జీర్ణ వ్యవస్థకు సంబంధించిన ఇబ్బందులను మనందరం ఏదో ఓ సందర్భంలో ఎదుర్కొంటూ ఉంటాం. మారుతున్న వాతావరణ పరిస్థితులు, జీవన విధానాలు కారణంగా జీర్ణక్రియ సమస్య తలెత్తుతోంది. ఒక సందర్భంలో ఆకలి మందగిస్తుంది. మరోసారి అజీర్తి చేస్తుంది. ఇంకోసారి తిన్న వెంటనే పొట్టలో మంట మొదలవుతుంది. జీర్ణ వ్యవస్థకు సంబంధించిన ఈ సమస్యలు ఎందుకొస్తాయి? వాటికి పరిష్కారాలేంటి?
మన జీర్ణవ్యవస్థలో ఆహారాన్ని జీర్ణం చేయడానికి ఆహారనాళం, జీర్ణగ్రంథులు ముఖ్యమైనవి. మనం తీసుకొనే కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, లిపిడ్ల వంటి క్లిష్ట ఆహారాలు జీర్ణక్రియ ఎంజైముల వల్ల శక్తిని విడుదల చేయగలిగే గ్లూకోజ్, అమైనో ఆమ్లాలు, కొవ్వు పదార్థాల మాదిరి సరళరూపంలో మార్చడంలో జీర్ణక్రియ ఎంతగానో తోడ్పడుతుంది. శరీరంలో జీర్ణక్రియ యొక్క ఆరోగ్య స్థితిగతులు మనం తీసుకొనే ఆహారం మీద ఆధారపడి ఉంటాయి.
మారుతున్న జీవన శైలి పాస్ట్ పుడ్స్ కారణంగా జీర్ణ సంబంధిత సమస్యలు చాలా సాధారణమైపోయాయి. జీర్ణవ్యవస్థ సరిగా పనిచేయనప్పుడు అనేకరకాలైన వ్యాధులను ఎదుర్కోవల్సి వస్తుంది . అందువల్ల జీర్ణవ్యవస్థకు హాని కలిగించే ఆహారాలు తీసుకోవడం చాలా తక్కువ చేయాలి.
ఆహారాలు సాఫీగా జీర్ణం కావడమనేది మనం తీసుకొనే ఆహారాలపై ఆధారపడి ఉంటుంది. ఆహారం సరిగా జీర్ణం కాకపోవడం వలన చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మనం తీసుకొనే ఆహారం త్వరగా జీర్ణమవ్వాలంటే ముఖ్యంగా ఆకుకూరలు, కూరగాయలపై దృష్టిసారించాలి. మొక్కల ఆహారాల్లో ఫైబర్ ఉండి శరీరం క్రమంగా ఉండటానికి, బరువు సక్రమంగా ఉండేందుకు సహాయపడుతుంది. కూరగాయలు, పండ్లు, గింజధాన్యాలు, తృణధాన్యాలు, బీన్స్, కాయధాన్యాలు తీసుకోవడం అలవర్చుకోవాలి.
నెమ్మదిగా పెంచుకొంటూ పోతూ ఎక్కువగా నీరు తీసుకొంటూ ఉండాలి. ఫలితంగా తేన్పులు, గ్యాస్ రాకుండా సహాయపడుతుంది. అలాగే పండ్లరసాలు, సూప్‌లు తీసుకోవడం ద్వారా జీర్ణక్రియ సాఫీగాసాగుతుంది. జీర్ణవ్యవస్థపై ఒకేసారి భారం వేయకుండా తక్కువ మొత్తంలో ఎక్కువసార్లు ఆహారం తీసుకోవాలి. అలాగే తినే ఆహారం మెల్లగా తీసుకొంటూ ఎక్కువ సేపు నమిలి ఆహారం ముద్దలా తయారయ్యేలా చూసుకోవాలి.
మన జీర్ణవ్యవస్థ చక్కగా పనిచేయాలంటే… ఉదయాన్నే వ్యాయామం చేయడం అలవర్చుకోవాలి. ఇది జీర్ణక్రియతోపాటు గుండెఆరోగ్యానికి కూడా దోహదం చేస్తుంది. ఆహారం తీసుకోవడానికి ముందు, తిన్నగంట తర్వాత వ్యాయామం చేయాలి. పెరుగు, పులియబెట్టిన ఆహారాలను తీసుకోవడం వల్ల మంచి చేసే బ్యాక్టీరియా అంది జీర్ణప్రక్రియ సాఫీగా జరిగేలా చూస్తుంది. ఆహారం సాఫీగా జీర్ణం కావాలంటే ముఖ్యంగా తక్కువ కొవ్వులున్న ఆహారాలు తీసుకోవడం చాలా ముఖ్యం. లేనట్టయితే ఉబ్బరంగా అనిపించడం, గుండెల్లో మంటలు రేగడం వంటివి ఎదుర్కోవాల్సి వస్తుంది. సిగరెట్ తాగే అలవాటు ఉన్నవారిలో కూడా జీర్ణక్రియ సాఫీగా సాగదు. కాబట్టి ధూమపానానికి దూరంగా ఉండాలి.
జీర్ణ వ్యవస్థ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అత్యవసరం. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే, జీర్ణ వ్యవస్థ ఆరోగ్యకరంగా ఉంటుంది.ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడంతోపాటు, మీ ప్రేగులలో నివసించే ఆరోగ్యకరమైన బాక్టీరియా ఉత్పత్తిని ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవడం కూడా చాలా ముఖ్యము. కాబట్టి తీసుకోనే ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం మర్చిపోకండి.