Anemia: ఈ లక్షణాలు ఉన్నాయా? రక్తహీనత కావొచ్చు.. తస్మాత్ జాగ్రత్త!

By manavaradhi.com

Published on:

Follow Us
Iron deficiency anemia - Symptoms & causes

రక్తహీనత అనేది శరీరంలో రక్తం తక్కువగా ఉండటం ద్వారా వచ్చే వ్యాధి. మనం తీసుకొనే అసమతుల్ ఆహారం వల్ల ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ బీ లోపం వల్ల అనీమియా వస్తుంది. చిన్నపిల్లలు, గర్భిణీ స్త్రీలు, మలేరియా లాంటి తీవ్ర జ్వరాలు, వ్యాధులు కలిగిన వారిలో ఈ రక్త హీనత ఎక్కువగా కనిపిస్తుంది. ర‌క్తంలోని హిమోగ్లోబిన్ అనే ప‌దార్థం.. ఊపిరితిత్తుల్లో ఆక్సిజ‌న్‌ను తీసుకొని శ‌రీర భాగాల‌కు చేర‌వేసి స‌క్ర‌మంగా ప‌నిచేసేలా చేస్తుంది.

హిమోగ్లోబిన్ కార‌ణంగానే ర‌క్తం ఎరుపు రంగులో ఉంటుంది. శరీరంలో హీమోగ్లోబిన్ శాతం తగినంత లేకపోతే వారు రక్తహీనతతో బాధపడుతున్నట్లు లెక్క. హీమోగ్లోబిన్‌ శాతం పురుషుల్లో 12 కన్నా తక్కువ ఉన్నా, స్త్రీల‌లో 10 కన్నా తక్కువ ఉన్నా రక్తహీనత ఉన్నట్లుగా భావించాలి.

శ‌రీరంలో తగినంత ఐరన్ పాళ్లు లేకపోవడం, విటమిన్ డెఫిషియెన్సీ కూడా అనీమియాకు కారణం. అనీమియా కార‌ణంగా నాలుక, కనురెప్పల క్రింద భాగం తెల్లగా ఉండటం, గోళ్ళు తెల్లగా పాలిపోయినట్లు ఉండడం , శ‌రీరం బలహీనంగా త‌యార‌వ‌డం, నిరాశక్తత, సాధారణ పనులకే ఆయాసం రావడం వంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి. ర‌క్తహీనత ఉన్న వారిలో నీరసం, త్వరగా అలసిపోవడం, చిన్న పనిచేసినా అలసట రావడం, బలహీనంగా ఉండటం వంటివి ఉంటాయి.

హీమోగ్లోబిన్‌ శాతం ఇంకా తక్కువయితే ఆయాసం, దడ, కళ్లు తిరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. మెదడుకు రక్తసరఫరా తగ్గి ఇతర సమస్యలకు దారితీయవచ్చు. గుండెపై ప్రభావం పడవచ్చు. ఏకాగ్రత కోల్పోవడం, జ్ఞాపకశక్తి తగ్గడం వంటివి జరగవచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కడుపులో అల్సర్‌ సమస్య ఉన్నా రక్తహీనత రావచ్చు. ఈ సమస్యలే కాకుండా పోషకాహార లోపం కూడా కారణమవుతుంది. విటమిన్‌ బి12, ఫోలిక్‌యాసిడ్‌ లోపాల వల్ల కూడా రక్తహీనత ఏర్పడుతుంది.

రక్తహీనత సమస్య తగ్గాలంటే ఐరన్‌ ఎక్కువగా లభించే ఆహారం తీసుకోవాలి. ఆకుకూరలు, పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. గుడ్లు, పాలు, మాంసాహారం ఎక్కువగా తినాలి. అనీమియాతో బాధపడేవారు అధికపనులు చేయడానికి దూరంగా ఉండాలి. ఖర్జూరపండు ప్రతిరోజూ పరకడుపున తీసుకోవాలి. ఒత్తిడి శాతాన్ని సాధ్యమైనంతవరకు తగ్గించుకోవాలి. పండ్లను ఎక్కువగా తింటూ జ్యూస్‌లు తాగుతుండాలి. తాజా ఆకుకూరలు అంటే తోటకూర, గోంగూర, పాలకూర, మెంతి కూర లాంటివి రోజూ తీసుకోవడం వల్ల రక్తహీనత రాకుండా చూసుకోవచ్చు. అరటిపండ్లు, ద్రాక్ష, స్ట్రాబెర్రీ, కిస్‌మిస్, ఉల్లి, క్యారట్, ముల్లంగి, టొమాటోలు తీసుకోవాలి. యాపిల్‌, బీట్‌రూట్‌, న‌ల్ల నువ్వులు నిత్యం తీసుకోవ‌డం వ‌ల్ల అనీమియా స‌మ‌స్య నుంచి బ‌య‌ట‌ప‌డొచ్చు.

మ‌నం తీసుకొనే ఆహారం కారణంతోనే మ‌న‌కు ఆరోగ్య స‌మ‌స్యలు వ‌స్తాయి. మంచి ఆహారం తీసుకొంటే మ‌నం ఆరోగ్యంగా ఉంటాం. స‌మ‌తులాహారం తీసుకొంటే ర‌క్త‌హీనత వంటి స‌మ‌స్య‌ల నుంచి గ‌ట్టెక్క‌వ‌చ్చు. అందుక‌ని అన్నిర‌కాల కూర‌గాయ‌లు, పండ్ల‌ను నిత్యం తీసుకోవ‌డం ఒక్క‌టే మార్గం.

Leave a Comment