తలనొప్పి రావడం చాలా సహజం. అయితే కొన్ని రకాల తలనొప్పులు త్వరగా తగ్గకుండా వేధిస్తుంటాయి. తగ్గినట్టే తగ్గి మళ్లీ వెంటనే వస్తాయి. వీటిలో మైగ్రేన్ తలనొప్పి చాలా ముఖ్యమైంది. అంతగా బాధించే మైగ్రేన్ వచ్చినప్పుడు ఎలాంటి ఆహారాలు తీసుకోవడం మంచిది.. ఏయే ఆహారాలను దూరం పెట్టాలని అనే అంశాలను ఇప్పుడు తెల్సుకుందాం.
పార్శ్వపు తలనొప్పిగా కూడా పిలుచుకొనే మైగ్రేన్ ప్రభావం తలలో ఏదైనా ఒకవైపున ఉంటుంది. ఇది ఒక రకమైన న్యూరలాజికల్ డిజార్డర్. అలాగే దీర్ఘకాలిక వ్యాధి. ఈ నొప్పి కుటుంబ చరిత్ర కాకుండా ఒత్తిడి, ఆహారం పానీయాలు 30 శాతం వరకు కారణం కావొచ్చని నిపుణులు సెలవిస్తున్నారు. మానసిక ఆందోళన, ఒత్తిడి, జరిగిపోయిన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించడం, డిప్రెషన్, నిద్రలేమి, అధికప్రయాణాలు, సూర్యరశ్మి, స్త్రీలలో హార్మోన్ సమస్యల వల్ల ఈ పార్శ్వపు తలనొప్పి వస్తుంటుంది. నరాలు కొట్టుకుంటూ ఉండడం, వికారం, వాంతులు కావడం, చిన్న చిన్న శబ్దాలను, వెలుతురును భరించలేకపోతుండటం వంటి ప్రధాన లక్షణాలుగా కనిపిస్తాయి. మసకగా కనిపించడం గానీ, మోటార్ డిస్ట్రబెన్స్ గానీ చూస్తుంటాం. పురుషుల్లో కన్నా స్త్రీలలో 3 శాతం ఎక్కువగా ఈ సమస్య కనిపిస్తుంది.
ప్రతి మైగ్రేన్‌ను ప్రేరేపించేవి కొన్ని ఉంటాయి. వాటిలో ముఖ్యంగా ఆహారాలకు నో చెప్పడం ద్వారా మైగ్రేన్ సమస్య తీవ్రతరం కాకుండా చూసుకోవచ్చు. అరటిపండు, బీన్స్, చాక్లెట్, కార్న్, నిమ్మజాతి పండ్లు, కల్చర్డ్ డైరీ ఉత్పత్తులు, టమాటలు, ఉల్లిగడ్డలు, నట్స్, నట్స్ బట్టర్ వంటి ఆహారాలను తీసుకోవడం వల్ల మైగ్రేన్ మరింతగా ప్రేరేపితమై సమస్య తీవ్రమవుతుంది. చీజ్‌లో లభించే థైరామిన్ అనే ప్రొటీన్ కూడా ఇబ్బంది పెడుతుంది. రుచిని పెంచేందుకు అలాగే తాజాగా ఉంచేందుకు వినియోగించే కొన్ని రకాల రసాయనాలు కూడా మైగ్రేన్‌ను ఎక్కువ చేస్తాయి. మోనోసోడియం గ్లుటమైట్ ఎక్కువగా లభించే సోయాసాస్, మాంసం టెండరైజర్లను తీసుకోవడం మంచిది కాదు. నేట్రేట్స్, నైట్రేట్స్ ఎక్కువగా ఉండే ఆహారాల జోలికి వెళ్లకపోవడం ఉత్తమం.
మైగ్రేన్ వ్యాధితో బాధపడుతున్నవారు చక్కెర పదార్థాలు తినకుండా జాగ్రత్తపడాలి. ఆస్పర్టేమ్ అనే కృత్రిమ చక్కెరలు సాధారణ చక్కెర కన్నా 150 శాతం తీయగా ఉండి మైగ్రేన్‌ను మరింతగా ప్రేరేపిస్తాయి. మైగ్రేన్‌తో బాధపడుతున్నవారు తాముతీసుకొనే ద్్వపదార్థాలపై కన్నేసి ఏయే ద్రవాలు ప్రేరేపిస్తున్నాయో జాబితా తయారుచేసుకొని వాటిని దూరం పెట్టాలి. అలాగే బీర్, విస్కీ, వైన్ వంటి ఆల్కహాల్ దుష్పరిణామాలను కలిగిస్తాయి. కెఫైన్ ఉండే కాఫీ వంటి పానీయాలను రోజుకు 20 మిల్లీగ్రాములకు మించి తాగొద్దు. అదేవిధంగా ఆహారపుటలవాట్లను కంట్రోల్ పెట్టుకోవాలి. ఎక్కువగా తినడం గానీ, ఎక్కువగా నీరు తాగడం గానీ, భోజనాల మధ్య ఎక్కువ విరామం ఉండటం వల్ల కూడా మైగ్రేన్ వస్తుందని గుర్తుంచుకోవాలి .
మైగ్రేన్ సమస్య ప్రేరేపితం కాకుండా ఉండేందుకు పోషకాహారాలు తీసుకోవడంతోపాటు తాజా పండ్లను తినడం అలవాటు చేసుకోవాలి. అదేవిధంగా తక్కువ మొత్తంలో ఆహారాన్ని ఎక్కువసార్లు తీసుకొనేలా ప్లాన్ చేసుకోవడం చాలా మంచిది.