habits: ఆహారపు అలవాట్లు ఇలా మార్చుకుంటే చాలు

By manavaradhi.com

Published on:

Follow Us
Improving Your Eating Habits

మంచి ఆరోగ్యానికి మంచి అలవాట్లు ఎంతగానో దోహదపడతాయి. ఈ మంచి–చెడ్ల అలవాట్లు ఆహారం విషయంలోనూ ఉంటాయి. మంచి ఆహారపు అలవాట్లతో మంచి వ్యాధి నిరోధకత సమకూరడం మనకు పైకి వెంటనే కనిపించకపోవచ్చేమో గానీ.. మంచి ఇమ్యూనిటీ రావడం తప్పక జరుగుతుంది. అయితే ఒకవేళ మన ఆహారపు అలవాట్లు అంతగా బాగా లేవనుకోండి. వాటి ప్రతికూల ప్రభావాలు తక్షణం కనిపిస్తాయి.

ప్రస్తుతం ఉరుకు పరుగుల జీవితంలో వేళా పాళా లేకుండా ఏదో తినేశాం అనుకుంటూ మొక్కుబడిగా ఏదో ఒకటి పొట్టలో వేసేస్తున్నాం. జంక్ ఫుడ్స్, శీతల పానియాల్లాంటివి దానికి తోడైతే ఇంకేముంది… పోషకాలు అందడం అనే విషయం పక్కన పెడితే రకరకాల అనారోగ్య సమస్యలకు దారి తీస్తున్నాయి. సరైన ఆహారం అంటే రోజుకు ఎన్ని పూటలు తినాలి అనే సందేహాలు కూడా కలగవచ్చు. అయితే ఒకే రకమైన ఆహారం అందరికీ పోషకాలు అందిస్తుందని చెప్పలేము. పోషకాలు అందడంలో అనేక అంశాలు కీలక పాత్ర పోషిస్తాయి. ఏదేమైనా ఆహారాన్ని మరి ఎక్కువో లేదంటే మరీ తక్కువో తీసుకోకూడదు. కచ్చితంగా తగినంత అహారాన్ని కచ్చితంగా తీసుకోవాలి. వేళను పాటించాలి. ఇలా చేయడమే శరీరంలో జీవక్రియలను అదుపులో ఉంచి ఆరోగ్యాన్ని పెంచుతుంది.

పోషణ పరంగా చూస్తే అన్ని రకాల ఆహారాలు మంచివే. కానీ రుచి పరంగా చూసినప్పుడు మాత్రం కొన్నింటిని దూరంగా ఉంచడమే మంచింది. అలాంటి వాటిలో ప్రధానంగా చెప్పుకోవలసింది తీపి పదార్థాలు, వేపుళ్ళు. ఇలాంటి వాటిని వీలైనంత వరకూ తగ్గించుకోవాలి. అదే విధంగా పుల్లని లేదా కారం పదార్థాలు ఇష్టమైన వారు, అదే పనిగా పూర్తిగా వాటితోనే గడిపేయకూడదు. రోజు వారి ఆహారంలో అన్ని రుచులు ఉండడం తప్పని సరి. అయితే ఒకటే దానికి అధిక ప్రాధాన్యత ఇవ్వకూడదు. అహారంలో సలాడ్స్ ఉండేలా చూసుకోవాలి.

మనం తీసుకునే ఆహారంలో జీర్ణం కాని పదార్థాలకు ఇది మంచి మందు. వాతావరణాన్ని, ఆరోగ్య పరిస్థితిని దృష్టి పెట్టుకుని విటమిన్లు, ప్రొటీన్లు, కార్బోహైడ్రేడ్లు… ఇలా అన్నింటి సమ్మిళితమైన ఆహారాన్ని తీసుకోవాలి. కొవ్వు పదార్థాలు అనగానే చాలా మంది భయపడుతుంటారు. అయితే మేలు చేసే కొవ్వులు మాత్రం శరీరానికి అందాల్సిందే. అదే విధంగా కొన్ని సందర్భాల్లో ఆరోగ్యకరమైన ఆహారం అయినప్పటికీ సరైన విధానంలో తీసుకోక ఇబ్బందులు ఎదురౌతూ ఉంటాయి. ఇవి పొట్ట మీద ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. అందుకే సరైన ఆహారాన్ని సరైన విధానంలో తీసుకుంటూ ఉండాలి.

పొద్దున్నే బ్రేక్‌ఫాస్ట్‌ మిస్‌ చేయకపోవడం మంచి ఆరోగ్యకరమైన ఆహారపు అలవాటు. ఉదయం మన రోజుమొదలు కాగానే ఆరోజంతా కావాల్సిన శక్తి కి ప్రధాన వనరు ‘బ్రేక్‌ఫాస్ట్‌’. కాబట్టి బ్రేక్‌ఫాస్ట్‌ మాత్రం తప్పక తీసుకోవాలి. మన భోజనంలో పిండిపదార్థాలనిచ్చే బియ్యం, గోధుమలు, ప్రోటీన్లకోసం పప్పులు, మాంసాహారం, కొవ్వుల కోసం నూనెలతో పాటు ఆహారంలో ఆకుకూరలు, కూరగాయలు; విటమిన్లను సమకూర్చే తాజాపండ్లు తీసుకోవాలి. మంచి ఆహారం శరీరానికి శక్తిని అందిస్తే దాన్ని నిలబెట్టుకోవడానికి పరిశుభ్రత తప్పనిసరి. ఎందుకంటే శుభ్రత లోపిస్తే, అమృతం లాంటి ఆహారం కూడా విషంలా మారిపోతుంది. అయితే శుభ్రత మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది. తినడానికి ముందు, తిన్న తర్వాత చేతులను శుభ్రపరచుకోవాలి.

ఆహారాన్ని ఒకే సారిగా కాకుండా, మన ఆరోగ్యాన్ని బట్టి, న్యూట్రిషన్ సలహాలను దృష్టిలో ఉంచుకుని రోజులో అప్పుడు కొంచెం, అప్పుడు కొంచెం తీసుకోవచ్చు. ఏదో నాలుగు ముద్దలు తిని ముగించామా అనుకోకుండా ప్రశాంతమైన వాతావరణంలో తినడం వల్ల ఏం తింటున్నామో, ఎంత తింటున్నామో తెలుస్తుంది. ఏ ఆహారం తీసుకున్నా ఎక్కువగా తీసుకోకపోతే చాలు, మన ఆరోగ్యాన్ని ఆహారంతో అమృతమయం చేసుకోవచ్చు.

మన భోజనంలో ప్రధానంగా అన్ని రకాల పోషకాలు ఉండాలి. అంటే… తక్షణ శక్తినిచ్చే కార్బోహైడ్రేట్లు, కణాలూ కణజాలాలలను రిపేర్‌ చేసి, వాటిని నిర్మించే ప్రోటీన్లు, దేహానికి అవసరమైన కొవ్వులతోపాటు, విటమిన్లు, మినరల్స్‌ ,ఖనిజ లవణాలు… మళ్లీ ఇందులోనూ ఎక్కువ మోతాదుల్లో అవసరమయ్యే మ్యాక్రో న్యూట్రియెంట్లు, తక్కువ మోతాదుల్లోనైనా తప్పనిసరిగా కావాల్సిన మైక్రో న్యూట్రియెంట్లు… ఇవన్నీ ఉండేలా మన భోజనం ఉండాలి. ఇలా అన్నీ సమపాళ్లలో కలిగి ఉండే భోజనాన్ని సమతులాహారం అంటారు

Leave a Comment