Growth in children – పిల్లల్లో ఎదుగుదల లేదా..!

By manavaradhi.com

Published on:

Follow Us
Growth in children

సృష్టిలోని అన్ని సంపదలకన్నా ఆరోగ్యంగా జీవించడమే అసలైన సంపద. ఆర్ధికంగా ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా… ఆరోగ్యం ఉన్నతంగా లేనప్పుడు ఆ సంపద ఉన్నా లేనట్లే. ఉన్నవారికీ, లేనివారికీ కావలసిన ఏకైక సంపద ఆరోగ్యం మాత్రమే. యాంత్రిక జీవితానికి అలవాటు పడిపోయి… రోగాలు ముదిరితే గానీ వైద్యుడ్ని కలవాలన్న విషయం బోధపడదు. అంతటి ఉరుకుల పరుగుల జీవితంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడం ఎంతో అవసరం.

పిల్లల ఎదుగుదలలో మార్పులను చూసి తల్లిదండ్రులు చాలా బెంగపెట్టుకుంటుంటారు. వారి ఎత్తులో మార్పులు రావడంలేదని తెగ బాధపడుతుంటారు. పిల్లల్లో పెరుగుదలను గుర్తించడం కొంచెం కష్టమే. అయితే సాధారణ ఎత్తు కంటే తక్కువగా ఉన్న ట్లయితే ఎదుగుదల లేదని గుర్తించవచ్చు. ముఖ్యంగా పుట్టిన సమయంలో 50 సెంటీ మీటర్ల వరకు పొడవుండే పిల్లలు… 18 ఏళ్ల వయస్సు వచ్చే వరకు పెరుగుతుంటారు. నాలుగేళ్ల వయస్సు వరకు పిల్లల్లో కొంత తేడా తప్ప… ఎదుగుదలను అంచనా వేయలేం. అయితే ఆ తరువాత ప్రతి సంవత్సరం కనీసం 4 సెంటీమీటర్లు పెరుగుతుంటారు. లేదంటే లోపం ఉన్నట్లు గుర్తించాలి.

భారత్‌లో 38.7 శాతం పిల్లలు పోషకాహార లోపం వల్ల సరిగా ఎదగలేకపోతున్నారని ప్రపంచ పోషకాహార నివేదికలో వెల్లడైంది. ఆహారం.. పిల్లల ఎదుగుదలకు పునాది. అవును శారీరక ఎదుగదల కూడా పిల్లలో ప్రమాణాల మేరకు ఉంటుంది. పాలపై ఆధారపడిన వయసు దాటిన తరువాత పిల్లలకు ఇవ్వాల్సిన ఆహారం విషయంలో తల్లిదండ్రులు కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. సమతుల ఆహారం ఇవ్వడం వల్ల పిల్లలు ఆరోగ్యంగా ఎదగడమే కాకుండా దేహధారుఢ్యం, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అప్పడే పుట్టిన పిల్లలు 50 సెంటీ మీటర్లు, సంవత్సరం వయసొచ్చేసరికి 75 సెంటీ మీటర్ల పొడవు పెరుగుతారు. రెండేళ్ళకు 85, మూడేళ్ళకు 93, నాలుగేళ్ళు పూర్తయ్యేసరికి వంద సెంటీ మీటర్ల ఎత్తు పెరుగుతారు. ఇక నాలుగేళ్ల నుంచి పిల్లలు ఐదు నుంచి ఆరు సెంటీ మీటర్ల పొడవు పెరుగుతుంటారు. ఇలా 18 సంవత్సరాలదాకా పెరుగుతూనే ఉంటారు. నాలుగు సెంటీ మీటర్ల కన్నా తక్కువ పెరుగుదల ఉంటే పసిగట్టి వెంటనే వైద్యుడ్ని సంప్రదించాలి.

పిల్లల్లో ఎదుగుదల నిలిచిపోవవడానికి అనేక కారణాలున్నాయి. ముఖ్యంగా తల్లి కడుపులో ఉన్నపుడు హర్మోన్ల లోపం, పౌష్ట్టికాహార లోపం వంటి సమస్యలతో… గర్భంలోనే పెరుగుదల లోపం ఏర్పడవచ్చు. కనీసం రెండున్నర కిలోల కన్నా తక్కువ బరువుతో పుడితే పెరుగుదల లోపం ఉన్నట్లు గుర్తించవచ్చు. పుట్టిన తరువాత కూడా హార్మోన్ల లోపం, జెనిటిక్స్‌ లోపం, క్రోమోజోమ్‌ల లోపం, పోషకాహార లోపం వంటి సమస్యలతో పెరుగుదల నిలిచిపోతుంది.

