AIDS Symptoms: ఎయిడ్స్‌ను ప్రారంభ దశలో ఎలా గుర్తించాలి.

By manavaradhi.com

Updated on:

Follow Us
HIV & AIDS: Causes, Symptoms, Treatment & Prevention

ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని ప్రచారాలు నిర్వహిస్తున్నా, ఎంత అవగాహన తెస్తున్నా… ఈ వ్యాధికి అడ్డుకట్ట వేయలేకపోతున్నాం. ఈ వ్యాధికి మందులు లేవు సరికదా… కనీసం రోగులకు ఆప్యాయత కూడా కరువౌతోంది. HIV సోకిన వారితో కలిసి జీవించడం వల్ల వ్యాధి సోకే ప్రమాదం లేదని అందరికీ తెలిసినా… ఈ వ్యాధి గురించి ఏదో తెలియని భయం ప్రతి ఒక్కరిలోనూ ఉంది. ఎయిడ్స్ వ్యాధికి సంబంధించిన అపోహలు, వాస్తవాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

హ్యూమన్ ఇమ్యునో డెఫిషియన్సీ వైరస్… ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న ఎయిడ్స్ కు కారణమయ్యే వైరస్ HIV.మనిషి శరీరాన్ని కుంగదీసి, మృత్యుద్వారం వద్ద పడవేసే భయంకరమై మహమ్మారి. మనిషిలోని రోగనిరోధక శక్తిని పూర్తిగా హరించి, దేహాన్ని రోగాలకు గురిచేస్తుంది. HIVలో రెండు రకాల వైరస్ లు ఉంటాయి. మొదటి రకం వైరస్ ను ఎమ్-ట్రాఫిక్ వైరస్ అంటారు. శారీరక ప్రక్రియల్లో ఎన్నో రకాలుగా సహకరించే… మేక్రో ఫేజెస్ కణాల మీద దుష్ప్రభావం చూపిస్తుంది.

రెండోది టి-ట్రాఫిక్ వైరస్. ఇది శరీరంలోని టి-సెల్స్ ను దెబ్బ తీస్తుంది. HIV వైరస్ ఎయిడ్స్ వ్యాధిగా మారిన తర్వాత.. శరీరంలో నిగ్రహ శక్తి తగ్గిపోవడం మొదలౌతుంది. రాత్రి వేళల్లో అధికంగా చెమట పట్టడం, అధికంగా దగ్గులు, ఊపిరి సలపకపోవడం, ఆకలి లేక అలసిపోవడం, బరువు తగ్గడం, తరచూ విరోచనాలు, గొంతునొప్పి, మతిమరుపు, చూపులో మార్పు ఇలా ఒక్కొక్కటిగా రోగి శరీరాన్ని రోగాల నివాసంగా మార్చేస్తుంది. నిజానికి HIV వైరస్ సోకిన వెంటనే అది ఎయిడ్స్ వ్యాధిగా మారదు. ఈ వైరస్ శరీరంలో నిల్వ ఉండి, నెమ్మదిగా శరీరాన్ని ఛిద్రం చేస్తుంది.

ఎయిడ్స్ వ్యాధి రావడానికి కారణాలు ఏంటి ?
ఎయిడ్స్ ఒక రోగం కాదు. కొన్ని రోగాల సమూహం. అరక్షిత లైంగిక సంబంధాల వల్ల మనుషులకు సంక్రమించే వ్యాధి. ఈ వైరస్ ముఖ్యంగా రక్తంలోనూ, శరీర ద్రవాలైన వీర్యం, యోని ద్రవాల్లో ఎక్కువ శాతం ఉంటుంది. లాలాజలం, తల్లిపాలలలో తక్కువ శాతం ఉంటుంది. తెల్లరక్తకణాల్లోని లింఫోసైట్స్ తో దీని పెరుగుదల ముడి పడి ఉంటుంది. రక్తంలోని వివిధ కణాల్లో చేరి, వాటిని నాశనం చేస్తుంది. ఒక వ్యక్తి రక్తంలో ఎయిడ్స్ వైరస్ ఉన్నట్లు తేలితే దాన్ని HIV పాజిటివ్ అంటారు.

శరీరంలో ఈ క్రిములు ఉన్న శాతాన్ని బట్టి దాన్ని ఇన్ ఫెక్షన్ అంటారు. ఈ వ్యాధి ఎక్కువగా అరక్షిత లైంగిక సంపర్కం వల్లనే వ్యాపిస్తుంది. ఓరల్ సెక్స్, గర్భస్థ శిశివులకు తల్లి నుంచి సంక్రమించే ప్రమాదం ఉంది. అంతే గాకుండా రక్తం ద్వారా ఎయిడ్స్ వ్యాపించే ప్రమాదం మరింత ఎక్కువ. సురక్షితం కాని సూదులు వాడడం, పచ్చబొట్లు పొడిపించుకోవడం, క్షవరం చేయించుకోవడం లాంటి సమయాల్లో రక్తం ద్వారా ఒకరి నుంచి మరొకరి ఈ వ్యాధి సోకే ప్రమాదం ఉంది.

ఎయిడ్స్ రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ?
ఒక్కసారి ఎయిడ్స్ వ్యాధి వచ్చిన తర్వాత అది తగ్గదు. ఇందులో ఎలాంటి అనుమానమూ లేదు. అయితే… పోషకాహారం మరియు కొన్ని మందుల ద్వారా దాన్ని అదుపులో ఉంచుకుని మిగిలిన వారితో కలిసి చక్కని జీవనాన్ని సాగించే అవకాశాలైతే పుష్కలంగా ఉన్నాయి. మందు లేని ఈ వ్యాధి నుంచి రక్షణ పొందడం ఒక్కటే మన ముందు ఉన్న మార్గం. దానికి కొన్ని సామాజిక నియమాలను కచ్చితంగా పాటించడం ద్వారా ఈ వ్యాధి నుంచి రక్షణ పొందవచ్చు.

పెళ్ళికి ముందే HIV టెస్ట్ లు చేయించుకోవడం, జీవిత భాగస్వామితో నిజాయితీగా ఉండడం, డిస్పోజబుల్ సిరంజీలు వాడడం, స్త్రీలైతే గర్భం ధరించకుండా ఉండడం లాంటివి పాటిస్తుండాలి. ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులతో మాట్లాడ్డం, కలిసి మెలిసి ఉండడం వల్ల ఈ వ్యాధి ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యాపించదు. అయితే మనం మాట్లాడే ఒక్క మాట వారి జీవితకాలాన్ని మరింత పెంచుతుంది. పైపెచ్చు ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులంతా సామాజికంగా దిగజారిన వారు కాదు. వివిధ కారణాల వల్ల వారు ఈ భారాన్ని మోస్తుంటారు. అందుకే నిశ్శబ్ధాన్ని ఛేదిద్దాం… ఎయిడ్స్ మహమ్మారిని పారద్రోలుదాం.

ఎయిడ్స్ అనేది ఒక వ్యాధి కాదు. వ్యాధినిరోధక శక్తిని హరించే మహమ్మారి. తెలిసో తెలియకో చేసిన పొరపాటు కావచ్చు, ఎవరో చేసిన చిన్న తప్పు కావచ్చు… తమ ప్రమేయం లేకుండానే ఎంతో మంది నరకయాతన అనుభవిస్తున్నారు. కాబట్టి దీనిపట్ల అవగాహానతో సరైన జాగ్రత్తలు తీసుకుంటూ ఆరోగ్యన్ని కాపాడుకోవచ్చు.

Leave a Comment