మధుమేహం… చాపకింద నీరులా వ్యాపించే సైలెంట్ కిల్లర్. ఒకసారి ఈ వ్యాధిబారినపడ్డామంటే జీవితాంతం మందులు వాడాల్సిందే. అంతేకాదు దీని ప్రభావం మెదడుపై కూడా ఉంటుంది. పక్షవాతం కూడా రావచ్చు. మతిమరపుతో పాటు ఇతర సమస్యలు కూడా రావచ్చు.
డయాబెటిస్ ప్రభావం వల్ల శరీరంలోని అవయవాలన్నీ క్రమంగా దెబ్బతింటాయి. కిడ్నీలు కూడా దెబ్బతింటాయి. టైప్ 2 డయాబెటిస్ తో బాధపడుతున్న వ్యక్తుల్లో ఆలోచనా శక్తి మరియు జ్ఞాపకశక్తితో మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని తాజా పరిశోధన తెలిపింది. జ్ఞాపకశక్తి మరియు ఆలోచనా సమస్యలను ఎదుర్కొన్న వారిలో మెదడు వాల్యూమ్ తగ్గినట్లు తెలిపింది. మధుమేహం ఉన్న వ్యక్తిలో డిమెన్షియా ప్రమాదం రెట్టింపు అవుతుందని గత పరిశోధన కనుగొందని పరిశోధకులు చెప్పారు.
మధుమేహం వల్ల మెదడుపై ప్రభావం కారణంగా ప్రధానంగా పక్షవాతం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. దీనికి కారణం ఏమిటంటే రక్తంలో చక్కెర కలిసినా రక్తప్రవాహము చిక్కబడి మామూలు కంటే ఎక్కువ ఒత్తిడితో వెళ్లాల్సి వస్తుంది. రక్తం మెదడుకు వెళ్లే రక్తనాళాల్లో చిక్కబడితే అది బ్రెయిన్‌స్ట్రోక్ కి దారితీస్తుంది. డయాబెటిస్ లేకపోతే పక్షవాతం వచ్చే రిస్క్ 21 శాతం తక్కువగా ఉంటుంది. డయాబెటిస్ వల్ల కేవలం మెదడు మాత్రమే కాదు గుండె, మూత్రపిండాలు కూడా దెబ్బతినవచ్చు.
డయాబెటిస్ వల్ల మెదడు పనితీరు మందగించినా కారణంగా మతిమరుపు, అయోమయం, మనసును ఒకే విషయంపై లగ్నం చేయలేకపోవడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. కొందరు ఉదయాన్నే ఆఫీసుకు వెళ్లే తొందరలో బ్రేక్ ఫాస్ట్ మానేస్తారు. ఇలా రోజూ చేస్తే మాత్రం శరీర మెటబాలిజమ్ దెబ్బతిని మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అలాగే ధూమపానం, మద్యపానం వంటి చెడు అలవాట్ల వల్ల శరీరంలో రక్తనాళాలు దెబ్బతినడం, హానికర రసాయనాలు చేరడంతో మెదడు పనితీరు దెబ్బతింటుంది. అందువల్ల వీటికి దూరంగా ఉండడం ఎంతో మంచిది. బరువు తగ్గాలనుకునే వారు చాలా తక్కువగా ఆహారాన్ని తీసుకోవడం వల్ల మెదడులో కీలకమైన ఫ్రంటల్ కార్టెక్స్ భాగం పనితీరు మందగించే ప్రమాదం ఉంటుందని నిఫుణులు చెబుతున్నారు. పరిమితికి మించి ఆహారం తీసుకుంటే శరీరంలో గ్లూకోజ్ స్థాయిలు పెరిగి, మెదడుతోపాటు శరీరంలోని అన్ని అవయవాలపైనా ప్రతికూల ప్రభావం పడుతుంది. అందువల్ల ఒకేసారి ఎక్కువ ఆహారాన్ని తీసుకోకుండా ఎక్కువసార్లు కొద్దికొద్దిగా ఆహారం తీసుకోవాలి.
ఎక్కువ తీపి తినడం కూడా ఆరోగ్యానికి అనర్థదాయకమే. రక్తంలోని షుగర్ లెవల్స్‌లో హెచ్చు, తగ్గులు రావడానికి ఇదే కారణమవుతుంది. ప్రధానంగా ఇమ్యూన్ సిస్టమ్‌పై ప్రభావం చూపుతుంది. రోగకారక వైరస్‌లు, బ్యాక్టీరియాలో పోరాడడంలో వ్యాధినిరోధక వ్యవస్థ విఫలమయ్యేందుకు కారణమవుతుంది. మెల్లగా ఇది మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అందువల్ల చక్కెర పదార్థాలు ఎక్కువ తినకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా శరీరానికి సరిపడు నిద్రలేకపోతే మెదడు సరిగ్గా పనిచేయదు. అర్ధరాత్రి వరకు మెళకువ ఉండడం మెదడు వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అందువల్ల సుఖ నిద్రను అలవాటు చేసుకోండీ.
మధుమేహం వల్ల మెదడు పనితీరు దెబ్బతినకుండా ఉండాలంటే తగు జాగ్రత్తలు తీసుకోవాలి. చాలామంది టీవీ చూస్తూనో, కంప్యూటర్‌లో, సెల్‌ఫోన్లలో సినిమాలు చూస్తూ భోజనం చేస్తుంటారు. అలా చేయడం మెదడుకు శ్రేయస్కరం కాదంటున్నారు నిపుణులు. తరచూ తలనొప్పి వస్తుంటే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే న్యూరాలజిస్టును సంప్రదించడం అవసరం. రోజూ 30 నిమిషాల పాటు శారీరక శ్రమ, వ్యాయామం చేసినవారికి మెదడు చురుగ్గా ఉంటుంది. శారీరకశ్రమ వల్ల గుండె, ఊపిరితిత్తులు బాగా పనిచేసి.. శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది.
శారీరకంగా ఫిట్‌గా ఉంటే మానసిక ఆరోగ్యమూ చేకూరుతుంది. శరీరంలో డిప్రెషన్, యాంగ్జయిటీ వంటి వాటికి కారణమయ్యే హార్మోన్ల ఉత్పత్తి తగ్గి మెదడుపై ఒత్తిడి తగ్గుతుంది. మెదడు చురుగ్గా పనిచేయడానికి చేపమాంసం తోడ్పడుతుంది. వీటిలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఇవి మెదడు అభివృద్ధికి తోడ్పడతాయి. మెదడు పనితీరును మెరుగుపర్చుకోవాలంటే మెదడుకు పదునుపెట్టే సుడోకు లాంటి కొత్త కొత్త పజిళ్లను పూరిస్తూ ఉండాలి. ముఖ్యంగా 50 ఏళ్ల వయసుకు వచ్చినవారు ఇలా చేయడం వల్ల వారిలో అల్జీమర్స్ వంటివి వచ్చే అవకాశం బాగా తగ్గుతుంది.
స్థూలకాయం ఉన్నవారు డయాబెటిస్ వచ్చే రిస్క్‌ను తగ్గించుకునేందుకు బరువును అదుపులో పెట్టుకోవడం, వాకింగ్ చేయడం లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. పుష్టికరమైన ఆహారం తీసుకోవాలి. రోజూ కనీసం 45 నిమిషాల చొప్పున వారానికి ఐదు రోజులు వాకింగ్ చేయాలి. అప్పుడే డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది.