శరీరంలోని అన్ని అవయవాల మాదిరిగా కాళ్లకు కూడా నొప్పులు రావడం సహజం. అయితే శరీరం బరువు లెక్కకు మించి పెరుగడం వల్ల దాన్ని మోయలేక కాలినొప్పులు వస్తాయి. సరైన పద్దతిలో నడక లేకపోవడం, ప్రమాదవశాత్తు దెబ్బలు తగలడం వల్ల కాళ్లకు నొప్పులు వస్తాయి. వీటిని ఎలా నివారించుకోవాలి..? కాలినొప్పులు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?
ప్రస్తుత ఆధునిక యుగంలో వయసు మీదపడిన వారే కాకుండా.. చిన్న వయసు వారిలో కూడా కాళ్లు నొప్పులు సర్వసాధారణంగా మారాయి. కాళ్ల నొప్పులు కొందరిలో తీవ్రంగా ఉంటే.. మరికొందరిలో తక్కువగా ఉంటుంది. కాళ్లనొప్పులు తీవ్రంగా ఉన్నప్పుడు శరీరం యొక్క సామర్థ్యం మీద ప్రభావం చూపుతుంది. శరీరం మొత్తం బరువును కాళ్ల మీద మోపడానికి కుదరదు. కాళ్లనొప్పి వల్ల అసౌకర్యంగా ఉంటుంది. కాళ్ల నొప్పులు ఉన్నప్పుడు కాళ్లలో సలుపు, జలదరింత, కాళ్లు బలహీనంగా అనిపించడం జరుగుతుంది. కాళ్లనొప్పులు సాధారణంగా లెగ్ క్రాంప్స్, కండరాల పట్టివేత, కండాల సలుపు, అలసట, న్యూట్రీషియన్ లోపం, డీహైడ్రేషన్, ఎక్కువ సమయం నిలబడటం వల్ల కాళ్లనొప్పులు వస్తుంటాయి.
ప్రధాన రక్తనాళాలు కాలి కండరాలకు అవసరమైన రక్తాన్నీ, ఆక్సిజన్నూ సరఫరా చేయడం ఏ అంతరాయం కారణంగానైనా లేనప్పుడు కాళ్ల నొప్పలు మొదలవుతాయి. సూక్ష్మరక్తనాళాలు వ్యాధిగ్రస్తం కావడం వల్ల కూడా కాళ్లు నొప్పులు బాధిస్తాయి. డీప్ వీన్ థ్రాంబోసిస్, రెస్ట్లెస్ లెగ్ సిండ్రోం, డయాబెటిస్, ఆర్థరైటిస్, గౌట్, వేరికోస్ వీన్స్, నర్వెస్ డ్యామేజ్ వంటి ఆరోగ్య సమస్యలు ఏర్పడినప్పుడు కూడా కాళ్లు నొప్పులు వస్తుంటాయి. బాగా నడవడం, వ్యాయామం ఎక్కువగా చేయడం వంటి కారణాల వల్ల కూడా కాళ్ల నొప్పులు వస్తాయి. పోషకాహార లోపం వల్ల కూడా కాళ్ల నొప్పి వచ్చేందుకు కారణం అవుతుంది. దీర్ఘకాలంగా మధుమేహంతో ఉన్నవాళ్లు, సిగరెట్, జర్దా వంటి పొగాకు ఉత్పత్తులు వాడే వాళ్లల్లో కాళ్ల నొప్పులు కనిపిస్తాయి.
సరియైున పరిమాణంలో రక్తంలో విటమిన్- డి లేనివారు కూడా ఈ కాళ్ల నొప్పులు, వాపులు, కండరాలు పట్టేయడం వంటి సమస్యలకు గురవుతారు. కొన్ని రకాల ప్రత్యేక వ్యాయామాలు, ఫిజియోథెరపీ, జీవనశైలి మార్పులతోనే ఈ నొప్పులను చక్కదిద్దే అవకాశాలు ఉన్నాయి. కాళ్లనొప్పుల నుంచి ఉపశమనానికి ఐస్ ముక్కలతో 10 నిమిషాలపాటు మర్దన చేసుకోవాలి. మసాజ్ చేసుకోవడం వల్ల మజిల్ డ్యామేజ్ వల్ల వచ్చే కాళ్ల నొప్పి నుండి సత్వరం ఉపశమనం కలిగిస్తుంది. దాంతో పాటు బ్లడ్ సర్య్కులేషన్ మెరుగుపరిచి ఒత్తిడిని, ఆందోళనను తగ్గిస్తుంది. నొప్పుల నుంచి ఉపశమనం పొందేందుకు యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్న టార్క్ చెర్రీ పండ్ల రసాలను తీసుకోవాలి. సిగరెట్ స్మోకింగ్ మానుకోవాలి. నిత్యం పోషకాహారాలు తీసుకొంటూ శరీరం బరువు తగ్గించుకోవాలి.
అస్తమానం శరీరం బరువును మోసే కాళ్లకు తగినంత విశ్రాంతి లేకపోవడం వల్ల కాలినొప్పలు కనిపిస్తుంటాయి. అయితే రాత్రి నిద్ర సమయంలోనే కాకుండా కూర్చున్పప్పుడు కూడా విశ్రాంతి లభించేలా చూసుకోవాలి. చిన్నచిన్న వ్యాయామాలు చేస్తూ కాళ్లకు బలం చేకూర్చడం ద్వారా నొప్పులు రాకుండా చూసుకోవచ్చు.








