కంచంలో నోరూరించే వంటకాలు ఎన్నో ఉన్నా కొందరు మాత్రం.. ఆకలిగా లేదని నిట్టూర్పు విడుస్తుంటారు. సరైన వేళకు ఆహారం తీసుకోక అనేక ఆరోగ్య సమస్యలను కొనితెచ్చుకొంటుంటారు. మరి ఆకలిగా లేకపోవడానికి కారణమేంటి..? జీర్ణక్రియ లోపాలను ఎలా అధిగమించాలి..?
ఏదైనా తినాలి అనిపించే ఒక భావననే ఆకలిగా చెప్పుకోవచ్చు. కాలేయంలో గ్లైకోజన్ నిర్ధిష్ట స్థాయి కంటే తగ్గినప్పుడు కలిగే అనుభూతినే ఆకలిగా చెబుతారు. ఆహారం కడుపులో జీర్ణమైన రెండు గంటల తర్వాతి నుంచే ఆకలి అనే భావన మొదలవుతుంది. పిల్లల్లో ఆకలి లేదనేదాన్ని ఓ సమస్యగా భావిస్తారు.. కానీ 99 శాతం మందిలో అది సమస్యే కాదు. శరీరం జీవక్రియలు నిర్వహించాలంటే వేళకు ఆహారం రూపంలో ఇంధనం సరఫరా చేయాలి. ఆకలి ద్వారా దానికి తగ్గట్లు మనం ఆహారాన్ని అవసరమైన పరిణామంలో ఆరోగ్యకరరీతిలో అందివ్వాల్సి వస్తుంది. సాధారణంగా ఆహారం తీసుకున్న 12 నుంచి 24 గంటల మధ్య ఆకలి పోటు ప్రారంభమవుతుంది.
మనుషుల్లోనే కాకుండా జంతువుల్లో కూడా ఆకలి చలనశీల శక్తిని పెంచుతుంది. తినాలనే కోరికను కొన్నిరకాల మందులు, భావోద్వేగాలతోపాటు పలు ఆరోగ్య సమస్యలు అణిచివేతకు గురిచేస్తుంటాయి. ముఖ్యంగా ఒత్తిడికి గురైన సందర్బాల్లో మెదడు అడ్రినాలిన్ తో పాటు స్రవించే కొన్ని రసాయనాలను విడుదల చేస్తాయి. ఇది గుండె కొట్టుకొనే వేగంపై ప్రభావం చూపి జీర్ణక్రియ మెల్లగా జరిగేలా చేస్తుంది. ఫలితంగా ఆకలి వేయదు. ఇక యాంటీ బయోటిక్స్, యాంటీ ఫంగల్స్‌తోపాటు కండరాలకు ఉపశమనం కలిగించే కొన్ని రకాల మందులు వాడిన వారిలో కూడా ఆకలిగా ఉండదు. జలుబు, ఫ్లూ జ్వరంతో బాధపడుతున్నప్పుడు గానీ శరీరంలో సైటోకైన్ విడుదలై మనల్ని అలసిపోయేలా చేసి ఆకలిని మందగిస్తుంది. గర్భంతో ఉన్నవారు ఏది తిన్నా వికారంగా ఉండటం వల్ల ఆకలిగా ఉండదు. థైరాయిడ్ హర్మోన్ విడుదల తక్కువగా ఉన్నప్పుడు ఆహారం సక్రమంగా జీర్ణంకాక ఆకలి మందగిస్తంది.
మైగ్రేన్ ఉన్నవారిలో తలనొప్పి ఎక్కువగా ఉండటం, వాంతులు కావడంతో ఆహారం తీసుకోవాలని అనిపించదు. మైగ్రేన్ తగ్గిపోయిన తర్వాత రెండు, మూడు రోజుల వరకు విపరీతమైన ఆకలి వేస్తుంది. రక్తహీనతతో బాధపడేవారిలో కూడా ఆకలి కనపించదు. ఏది తినాలన్నా ఇష్టం ఉండదు. అలాగే క్యాన్సర్‌తో బాధపడేవారిలో ఆకలి వేయకపోవడం సాధారణంగా కనిపించే సమస్య. వృద్ధుల్లో జీర్ణక్రియ వేగం తగ్గిపోయి ఆకలి మందగిస్తుంది. హై షుగర్‌తో బాధపడే వారిలో నరాలు దెబ్బతిని ముఖ్యంగా పొట్టను కంట్రోల్ చేసే వెగాస్ నరం దెబ్బతిని ఆకలి వేయదు. వీటితోపాటు కడుపు సంబంధ సమస్యలు నొప్పులు, వాంతులు, విరేచనాలు, డయోరియా, గ్యాస్ట్రోఎంట్రైటీస్ వంటి సమస్యలు కనిపించినప్పుడు కూడా ఆకలి ఉండదు. డిప్రెషన్‌తో ఉన్నప్పుడు తినాలన్న కోరిక నశించిపోయి ఆకలి వేయదు. అపస్మారకస్థితిలో ఉన్నప్పుడు కూడా ఆకలి భావన మనలో కనిపించదు. ఇలాంటి లక్షణాలేవైనా కనిపించగానే వెంటనే వైద్యుడ్ని సంప్రదించి తగు చికిత్స తీసుకోవాలి.
ఆకలి అనేది శరీరానికి సంబంధించిన చాలా ముఖ్యమైన అంశం. ఆకలి వేయడం లేదు పోనీలే అనుకొంటే మరిన్ని సమస్యలను కొనితెచ్చుకున్నట్టే అని భావించాలి.








