HAPPINESS IN 60’S : వృద్ధాప్యంలో వచ్చే ఇబ్బందులెన్నో..? ఈ జాగ్రత్తలు తీసుకుంటే దూరమే..!

By manavaradhi.com

Published on:

Follow Us
HAPPINESS IN 60'S

సంతోషంగా .. ఆనందంగా .. ప్రశాంతంగా జీవితం గడపాలి. కానీ ఇది ఎల్లవేళలా సాధ్యమవుతుందా ? జీవితంలోని ఒక్కో దశలో సంతోషం ఒక్కో విధంగా ఉంటుంది. వయసు పైబడుతున్నకొద్దీ ప్రశాంతత కోరుకుంటారు. నిజానికి యుక్త వయసులో ఉన్న సంతోషం .. వయసుపైబడుతున్నకొద్దీ దొరికే అవకాశం లేదు. సంతోషం అనేది . . యుక్త వయసు నుంచి మధ్య వయసు .. వృద్ధాప్యం వచ్చే దాదాపు పదేళ్ల కాలాన్ని తీసుకుంటే .. ఇది యూ ఆకారంలో ఉంటుందని అధ్యయనాల్లో వెల్లడైంది. అంటే యుక్తవయసు దాటుతున్న సమయంలో క్రమంగా సంతోషం అనే గ్రాఫ్ కిందకు జారుతుంది. ఆ తర్వాత మధ్య వయసులో స్తబ్దుగా ఉండి.. వృద్ధాప్యంలోకి అడుగుపెడుతున్న సమయంలో మళ్లీ సంతోషం రేఖ పైకి ఎగబాకుతుందని తెలిసింది. ఐతే వృద్ధాప్యం.. అంటే 60 ఏళ్లు దాటిన తర్వాత .. సంతోషాలు జీవితంలో తగ్గిపోతాయని తెలుస్తోంది. ఈ దశలో అనేక అనారోగ్య సమస్యలు చుట్టు ముట్టడం . . ధనం , ఇతరత్రా సమస్యలతోపాటు .. ప్రియమైన వారిని కోల్పోవడం వల్ల ఎక్కువ సవాళ్లు ఎదుర్కుంటున్నారు.

కేన్సర్ సమస్య చాలా వరకు వృద్ధాప్యంలోనే బయటపడుతుంది. రొమ్ము కేన్సర్ లు చాలా మందికి 60 నుంచి 61 ఏళ్ల మధ్యనే తెలుస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. అలాగే పెద్ద ప్రేగు కేన్సర్ లు కూడా దాదాపు 68వ ఏట బయటపడుతున్నాయి. కేన్సర్ వ్యాధి వచ్చిందని తెలియగానే చాలా మంది మానసికంగా కుంగిపోతారు. వారిలో సంతోషం దూరమవుతుంది. కాబట్టి .. వృద్ధాప్యంలోకి అడుగు పెట్టగానే .. కేన్సర్ కు సంబంధించిన పరీక్షలు చేసుకోవడం చాలా ముఖ్యం.

60 ఏళ్లు దాటిన వారికి హృద్రోగ సమస్యలు వచ్చే అవకాశం కూడా ఎక్కువగానే ఉంటుంది. ఈ వయసులోనే చాలా మంది హార్ట్ స్ట్రోక్ కారణంగా మృతి చెందుతున్నారు. గుండె సమస్యలు వస్తాయన్న ఆందోళన కూడా ఈ వయసు వారిలో ఎక్కువగా ఉంటుంది. అందుకే ఆరోగ్యంపై వారు ప్రత్యేక శ్రద్ధ వహించడం చాలా అవసరం. ఆహారం విషయంలోనూ చాలా జాగ్రత్తలు పాటించాలి. కారం, ఉప్పు తగ్గించుకోవడం చాలా మంచిది. అలాగే మంచి కూరగాయలతోపాటు శరీరానికి కావాల్సిన ప్రొటీన్ కోసం మాంసం , చేపలు తీసుకోవాలి. అలాగే ఉదయం పూట లేదా సాయంత్రం పూట వాకింగ్ చేయడం మంచి ఫలితాన్నిస్తుంది. మానసిక ప్రశాంతత కోసం యోగా, ధ్యానం అలవాటు చేసుకోవాలి.

