Dry Mouth – డ్రై మౌత్ సమస్య ఎలాంటి అనారోగ్యాలకు దారితీస్తుంది…?

By manavaradhi.com

Published on:

Follow Us
Dry Mouth

ఆహారం లేకుండా మనిషి బ్రతకగలడు గానీ… నీరు లేకుండా జీవించడం దాదాపు అసాధ్యం. రక్తం, మెదడు మొదలుకుని… నీరు లేకుండా మనిషి జీవితం ముందుకు సాగలేదు. ఒంట్లో నీరు ఆవిరైపోతూ ఉంటే… తద్వారా శరీరం క్రమంగా డ్రై అయిపోతూ ఉంటుంది. ఇందులో భాగంగా నోట్లో కూడా తడి తగ్గిపోతుంది. ఫలితంగా డ్రైమౌత్ సమస్య ఏర్పడుతుంది. దీన్నే నోరు పొడిబారడం లేదా క్సీరో స్టోమియా అంటారు. దీని వల్ల నోటిలో లాలాజలం సరైన స్థాయిలో అందదు. ముఖ్యంగా వృద్ధులు, గర్బిణీ స్త్రీలు, మోనోపాజ్ దశలో ఉన్న స్త్రీలలోనూ, పలు మందులు వాడే వారికీ, ఈ సమస్య ఎదురయ్యే ప్రమాదం ఉంది.

నోరు ఎండిపోయినప్పుడు ఎంతో అసౌకర్యంగా చికాకు కలిగిస్తూ ఉంటుంది. ఈ రకంగా ఎండిపోయిన నోరు బాక్టీరియాకు కూడా నివాస స్థానం అవుతుంది. ఫలితంగా రకరకాల సూక్ష్మ క్రిములు నోటిలోకి చేరుతూ ఉంటాయి. ఇంత బ్యాక్టీరియా చేరాక నోటిలో దుర్వాసన కూడా మొదలౌతుంది.

సాధారణంగా మన నోరు ఎల్లప్పుడూ తడిగా ఉండాలి. అందుకు గాను ప్రతి వారూ తగినంత నీటిని తాగాల్సి ఉంటుంది. మీ శరీరంలో తగినంత నీరు ఉందా… లేదా అనే విషయం తెలుసుకోవడానికి నోటిలో తగినంత ఉమ్మి ఎల్లప్పుడూ ఉందా, లేదా అనేది చూసుకోవాలి. శరీరంలో నిరంతరంగా కొనసాగే జీవక్రియ లేదా మెటబాలిజం కొరకు నీటిని కోరుతుంది. తగినంత నీరు శరీరంలో లేనప్పుడు నోటిలో ఊట ఊరదు. జీర్ణక్రియ సాఫీగా సాగదు. దీనివల్ల మలబద్ధకం ఏర్పడుతుంది. నోరంతా ఎండిపోయి అలసట కలుగుతుంది. సాధారణంగా నోటిలో ఊరే లాలాజలం రకరకాల క్రిములను సంహరిస్తుంది. తినే ఆహారంలో సైతం ఉండే హాని కలిగించే క్రిములను అవి సంహరించగలవు. లాలాజలంలోని ఎంజైములు, మేలు చేసే బాక్టీరియా వంటివి తిన్న ఆహారాన్ని మొదటి దశలో జీర్ణం చేస్తాయి. మానవుడు తినే ఆహార జీర్ణక్రియలో మొదటి దశ నోటిలోని లాలాజలంతోనే జరుగుతుంది. చిగుళ్ళ మీద ఉండే యాసిడ్లను కడిగేసి… దంతాలను పరిశుభ్రంగానూ ఇది ఉంచుతుంది. నోరు ఎండిపోవడం వల్ల యాసిడ్ల ప్రభావం పెరిగిపోయి సమస్యలు మరింత పెరుగుతాయి.

