శరీరంలో రక్తాన్ని శుద్ధి చేసి.. మలినాలను బయటకు పంపే అవయవాలు కిడ్నీలు. ఈ మూత్రపిండాలు బాగుంటేనే శరీరానికి మంచి రక్తం సరఫరా అవుతుంది. అందుకే వీటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. మనం తీసుకునే ఆహార పదార్థాలు, తీసుకునే ఔషధాలు కొన్ని ఇతరత్రా అలవాట్ల వల్ల కిడ్నీలు పాడయ్యే అవకాశం ఉంది. మూత్ర పిండాలు పాడవడానికి కారణాలేంటి? వాటిని ఎలా కాపాడుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మన శరీరంలో గుండె ఎంత ముఖ్యమో.. మూత్ర పిండాలు కూడా అంతే ముఖ్యం. ఉప్పును ఎక్కువగా వాడటం వల్ల కిడ్నీలు పాడయ్యే అవకాశం ఉంది. ఉప్పు ఎక్కువగా తినే వారిలో రక్తపోటు పెరుగుతుంది. ఫలితంగా గుండె వేగం పెరిగి.. కిడ్నీలకు రక్త ప్రసరణ వేగం పెరుగుతుంది. దీంతో రక్త శుద్ధి సరిగ్గా జరగదు. పైగా రక్తపోటుతో కిడ్నీల్లో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంది. ఈ కారణంగా మూత్ర పిండాలు చెడిపోయి అనారోగ్యానికి దారి తీస్తుంది. ప్రోటీన్ .. శరీరానికి చాలా అవసరం. ఐతే కిడ్నీలు చెడిపోయిన వారు ఆహారంలో ఎక్కువ ప్రొటీన్ తీసుకుంటే వాటిపై మరింత ప్రభావం పడే అవకాశం ఉంది. ఫలితంగా మరింత త్వరగా పాడైపోవచ్చు. ఐతే వైద్యుల సలహా మేరకు తగిన మోతాదులో ప్రొటీన్ తీసుకుంటే మంచిది.
ప్రొటీన్ కోసం గుడ్లు, చేపలు, ధాన్యాలు తీసుకోవచ్చు. ఐతే తక్కువ మోతాదులో ఉండేలా జాగ్రత్త వహించాలి. మద్యం, సిగరెట్ తాగడం .. రెండింటి వల్ల కిడ్నీలకు ప్రమాదమే. ఈ రెండు వ్యసనాలు రక్త ప్రసరణ వేగాన్ని గణనీయంగా నియంత్రిస్తాయి. టైప్ -2 డయాబెటిస్ ను కలిగిస్తాయి. అంతే కాకుండా రక్త ప్రసరణ వేగం తగ్గిపోవడం వల్ల మూత్ర పిండాలు పాడైపోయే అవకాశం ఉంది. కిడ్నీలు పాడైపోతే డయాలిసిస్ మీద ఆధారపడాల్సిందే.
మార్కెట్లో దొరికే శీతల పానీయాలు తాగితే కిడ్నీ సమస్యలు వచ్చి పడతాయి. కూల్ డ్రింక్ లలో ఉండే రసాయనాలు, అధిక చక్కెర శాతం కిడ్నీలను త్వరగా పాడై పోయేలా చేస్తాయి. ఆరోగ్యంగా ఉండే వారిలో కంటే కూల్ డ్రింక్ లు తీసుకునేవారి కిడ్నీలు 30 శాతం తక్కువ సామర్థ్యంతో పని చేస్తాయని పరిశోధనల్లో తేలింది. అందుకే కూల్ డ్రింక్ లు తాగకపోవడం మంచిది.. శరీరానికి నీరు చాలా అవసరం . నీరు అధిక మొత్తంలో తీసుకుంటేనే జీవక్రియలు అన్నీ సక్రమంగా జరుగుతాయి. మంచి నీరు ఎక్కువగా తీసుకోకుంటే కిడ్నీల పని తీరు కూడా మందగిస్తుంది.. కొద్ది రోజుల తర్వాత అవి పాడయ్యే అవకాశం ఉంది. శరీరంలో నీరు తక్కువగా ఉందని సులభంగా గుర్తించవచ్చు. నీటి శాతం తక్కువైతే మూత్రం పసుపు రంగులోకి మారుతుంది. దీన్ని బట్టి శరీరంలో నీరు తక్కువైందని గుర్తు పట్టవచ్చు.
నొప్పి నివారణ కోసం ఉపయోగించే మందులు కూడా మూత్ర పిండాలు చెడిపోయేందుకు కారణమవుతాయి. ఐతే ఈ మందులు వాడవద్దని ఏం లేదు. కానీ వైద్యులు సూచించిన మేరకు వాడుకుంటే మంచిది. ప్రిస్క్రిప్షన్ లేకుండా కొనుగోలు చేసి వాడడం శ్రేయస్కరం కాదు. ఇక కొకైన్, హెరాయిన్ వంటి మాదక ద్రవ్యాలు కూడా కిడ్నీలు పాడైపోయేలా చేస్తాయి. మత్తు పదార్థాలు తీసుకోవడం వల్ల రక్త ప్రసరణ వేగం పెరుగుతుంది. నరాలు చచ్చుబడిపోతాయి. దీంతో కిడ్నీ సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
కండరాలు,బరువు పెరిగేందుకు ఉపయోగించే స్టెరాయిడ్లు కూడా మూత్ర పిండాలు చెడిపోయేలా చేస్తాయి. వాటిలో ఉండే హై డోస్ రసాయనాల వల్ల కిడ్నీలు పాడైపోతాయి. స్టెరాయిడ్స్ తీసుకోవడం వల్ల శరీరంలో ఉన్న ప్రొటీన్ నశించిపోతుంది. పైగా కొలస్ట్రాల్ విపరీతంగా పెరిగిపోతుంది. దీని వల్ల లేనిపోని అనారోగ్య సమస్యలు వస్తాయి.. కాబట్టి స్టెరాయిడ్స్ జోలికి వెళ్లకుండా ఉంటే మంచిది…
శరీరంలో మంచి రక్తం ప్రసరించడం చాలా అవసరం కాబట్టి.. రక్తాన్ని శుద్ధి చేసి.. అన్ని జీవక్రియలు సక్రమంగా ఉండేందుకు సహకరించే కిడ్నీలను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మరీ హై ప్రొటీన్ కాకుండా .. శరీరానికి అవరమైనంత మేరకే తీసుకోవాలి. కిడ్నీలు పాడు చేసే మందులు ఎక్కువగా వాడవద్దు. వైద్యుల సూచన మేరకే వాడుకోవడం మంచిది.