Bone cancer – వృద్ధాప్యానికి సవాలు విసిరే ఎముక క్యాన్సర్ కు కారణాలేంటి..?

By manavaradhi.com

Published on:

Follow Us
Bone cancer

ఈ మధ్యకాలంలో తన ప్రభావాన్ని, ప్రతాపాన్ని అధికంగా చూపిస్తున్న వాటిలో క్యాన్సర్ కూడా ఒకటి. మారుతున్న అలవాట్లు, ఆహారం… శరీరంలో ప్రతి భాగానికి క్యాన్సర్ ను దగ్గర చేస్తోంది. అన్నింటినీ దాటి… ఎముకలకు సైతం క్యాన్సర్ సోకుతోంది. నొప్పులతో మొదలై… ఇన్పెక్షన్ గా భ్రమింపజేసి… శరీరం మొత్తాన్ని కుంగదీసే బోన్ క్యాన్సర్ ను ముందుగానే ఎలా గుర్తించాలి.

ఎముక క్యాన్సర్… ఈ మధ్య కాలంలో ప్రపంచ వ్యాప్తంగా తన ప్రభావాన్ని చూపిస్తోంది. ఈ వ్యాధి కారణంగా ఏటా 150 నుంచి 200 మంది తమ అవయవాలను కోల్పోవలసి వస్తోంది. సాధారణంగా రక్తం దగ్గర్నుంచి… ఎన్నో క్యాన్సర్ లు చూస్తూ ఉంటాం. అయితే… చాలా తక్కువ మందికి వచ్చే క్యాన్సర్ ఇదే. సాధారణంగా ఏ క్యాన్సర్ అయినా… 20 సంవత్సరాల వయసు వారిలోనూ, 60 సంవత్సరాల వయసు పైబడిన వారిలోనూ ఎక్కువగా కనిపిస్తుంటాయి. దీనికి కారణం మొదటి 20 సంవత్సరాలు ఎదుగుతున్న వయసు కావడం వల్ల శరీరంలో కణవిభజన రేటు చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల కణాల్లో మార్పులు జరగడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. ఇక వయసు పైబడిన వారిలో కణవిభజనలు ఎంతో కాలంగా జరుగుతూ ఉంటాయి. ఫలితంగా కణాల్లో జన్యువుల్లో మార్పులు జరిగి అవి క్యాన్సర్ కణాలుగా మారవచ్చు.

సాధారణంగా రెండు రకాల క్యాన్సర్లు ఎముకకు సోకుతాయి. వీటిలో ఎముకలోనే పుట్టేవి ప్రైమరీ క్యాన్సర్స్ కాగా…. వేరే అవయవంలో పుట్టి ఎముకకు వ్యాపించేవి సెకండరీ క్యాన్సర్స్. సాధారణంగా ఎముక క్యాన్సర్లలో నొప్పితో గానీ, నొప్పి లేకుండా గానీ కణితులు గుర్తిస్తారు. మృదు కణజాలంలో క్యాన్సర్ సోకినప్పుడు కణితి నొప్పిగా ఉండకపోవచ్చు. గట్టిగా ఉండే ఎముక కణజాలంలో క్యాన్సర్ ఉంటే మాత్రం నొప్పి, వాపు ముందుగా కనిపిస్తాయి. ఎందుకంటే ఎముకలో సాగే గుణం ఉండదు. అందువల్ల కణజాలాల్లో కొద్ది పాటి మార్పులు జరిగాక కూడా, అది నొప్పిని, వాపును కలిగిస్తుంది. చాలా సందర్భాలలో ఎముకలో ఇన్ఫెక్షన్ మాదిరిగా కూడా భ్రమింపజేస్తుంది. ఒకసారి యాంటిబయాటిక్ మందులు వాడినప్పటికీ నొప్పి, వాపు తగ్గకపోతే తప్పనిసరిగా దాన్ని క్యాన్సర్‌గా అనుమానించాల్సి ఉంటుంది. ముఖ్యంగా నొప్పి రాత్రి సమయాల్లో ఎక్కువగా ఉంటుంది. ఎముక బలహీన పడి ఫ్రాక్చర్ కూడా అవుతుంది.

