కడుపు ఉబ్బరం చాలామంది నిశ్శబ్దంగా అనుభవిస్తూ బాధపడే సమస్య. చెప్పుకోడానికి ఒకింత ఇబ్బంది పడే విషయం కూడా. మనం మింగుతుండే సమయంలో గాలి మన జీర్ణవ్యవస్థ పొడవునా ఎప్పుడూ పెరిస్టాలిటిక్ చలనం రూపంలో వెళ్తూనే ఉంటుంది. ఇది పైనే ఉంటే తేన్పు రూపంలో వెళ్తుంది. పైకి రాలేని విధంగా కాస్త కింద ఉంటే చిన్నపేగుల్లోంచి పెద్ద పేగుల్లోకి వెళ్లి మలద్వారం గుండా బయటకు పోతుంటుంది. కానీ చాలా మందిలో గాలి కడుపులో చిక్కుకుపోయి పొట్ట రాయిలాగా, కడుపు ఉబ్బరంగా పరిణమిస్తుంది. కడుపు ఉబ్బరం అనేది కడుపు నొప్పితో కూడి ఉంటుంది. ఈ సమస్యను పట్టించుకోకపోతే అది దీర్ఘకాలంలో మలబద్దకం, పొట్టనొప్పి, హైపర్ అసిడిటీలకు దారితీయవచ్చు.
కడుపు ఉబ్బరానికి కారణాలు ఏవి ?
డుపు ఉబ్బరంగా ఉండటానికి ప్రధాన కారణం మలబద్దకం, నిత్యం సరైన సమయానికి మలవిసర్జన అలవాటుచేసుకోవాలి. అలాగే కొన్ని రకాల ఆహారాలు తీసుకునేవారిలోనూ గ్యాస్ ఎక్కువగా ఉత్పన్నమవుతుంది. కొవ్వు పదార్థాలు తినటం కడుపు ఉబ్బరానికి దోహదం చే స్తుంది. జీర్ణాశయం నుంచి ఆహారం త్వరగా పేగుల్లోకి వెళ్లకుండా కొవ్వు అడ్డుకుంటుంది. దీంతో కడుపు నిండుగా అనిపిస్తుంది.
ఒత్తిడి, ఆందోళన, పొగతాగటం, జీర్ణకోశంలో ఇన్ ఫెక్షన్, ఇరి టేబుల్ బోవెల్ సిండ్రోమ్ కూడా కడుపు ఉబ్బరానికి కారణమౌతాయి. వాకింగ్, శారీరక శ్రమ కడుపు లోపల నిల్వ ఉన్న వాయువులను విడుదల చేయటానికి సహాయపడుతాయి. అలాగే కడుపు ఉబ్బరంగా అనిపించగానే ఎక్కువ మొత్తంలో నీరు తాగాలి. చల్లగా ఉండే ఆహారాలు, ఫ్రిజులో దాచిన పదార్థాలను తినకుండా చూసుకోవాలి.
కడుపు ఉబ్బరం ఉన్నప్పుడ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏవి ?
కడుపు ఉబ్బరం సమస్య నుంచి బయటపడెందుకు ముందుగా మనం తీసుకొనే ఆహారాన్ని నెమ్మదిగా నమిలి తినడం అలవాటు చేసుకోవాలి. ఆహారం తీసుకునే సమయంలో గాలి ఎక్కువగా నోట్లో పోకుండా చేయడం వల్ల చాలావరకు గ్యాస్ సమస్య అధిగమించవచ్చు. తినే సమయంలో మెల్లగా, నింపాదిగా తినాలి. పెదవులు మూసి తినడం మంచిది.
పొగతాగే అలవాటు ఉంటే తక్షణం మానేయాలి. కట్టుడు పళ్లు ఉన్నవారు డెంటిస్ట్ సహాయంతో అవి సరిగా అమరేలా చూసుకోవాలి. సోడాలు, కూల్‌డ్రింక్స్, బీర్ వంటి వాటికి దూరంగా ఉండాలి. జ్యూస్ రూపంలో కాకుండా పండ్లను కొరికి, నమిలి తినాలి. గ్యాస్ ఉండే ఆహారాలను పరిమితంగా తీసుకోవడం.
మనం ఏం తింటున్నామో గమనిస్తూ, వాటిలో దేనివల్ల కడుపు ఉబ్బరం సమస్య ఎక్కువవుతోందో గుర్తించి, ఆ ఆహారపదార్థాలకు దూరంగా ఉండటం వంటి జాగ్రత్తలతో చాలావరకు ఈ సమస్యను అధిగమించవచ్చు.