వర్షాలు పడుతున్నాయి. చెరువులు, రిజర్వాయర్లు నీటితో కళకళలాడుతున్నాయి. ఈ కాలంలో నీటితోపాటు మనల్ని అలరించేవి మరొకటి కూడా ఉన్నాయి. అవే చేపలు… వర్షాకాలం చల్లటి వాతావరణంలో వేడివేడి చేపల పులుసుగానీ, చేపల ఫ్రైగానీ అన్నంలో కలుపుకొని తింటే నా సామిరంగా.. అనుకోవాల్సిందే. చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
ఆరోగ్యకరమైన ప్రయోజనాలను కలుగజేసే పరిపుష్టికరమైన ఆహార పదార్థాలలో చేపలు ఒకటి. చేపలు ప్రోటీన్, విటమిన్-డి, కాల్షియం, ఫాస్పరస్ వంటి అవసరమైన పోషకాలతో పూర్తిగా నిండి ఉండడంతో పాటు ఐరన్, జింక్, అయోడిన్, మెగ్నీషియం, పొటాషియం వంటి ముఖ్యమైన ఖనిజాలు కూడా ఉంటాయి. సంవత్సరానికి సగటున 17 కేజీలు చేపలను తినాల్సి ఉండగా కేవలం 6 కేజీల చేపలను మాత్రమే తింటున్నాం. అంటే మనకు వీటిని తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి సరైన అవగాహన లేకపోవడమే అంటున్నారు పోషకాహార నిపుణులు. ఒమేగా -3 ఫ్యాటీ ఆసిడ్స్ వంటి ముఖ్యమైన పోషక పదార్ధాలను కలిగి ఉన్న వాటిలో చేపలు చాలా ముఖ్‌మైనవి.
చేపలు ఉత్తమ పోషకాల్ని అందిస్తాయి. గుండెజబ్బుతో బాధపడుతున్నవారు చేపల్ని తినడం చాలా మంచిది. వీటిల్లో 18-20 శాతం మాంసకృత్తులు ఉండి తేలిగ్గా అరుగుతాయి. వీటి మాంసకృత్తుల్లో మనకు అవసరమైన 8 రకాల అమైనో యాసిడ్లు లభిస్తాయి. ముఖ్యంగా గంధకం కలిగిన లైసీన్, మిథియోనిన్, సిస్టీన్ అమైనోయాసిడ్లు లభిస్తాయి. చేపల్లోని ఒమేగా 3 ఆమ్లాల కారణంగా పిండంలో మెదడు పెరుగుదలకు ఈ కొవ్వు దోహదపడుతుంది. అలాగే నెలలు నిండకుండానే ప్రసవించే ప్రమాదం తగ్గుతుంది. చేపల్లో లభించే విటమిన్ ఏ.. కంటిచూపుకు దోహపడుతుంది. చేపల కాలేయంలో ఉండే విటమిన్ డీ.. ఎముకల పెరుగుదలకు కీలకం. రక్తవృద్ధికి కావాల్సిన హీమోగ్లోబిన్ చేపల్లో విరివిగా లభిస్తుంది.

చేపలు తినడం వల్ల వృద్ధాప్యంలో ఎదుర్కొనే అల్జీమర్స్ వ్యాధి నుంచి బయటపడొచ్చు. చేపలను ఎక్కువగా తినేవారిలో జ్ఞాపకశక్తి పెరుగడమేకాకుండా మెదడు బాగా పనిచేస్తుందని పలు పరిశోధనలు తేల్చాయి. చేపలను తరచూ తినడం వల్ల వాటిల్లో వాటిల్లో ఉండే డోపమైన్, సెరొటోనిన్ అనే హార్మోన్లు నిత్యం ఎదురయ్యే ఒత్తిడి, మానసిక ఆందోళనల నుంచి మనల్ని బయటపడేస్తాయని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. చేపల్లోని ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు కీళ్ల నొప్పులను తగ్గిస్తాయి. అలాగే పెద్దపేగు, నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్, పాంక్రియాటిక్ క్యాన్సర్లు రాకుండా కాపాడుతాయి. స్త్రీలలో రుతుక్రమం సరిగ్గా ఉండాలన్నా.. ఆ సమయంలో ఇతర అరోగ్య సమస్యలు రాకుండా ఉండాలన్నా.. తరచూ చేపలను తినాలని వైద్యులు సూచిస్తున్నారు.
మనకు దొరికే ఆహార పదార్థాలలో చేప ఎంతో ముఖ్యమైనది. వీటిలో లభించే అనేక రకాల పోషకాలు మనల్ని ఆరోగ్య సమస్యల నుంచి దూరంచేస్తాయి. అందుకని వారంలో ఒకరోజైనా చేపలుతినేలా మెనూ తయారుచేసుకోవడం చాలా ఉత్తమం.