  • వంశపారంపర్యంగా తల్లిదండ్రుల ఎత్తు.. పిల్లల్లో వస్తుంది.
  • పిట్యుటరీ గ్రంథిపైన కణతులు ఏర్పాడినా, తలపై దెబ్బ తగిలినా హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోయి ఎదుగుదల లోపం ఏర్పడుతుంది.
  • రక్తంలో కోలెస్టరాల్ పాళ్లు పెరగడం వల్ల
  • సమతుల ఆహారం అందుబాటులో లేకపోవడం వల్ల
  • మానసిక, శారీరక సమస్యల కారణంగా కూడా ఎదుగుదల నిలిచిపోతుంది.
  • నులిపురుగుల ద్వారా కూడా పిల్లల్లో ఎదుగుదల నిలిచిపోతుంది.
    అదేవిధంగా …. తీసుకున్న ఆహారం జీర్ణం కాకపోవడం, తరుచూ ఇన్‌ఫెక్షన్లకు గురికావడం, క్షయ వంటి వ్యాధితో క్షీణించిపోవడం, రక్తహీనత, కిడ్నీ సమస్యలు, థైరాయిడ్‌ సమస్యలు… పొట్టి తనానికి దారి తీస్తాయి.

జన్యుపరంగా లోపం ఉంటే సరిదిద్దడం కొంచెం కష్టమైన పనే. శరీర నిర్మాణంలోనూ మూలధాతువుల్లో పనిచేసే గ్రోత్‌ హార్మోన్లను ఉత్తేజితం చేయడంలో వ్యాయామం కీలక పాత్ర పోషిస్తుంది. ఒకవేళ ఈ హార్మోన్ లోపం ఉన్నట్లయితే.. హ్యుమర్ రాకింబినెంట్ గ్రోత్ హార్మోన్లుగా పిలిచే కృత్రిమ హార్మోన్లను ఎక్కించడం ద్వారా సమస్యను తొలగించవచ్చు. అలాగే, ఎదుగుదల వేగం పుంజుకునే 3,4 నెలల వయస్సులో … తల్లిపాలతో పాటు పళ్ల రసాలు ఇవ్వాలి. ఉడికించిన కూరగాయల రసం, పప్పుతేట, గంజి వంటి పదార్థాలను కూడా ఇవ్వాలి. 6 నెలల నుంచి పండ్ల రసాలతో పాటు మెత్తగా ఉడికించిన ధాన్యాలు, పప్పులు, చిక్కటి గంజి, ఉడికించిన కూరగాయలు, అరటి, బొప్పాయి, ఆపిల్, మామిడి తదితర పండ్లను గుజ్జుగా చేసిన తినిపించాలి. 9,10 నెలలనుంచి కిచిడీ, అటుకులు, ఇడ్లీ, ఉడికించిన మాంసం, చేపలు తాలింపు, కారం లేకుండా తినిపించాలి. 11,12 నెలలలో పెద్దలు తీసుకునే ఆహారాన్ని కొంచెం మెత్తగా కారం, మసాలాలు లేకుండా పెట్టాలి. ఈ వయసులోనే అన్ని రకాల ఆహార పదార్థాలను పిల్లలకు అలవాటు చేయాలి. ఫలితంగా ఎదుగుదల వేగంగా జరుగుతుంది.

గ్రోత్ హార్మోన్లు అనవసరంగా తీసుకుంటే చెడు ప్రభావాలు చూపే అవకాశాలున్నాయి. పిల్లలు 5 నుంచి 8 ఏళ్ల వయసున్నప్పుడే వైద్యులను సంప్రదించి ఎదుగుదలకు చికిత్స తీసుకోవాలి. చిన్నారుల్లో ఎముక లేతగా ఉన్నప్పుడే గ్రోత్ హార్మోన్ చికిత్స పనిచేస్తుంది. 16 ఏళ్లు దాటిన తర్వాత గ్రోత్ హార్మోన్ చికిత్స చేయించడం వల్ల ప్రభావం అంతగా ఉండదని గుర్తెరగాలి. 18 ఏళ్లు దాటిన తర్వాత ఎత్తును పెంచే మందులుగానీ, మాత్రలు గానీ లేవని మరచిపోవద్దు.

పిల్లలకు ఇంకా వయసు రాలేదుగా… వారే పెరుగుతారులే… అంటూ నిర్లక్ష్యం చేయడం తల్లిదండ్రులకు తగదు. పుట్టిన నాలుగేళ్ల తర్వాత ప్రతీ ఏడాది కనీసం నాలుగు సెంటీమీటర్ల చొప్పున పెరగాలి. అలా పెరగనిపక్షంలో వారి ఎదుగుదలలో లోపం ఉన్నట్లుగా గుర్తించి వైద్యుడ్ని సంప్రదించాలి.

Leave a Comment