డయాబెటిస్, బి.పి. ఉన్న రోగుల్లో నోరు ఎండిపోతూ ఉంటుంది. ఒక సారి ఇది మొదలైందంటే ఒక్క సారి డయాబెటిస్ లాంటి వ్యాధులు ఏమన్నా సోకాయేమో ఒకసారి పరీక్ష చేయించుకుంటే మేలు. రక్తంలో గ్లూకోజ్ స్థాయి ఎక్కువగా ఉండడం వల్ల నోటిలో తడి ఆరిపోవడం, నోటి మూలల్లో మంటగా ఉండడం, చిగుళ్ళు మంట పెట్టుట లాంటి సమస్యలు ఎదురౌతూ ఉంటాయి. డయాబెటిస్ ఉన్న వారిలో వచ్చే ఇలాంటి నోరు ఆరిపోవడం లాంటి సమస్యను జీరోస్టోమియా అంటారు. ఇలా నోటిలో తగినంత లాలాజలం లేనప్పుడు బ్యాక్టీరియా అంతా ఒకే చోట గూడు కట్టినట్లుగా పెరుగుతుంది. దీన్ని కాలోనైజేషన్ అంటారు. ఇలా జరగడం వల్లనే చాలా మంది షుగర్ వ్యాధిగ్రస్తుల నోళ్ళలో దుర్వాస వస్తుంది. ఈ నోరు పొడిబారటం దీర్ఘకాలం పాటు కొనసాగితే… అది నోటిలోని మృదుకణజాలం దెబ్బ తినేలా చేస్తుంది. దాని వల్ల దంతక్షయం, పంటినొప్పి లాంటి సమస్యలు మొదలౌతాయి. ఈ సమస్య కాస్త వయసు పైబడిన వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. పురుషులతో పోలిస్తే మహిళల్లో ఇది మరికాస్త ఎక్కువగా కనిపిస్తుంది. దీని వల్ల మాట్లాడ్డంలో ఇబ్బంది, మింగలేకపోవడం, గొంతు బొంగురు పోవడం, నోటిలో మంట, ముక్కు పొడిబారటం లాంటి ఇతర సమస్యలు కూడా రావొచ్చు.

టెన్షన్ లో ఉన్నప్పుడు, ప్రయాణాల్లో ఉన్నప్పుడు, శరీరంలో నీరు తక్కువగా ఉన్నప్పుడు నోరు పొడిబారడం అన్న సమస్య ఎదురు కావడం సర్వ సాధారణం. అయితే దీర్ఘకాలం పాటు ఇలా నోరు పొడిబారిపోయినట్లుగా ఉంటే మాత్రం తప్పనిసరిగా దంతవైద్యులను సంప్రదించాలి. ముఖ్యంగా షుగర్ వ్యాధిగ్రస్తుల విషయంలో ఈ జాగ్రత్త మరింత అవసరం. ఇలా పొడిబారిపోతున్న సమస్యకు పుక్కిలించే ద్రవాలు, ఫ్లోరైడ్ ఉండే పూత మందులను సైతం డాక్టర్ల సలహా మేరకు వాడుతూ ఉండాలి. ఇక సాధారణ పరిస్థితుల్లో ఇలాంటి సమస్యలు ఎదురైనప్పుడు చక్కెర లేని గమ్స్, చక్కెర రహిత మింట్ లాంటి వాటిని నములుతూ ఉండడం వల్ల నోటిలో తగినంత లాలాజలం ఊరుతుంటుంది. ఎప్పటికప్పుడు ఒక చిన్న గుట వేస్తూ మంచినీళ్ళు తాగడం కూడా మేలు చేస్తుంది. ఫ్రిజ్ లోని ఐస్ ముక్కలు తీసుకుని చప్పరించడం వల్ల కూడా మంచి ప్రయోజనం ఉంటుంది. నోరు పొడిబారిపోయే వారు కాఫీ, కూల్ డ్రింక్స్ వంటి కెఫిన్ ఉండే పదార్థాలకు దూరంగా ఉండాలి. ఆల్కహాల్ లాంటివి పూర్తిగా మానేయాలి. ఇలా చేస్తుండడం వల్ల నోరు పొడి బారే సమస్య నుంచి విముక్తి పొందవచ్చు.

Leave a Comment