బరువు పెరగడానికి కారణాలు ఏమిటి అనే ప్రశ్నకు చాలా మంది నుంచి వచ్చే సమాధానం ఎక్కువగా ఆహారం తీసుకోవడం. కానీ కేవలం ఆహారం ద్వారా మాత్రమే బరువు పెరగరు. దీనికి అనేక కారణాలు ఉంటాయి. వాటిలో నిద్రలేమి, డయాబెటిస్ మొదలుకుని వైద్యపరమైన కారణాలు కూడా అనేకం ఉన్నాయి.
ఆహారంలో జరిగే మార్పులు బరువు పెరగడానికి దారి తీస్తాయనే విషయం మనందరికీ తెలిసింది. ఇది మరింత ఎక్కువైతే ఊబకాయం లాంటి సమస్యలు కూడా పెరుగుతాయి. అయితే ఇది మాత్రమే కాకుండా బరువు పెరుగుదల, ఊబకాయాన్ని ప్రభావితం చేసేవి అనేకం ఉన్నాయి. అలాంటి వాటిలో ప్రధానంగా చెప్పుకోవలసింది హైపో థైరాయిడిజం. థైరాయిడ్ హార్మోన్ జీవక్రియను నియంత్రిస్తుంది. ఈ హార్మోన్ తక్కువగా విడుదల కావడం వల్ల జీవక్రియలు తగ్గడంతో పాటు బరువు పెరగడం లాంటి సమస్యలు ఎదురౌతాయి. అలాగే కుషింగ్స్ సిండ్రోమ్ కూడా అధిక బరువు పెరుగుదలకు కారణం అవుతుంది.
మూత్రపిండాలపై ఉండే అడ్రినల్ గ్రంథులు కార్టిసాల్ అనే హార్మోన్ ను అధికంగా ఉత్పత్తి చేసినప్పుడు ఈ పరిస్థితి ఏర్పడుతుంది. ఇది ముఖం, పొట్ట, శరీరంలోని ఇతర భాగాల్లో కొవ్వును పెంచుతుంది. మోనోపాజ్ కూడా బరువు పెరుగుదలను ప్రభావితం చేస్తుంది. ఈ సమయంలో తక్కువ ఈస్ట్రోజన్ ఉత్పత్తి కారణంగా బొడ్డు చుట్టూ కొవ్వు పేరుకుపోతుంది. ఈ సమయంలో మానసిక పరిస్థితి, సరైన ఆహారం తీసుకోపోవడం లాంటివి అనేక సమస్యలకు కారణం అవుతాయి. పాలిసిస్టిక్ అండాశయ సిండ్రోమ్ సైతం బరువు పెరుగుదలకు కారణం కావచ్చు. ఆండ్రోజెన్ హార్మోన్ ఎక్కువ కావడం వల్ల ఇన్సులిన్ మీద శరీరం నియంత్రణ కోల్పోయి బరువు పెరుగుదల మొదలౌతుంది.
బరువు పెరగడానికి కారణాల్లో నిద్రలేమి కూడా ఒకటి. రాత్రిళ్ళు 6 గంటల కన్నా తక్కువ నిద్రపయే వారికి శరీరంలో కొవ్వు అధికంగా పేరుకుపోతుంది. నిద్ర లేకపోవడం వల్ల శరీరం కార్టిసాల్, ఇన్సులిన్ హార్మోన్లను అధికంగా ఉత్పత్తి చేస్తుంది. ఇది బరువును పెంచుతుంది. అదే విధంగా ఆకలిని కలిగించే హార్మోన్లు సైతం గందరగోళానికి గురయ్యి అధిక ఆహారం తీసుకునేలా చేస్తాయి. స్లీప్ ఆప్నియా కూడా బరువు పెరుగుదలకు కారణంగానే చెప్పుకోవాలి. దీని వల్ల శరీరంలో శ్వాస తగ్గిపోవడానికి ఆస్కారం ఉంటుంది. ఫలితంగా కాలేయ సమస్యలు, గుండె సమస్యలు, అధిక రక్త పోటు సమస్యలకు కారణం అవుతుంది. ఇది అన్ని రకాల హార్మోన్ల మీద ప్రభావం చూపించి సమస్యలను పెంచుతుంది.
డయాబెటిస్ సైతం బరువు పెరుగుదలకు కారణం అవుతుంది. ఇన్సులిన్ లో వచ్చే సమస్యలు ఈ సమస్యను ప్రేరేపిస్తాయి. అలాగే బరువు పెరుగదలకు డిప్రెషన్ కూడా కారణం అవుతుంది. మూడ్ డిజార్డ్ కారణంగా స్ట్రెస్ హార్మోన్ అధికంగా పెరిగి, పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోవడం మొదలౌతుంది. ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు అధికంగా తినడం, సరైన వ్యాయామం లేకపోవడం వల్ల బరువు పెరగడానికి అవకాశాలు ఎక్కువ. ఈ పరిస్థితుల్లో ఏది ఎదురైనా వెంటనే వైద్యుని సంప్రదించడం తప్పనిసరి.
సరైన రక్త ప్రసరణ లేకపోవడం కూడా బరువు మీద ప్రభావం చూపుతాయి. అదే విధంగా ఊపిరి తిత్తుల వ్యాధులు సైతం శరీరం ఉబ్బినట్లుగా చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గుండె, మూత్రపిండాలు, కాలేయం, ఊపిరితిత్తులు వీటిలో ఏ సమస్య వచ్చినా బరువు పెరగే అవకాశాలు ఎక్కువ. జీవక్రియ సిండ్రోమే ఎదురైనప్పుడు గుండెజబ్బులు, స్ట్రోక్ మరియు డయాబెటిస్ ప్రమాదం మరింత పెరుగుతుంది. ఇది బరువును కూడా పెంచుతుంది. అలాగే అనేక చికిత్సల్లో ఉపయోగపడే కార్టికో స్టెరాయిడ్స్ సైతం అదనపు ఆకలిని కలిగించి, బరువు పెరుగుదలకు కారణం అవుతాయి. అలాగే అధికంగా మాత్రలు తీసుకునే వారు కూడా అధిక బరువు బారిన పడే ప్రమాదం లేకపోలేదు. కొన్ని మందులు బరువును ఎందుకు పెంచుతున్నాయో తెలుసుకోవడం కూడా కష్టం అవుతుంది.
ముఖ్యంగా గర్భ నియంత్రణ కోసం వాడే మాత్రలు, యాంటి సైకోటిక్స్, యాంటి డిప్రెసెంట్స్, మూర్చ మందులు, అధిక రక్త పోటు కోసం వాడే బీటా బ్లాకర్స్ లాంటి వాటి వల్ల ఈ సమస్యలు ఎదురు కావచ్చు. ఏ సమస్య ఎదురైనా, బరువు పెరుగుతున్నామనిపిస్తే వైద్యులు పర్యవేక్షణలో కారణం తెలుసుకుని సరైన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఊబకాయం రాకుండా కాపాడుకోవచ్చు. సాధారణంగా ఆహారం ద్వారా మాత్రమే మనం బరువు పెరుగుతున్నారు అనుకుంటాం. ఇందుకు ఇంకెన్ని కారణాలు ఉన్నాయో. మంచి ఆహారం, నిద్ర, వ్యాయామం ద్వారా ఇలాంటి సమస్యలు పరిష్కారం అవుతాయి.