రక్తం..ఈ పదం ఏదో బంధాన్ని తెలియజేస్తుంది. అవును. రక్తం వ్యక్తుల మధ్య సంబంధమే కాకుండా శరీరంలోని అవయవాల మధ్య కూడా బంధాన్ని తెలుపుతుంది. శరీరంలోని అన్ని వ్యవస్థలు సక్రమంగా పనిచేయాలన్నా రక్తప్రసరణ వ్యవస్థ చాలా ముఖ్యం. మరి అలాంటి రక్తప్రసరణ వ్యవస్థ మెరుగవ్వాలంటే ఏంచేయాలి..? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మరింత సాఫీగా రక్తప్రసరణ జరుపవచ్చు..!
మన శరీరానికి ఆయువు రక్తం. వాహనాన్ని నడిపేందుకు ఇంధనం ఎంత ముఖ్యమో.. శరీరానికి రక్తం అంతే ముఖ్యం. శరీరంలోని అవయవాలు సక్రమంగా పని చేయాలంటే రక్త ప్రసరణ వ్యవస్థ పనితీరు బాగుండాలి. ఈ వ్యవస్థలో ఏమాత్రం తేడా వచ్చినా ఏదో ఒక సమస్యకు లోనయ్యే అవకాశాలు అధికంగా ఉంటాయి. శరీరంలో 60 వేల మైళ్ల పొడుగుండే రక్తనాళాల ద్వారా అవయవాలకు రక్తం ప్రసరించడం వల్ల జీవక్రియలు పనిచేయడానికి , అవయవాలకు అవసరమయ్యే ఆక్సిజన్‌తోపాటు పోషకాలు, విటమిన్స్ అందుతాయి. హార్మోన్ల ఉత్పత్తికి, శరీర ఉష్ణోగ్రతలు క్రమబద్దం చేయడానికి రక్తప్రసరణ ఎంతో అవసరం.
అవయవాలకు తగినంత రక్తం లభించనప్పుడు చేతులు, కాళ్ళు చల్లగా, మొద్దుబారినట్లు అనిపిస్తాయి. తేలికపాటి చర్మం గలవారైతే కాళ్లకు నీలిరంగు వస్తుంది. గోళ్లను పెళుసుగా మారుస్తుంది. అలాగే జుట్టు రాలిపోయేలా చేస్తుంది, డయాబెటిస్ ఉన్నవారిలో పుండ్లు, గాయాలు నెమ్మదిగా నయం అవుతుంటాయి. సిగరేట్ తాగేవారిలో ధమనుల గోడలకు హాని కలుగుతుంది. సిగరేట్‌లోని నికోటిన్ రక్తాన్ని చిక్కగా చేసి ప్రసరణ సక్రమంగా జరుగకుండా అడ్డుకుంటుంది. అందుకని రక్తప్రసరణ వ్యవస్థ సక్రమంగా జరుగాలంటే సిగరేట్ తాగడం వెంటనే మానేయాలి. రక్తపీడనం సరైన రీతిలో ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యం. అప్పుడప్పుడు బీపీ పరీక్షలు చేయించుకోవాలి. రోజులో ఎక్కువ మొత్తంలో నీరు తాగుతూ శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉండేట్లు చూసుకోవాలి. రక్తప్రసరణ తగినంత లేనపుడు రక్తనాళాల్లో మెలికలు ఏర్పడి వాపు వస్తుంది. ఫలితంగా వెరికోస్ వీన్స్ సమస్య గా మారుతుంది.
రక్తప్రసరణ సక్రమంగా జరిగేందుకు పోషకాహారాలు తీసుకోవడం చాలా ముఖ్యం. అలాగే ఎక్కువ సేపు కూర్చుని పనిచేసేవారు మధ్య మధ్య నిల్చుండి పనిచేసేలా ఏర్పాట్లు చేసుకోవాలి. దీనివల్ల శరీరంలోని అన్ని అవయవాలకు రక్తప్రసరణ ఒకేమాదిరిగా జరగుతుంది. శరీరంలోని అవయవాల్లో కదలికలు జరిగేలా చూసుకొంటే ప్రసరణ సక్రమం అవుతుంది. రోజులో కనీసం 30 నిమిషాలపాటు వ్యాయామం చేయడం అలవర్చుకోవాలి. రక్తంపై ప్రభావం చూపే కాఫీ, టీ, ఎనర్జీ డ్రింక్స్ వంటి ఎనర్జీ స్టిమ్యులేటర్స్‌ను వాడకుండా చూసుకోవాలి. ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా, ప్రాణాయామం వంటివి ప్రాక్టీస్ చేయాలి. కాళ్లను గట్టిగా అదిమిపట్టే సాక్సులను వాడకూడదు. చెప్పులు, బూట్లు బిగుతుగా లేకుండా చూసుకోవలి. చివరగా ఎక్కువ కాయగూరలు తింటూ మాంసం తక్కువగా తినేట్లుగా డైట్ ప్లాన్ చేసుకోవాలి.
శరీరంలో రక్తప్రసరణ సరిగా జరుగకపోవడం అనేది అన్ని వయస్సుల వారిలో ఉన్న సమస్య. సమయానికి గుర్తించి వెంటనే చికిత్సను అందివ్వకపోతే బ్రెయిన్, హార్ట్, లివర్, కిడ్నీలతోపాటు ఇతర అవయవాలు అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉన్నదని గుర్తుంచుకోవాలి.