వయసు పైబడుతున్నకొద్దీ .. జ్ఞాపక శక్తి కూడా సన్నగిల్లుతుంది. వీరు ఒక్కోసారి పేర్లు కూడా మర్చిపోతారు. చాలా మందిని గుర్తు పట్టలేని స్థితికి వచ్చేస్తారు. వృద్ధాప్యం పెరుగుతున్నకొద్దీ . . ఈ జ్ఞాపక శక్తి మరింత తగ్గిపోయి.. క్రమంగా అల్జీమర్స్ కు దారి తీస్తుంది.వృద్ధుల్లో కంటి సమస్యలు కూడా ఎక్కువగానే ఉంటాయి. 65 ఏళ్లు దాటిన తర్వాత .. కచ్చితంగా చాలా సమస్యలు ఎదుర్కుంటారు.. ముఖ్యంగా కాటరాక్ట్ , డ్రై ఐస్, గ్లకోమా లాంటి కంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. 50 ఏళ్లు దాటిన వారు . . కచ్చితంగా ఆరు నెలలకోసారి తమ కంటి సమస్యలకు పరీక్షలు చేయించుకోవాలి.

వయసుపైబడిన వారిలో ఎముకలు కూడా గట్టిదనం కోల్పోతాయి. కండరాలు పటుత్వాన్ని కోల్పోతాయి. దీంతో ఎక్కువ దూరం నడవాలన్నా .. కాస్త ఎక్కువగా ఏదైనా పని చేసుకోవాలన్నా ఇబ్బంది పడతారు. ముఖ్యంగా స్త్రీలలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. ఇందుకోసం నడి వయసు నుంచి వృద్ధాప్యంలోకి అడుగు పెడుతున్న వారు విటమిన డి సప్లిమెంట్లు వైద్యుల సూచన మేరకు తీసుకోవాలి. తద్వారా ఆస్టియో పోరోసిస్ లాంటి దీర్ఘకాళిక వ్యాధుల బారి నుంచి కాపాడుకోవచ్చు.

60 ఏళ్లు దాటిన వారిలో జుట్టు సమస్యలు, చర్మ సమస్యలు చాలా సర్వసాధారణం . అంటే జుట్టు సహజత్వాన్ని కోల్పోవడం .. ఎక్కువగా రాలిపోవడం జరుగుతుంది. అంతే కాదు నల్లగా ఉన్న జుట్టు తెల్లగా మారుతుంది. అలాగే చర్మం కూడా గ్లో కోల్పోయి.. వదులుగా తయారవుతుంది. చర్మం లోపల ఉన్న రెండు లేయర్లు ఎపిడెర్మిస్ , డెర్మిస్ .. పలుచగా తయారవుతాయి…

వృద్ధుల్లో వివిధ కారణాల వల్ల నిద్రలేమి సమస్య ఎదురవుతుంది. మానసిక ఒత్తిడి లేదా .. అనారోగ్య సమస్యలు ..లేదా రోజూ వేసుకునే మందులు ఇందుకు కారణం కావచ్చు. నిజానికి వృద్ధులకు 7 నుంచి 9 గంటలు నిద్ర అవసరం . కానీ వారికి అది లభించదు. వయసుపైబడుతున్న కొద్దీ నిద్రకు ఉపయోగపడే మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తి కూడా తగ్గిపోతుంది. నిద్రలేమి కారణంగా వారు సంతోషానికి దూరమవుతారు.

వయసు పెరగడాన్ని ఆపడమనేది మన చేతుల్లో లేకపోయినా .. వృద్ధాప్యంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మన చేతుల్లోనే ఉంటుంది. ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకోవడం . వైద్యుల సలహాలు సూచనలు పాటించడం చేయవచ్చు. సమతుల ఆహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్య ప్రయోజనాలను కాపాడుకోవచ్చు. వీటితోపాటు రోజూ తేలికపాటి వ్యాయామాలు శారీరక , మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి. ఈ చిట్కాలతో వృద్ధాప్యంలోనూ ప్రశాంత జీవితాన్ని ఆస్వాదించవచ్చు.

Leave a Comment