చాలా మంది నొప్పి రాగానే ఏదైనా దెబ్బ తగిలిందని అనుకుని అశ్రద్ధ చేస్తారు. ఎప్పుడైనా సరే ఎముకలో నొప్పి, వాపు ఉన్నపుడు వెంటనే డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది. సాధారణంగా 4 దశలు ఉండే క్యాన్సర్ లో మొదటి రెండు దశల్లో తెలుసుకున్న వారికి పూర్తిగా వ్యాధి నయం చేసే అవకాశం ఉంటుంది. చివరి రెండు స్టేజ్ లలో మాత్రం… క్యాన్సర్ ను తగ్గించలేకపోయినా, జీవనకాలాన్ని పెంచే చికిత్సలు మాత్రం అందుబాటులో ఉన్నాయి. ఎముక క్యాన్సర్ కు కూడా ఇది పూర్తిగా వర్తిస్తుంది.

ట్యూమర్ ఏదైనా సరే ఎలాంటి ట్యూమర్, ఏ స్టేజ్‌లో ఉంది అనే దాన్ని బట్టి దాని చికిత్స ఆధారపడి ఉంటుంది. ఇది తెలుసుకోవడానికి కొన్ని ప్రత్యేకమైన పరీక్షలు చెయ్యాల్సి ఉంటుంది. అది క్యాన్సర్ ట్యూమరా లేక మామూలు ట్యూమరా అనేది నిర్ధారించడానికి ఇదివరకు ఓపెన్ బయాప్సీ ద్వారా ముక్క తీసుకునే వారు. కానీ ఇప్పుడు ఆధునిక శాస్త్రపరిజ్ఞానంతో నీడిల్ బయాప్సీ అందుబాటులోకి వచ్చింది. ఇది చాలా సులభమైన, కచ్చితమైన పరీక్ష. ఒకసారి క్యాన్సర్ నిర్ధారణ జరిగి, ఏ దశలోనిదో తెలుసుకోగలిగితే చికిత్స చేయడానికి మార్గం సుగమమవుతుంది.

ఎముక మీద ఏర్పడే కణుతులు అన్నీ క్యాన్సర్‌వే కానక్కర లేదు. కొన్ని హానికరం కానివి కూడా ఉంటాయి. వీటిని బినైన్‌ ట్యూమర్లు అంటారు. ఇవి ఏర్పడిన చోట మాత్రమే ఉంటాయి. ఇతర భాగాలకు వ్యాపించవు. అందుకే బినైన్‌ కణుతుల వల్ల ప్రమాదం ఉండదు. మాలిగ్నెంట్‌ ట్యూమర్లు మాత్రం ప్రమాదకరమైనవి. వీటినే క్యాన్సర్‌ కణుతులు అంటాం. ఈ కణుతులు అవి పుట్టిన భాగాన్ని దెబ్బతీయడమే కాకుండా శరీరంలోని ఇతర భాగాలకు కూడా వ్యాపించి అక్కడి కణాలకు కూడా హాని చేస్తాయి. త్వరగా వ్యాప్తి చెందే కణాలతో ఏర్పడిన ట్యూమర్లు ఎముకలోని ఇతర ఆరోగ్య కణాలను ఆక్రమిస్తాయి. అందువల్ల ఎముక బలహీన పడి విరిగి పోవడానికి కారణమవుతాయి. చాలా త్వరగా పెరిగే ఈ ట్యూమర్ల వల్ల ముఖ్యంగా లక్షణాలు కనిపించనపుడు లేదా కనిపించిన చిన్న లక్షణాలు కూడా అశ్రద్ధ చేసినపుడు అంగవైకల్యం ఏర్పడవచ్చు, అప్పుడప్పుడు మరణం కూడా సంభవించవచ్చు.

క్యాన్సర్ ట్యూమర్ చుట్టూ కొంత భాగం వరకు వాపు ఉంటుంది. ఇది వ్యాపించకుండా చూడడం కోసం మన శరీరంలోని రక్షణ వ్యవస్థ దాని చుట్టు ఒక చిన్న పొరను ఏర్పరుస్తుంది. దీనికి బయట కొంత భాగం వరకు ఉన్న భాగాన్ని రియాక్టివ్ జోన్ అంటారు. క్యాన్సర్ మొదటి స్థాయిలో ఉన్నవారికి ఈ రియాక్టివ్ జోన్ వరకు ఉన్న కణాలను తొలగిస్తారు కాబట్టి దుష్ప్రభావాలు, మళ్లీ వచ్చే అవకాశాలు తక్కువ. కొన్ని సార్లు ఎముకను పూర్తిగా తొలగించి ప్రొస్థెసిస్ అంటే కృత్రిమ ఎముక లేదా రాడ్‌ను అమర్చాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాలలో ఎముకను పూర్తిగా శుభ్రం చేసి అక్కడిక్కడే ఎముకకు రేడియేషన్ అందించి తిరిగి దాన్ని అమరుస్తారు.

Leave a Comment