మనం తిన్నా తినకపోయినా నీళ్లు తాగడం సాధారణంగా జరిగిపోతుంది. నీరు మానవ మనుగడకు జీవనాధారం. దాహం అవుతున్న భావన మదిలో రాగానే మనం నీళ్లు తాగుతాం. అదే ఎప్పుడూ దాహంగా ఉంటే మాత్రం ఆనారోగ్యానికి నిదర్శనమంటున్నారు వైద్యనిపుణులు.
మానవ మనుగడకు నీరు అత్యవసరం. తాగునీటి కోసం కిలోమీటర్ల దూరం వెళ్లడం మనం చాలా గ్రామాల్లో చూస్తుంటాం. ఆహారం లేకుండా వారం రోజుల వరకైనా ఉండొచ్చు కానీ అదే నీరు లేకుండా ఒక్క రోజు కూడా ఉండలేం. శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా ఉండాలంటే ఎక్కువగా నీళ్లు తాగాలి. అయితే కొందరిలో ప్రతి ఐదు, పది నిమిషాలకు ఓసారి మళ్లీ మళ్లీ దాహం వేస్తుంది. ఎండలో వెళ్తున్నప్పుడో, వ్యాయామం చేసినప్పుడో, ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారం తిన్నప్పుడో ఎక్కువగా దాహం అనిపిస్తే దానిని అంతగా పట్టించుకోవద్దు. వాంతులు, విరేచనాలు అవుతున్నప్పుడు కూడా అతిగా దాహం వేస్తుంది. కానీ ఏ కారణం లేకుండా గొంతు తడిఆరిపోయినట్టు అనిపించడం, అదేపనిగా దాహం వేయడం అనారోగ్య సంకేతం అంటున్నారు పరిశోధకులు.
ప్రత్యేకమైన కారణమేదీ లేకుండానే అతిగా దాహం వేస్తోందీ అంటే దాని వెనుక ఏదో ఒక ఆరోగ్య సమస్య ఉండవచ్చుననేది వాస్తవం. డీహైడ్రేషన్‌తోపాటు మూత్రం పసుపురంగులో వస్తున్నా, గొంతు తడారిపోవడం, చర్మం తడారిపోవడం, అలసిపోయిన సందర్భాల్లో, తలనొప్పితో బాధపడుతున్నప్పడు దాహం వేస్తుంది. మధుమేహం వ్యాధికి గురైన వారిలో పాలిడిప్సియా సమస్య అంటే అతిగా దాహం వేయడం వేధిస్తుంటుంది. మధుమేహం ఉన్నవారు ఎక్కువగా మూత్రవిసర్జనకు వెళ్తుండటం వల్ల ప్రతి పది నిమిషాలకోసారి నీరు తాగాలని అనిపిస్తుంది. నోట్లో లాలాజలం తయారుకాకపోవడం వలన గొంతు తడారిపోయి ఎక్కువగా దాహం వేస్తుంది. కొన్ని రకాల మందులు, కొన్ని రకాల క్యాన్సర్ల కారణంగా, తంబాకు ఎక్కువ తినడం వల్ల నోట్లో లాలాజలం ఉత్పత్తికాదు.
గుండె, కిడ్నీలు, కాలేయం దెబ్బతినడం వంటి కారణాల వల్ల కూడా ఎక్కువగా దాహం వేస్తుందంటున్నారు వైద్యనిపుణులు. కొన్నిసార్లు, అధిక రక్తపోటు, గుండె జబ్బులు, అలర్జీలు, పిత్తాశయ పనితీరులో లోపాల వంటి సమస్యలు కూడా ఈ అతిదాహానికి కారణం కావచ్చని హెచ్చరిస్తున్నారు. అనీమియా సమస్యతో బాధపడేవారిలో కూడా అతి దాహం కనిపిస్తుంది. అతి దాహంతో పాటు ఎక్కువ సార్లు మూత్రం రావడం, నీరసం, కడుపునొప్పి, చూపు మసకగా అనిపించడం. తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా డాక్టర్‌ను సంప్రదించాలి.
ఎక్కువగా దాహం వేయడం కూడా సమస్యేనా అంటూ పట్టించుకోకుండా ఉండటం మంచిది కాదు. ఒక్కోసారి అది ప్రాణాపాయానికి దారితీసే సమస్యగా పరిణమించవచ్చునని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఈసారి అతిగా దాహం వేస్తే వెంటనే వైద్యుడ్ని సంప్రదించి తగు వైద్యం తీసుకోండి.








