Restless Leg Syndrome : మీరు నిరంతరం కాళ్లు ఊపుతున్నారా? – అయితే మీకు ఆ సమస్య ఉన్నట్టే!

By manavaradhi.com

Updated on:

Follow Us
Restless legs syndrome

కాళ్ళు కదల్చకుండా ఉండలేకుండా ఉండడం కూడా ఒక వ్యాధే…. దీన్నే రెస్ట్ లెస్ లెగ్స్ సిండ్రోమ్ అంటారు. కాళ్ళలో ఏర్పడే ఒక రకమైన అసౌకర్యం కారణంగా పదే పదే కాలు కదపాలనిపిస్తుంది. మరీ ముఖ్యంగా చీకటిపడ్డాక బాగా పెరుగుతుంది. కూర్చున్నా, పడుకున్నా ఈ సమస్య వెంటాడుతుంది. నడుస్తూ ఉంటే కాస్త ఉపశమనం కలుగుతుంది. అసలు ఇంతకీ రెస్ట్ లెస్ లెగ్స్ సిండ్రోమ్ రావడానికి కారణాలు ఏంటి? దీని విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?

కాలు కదిపి తీరాలనే ఆరాటం కలిగిస్తుంది కనుక ఈ సమస్యకు రెస్ట లెస్ లెగ్ సిండ్రోమ్ అంటారు. కొద్దిసేపు కూడా కుదురుగా కూర్చోలేకపోవడం.. కాళ్లు అటూ ఇటూ కదిలిస్తుండడం.. నిద్రపోయినా కాళ్లు కదిలిస్తూనే ఉండడం.. అటూ ఇటూ తిరిగి పడుకుంటూ కాళ్లు ముడుచుకోవడం.. కాళ్లు కదపకుండా ఉంటే ఏదో అసౌకర్యంగా, ఒక్కోసారి నొప్పిగా కూడా ఉండడం.. కాళ్లు కదపగానే ఈ ఫీలింగ్ తగ్గిపోయి కాసేపు కదలకుండా ఉంటే మళ్లీ రావడం.. ఇవన్నీ లెస్ లెగ్ సిండ్రోమ్ లక్షణాలు.

ఈ సమస్యతో భాదపడుతున్నవారికి రాత్రిపూట దీని లక్షణాలు ఎక్కువవుతాయి. ఇది నాడీ సంబంధిత రుగ్మత. చాలా మంది దీనితో బాధపడుతున్నా.. తమకు ఈ రుగ్మత ఉందని గుర్తించలేరు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని ఇబ్బంది పెడుతున్న ఈ సిండ్రోమ్ కారణంగా నిద్రలేమి, కాళ్ల నొప్పులు, కుదురుగా కూర్చుని పనిచేయలేకపోవడం వంటి ఎన్నో సమస్యలు తలెత్తుతాయి.

కొద్దిసేపు కదలకుండా కూర్చుంటే.. మళ్లీ మొదలవుతుంది. తొలుత అసౌకర్యంగా, ఇబ్బందిగా మొదలయ్యే ఈ రుగ్మత కొందరిలో నొప్పిగా కూడా మారుతుంది. వాస్తవానికి ఈ రెస్ట్ లెస్ లెగ్ సిండ్రోమ్ ఎందుకు వస్తుందనేదానికి కచ్చితమైన నిర్ధారణ ఏదీ లేదు. అయితే ముఖ్యంగా ఐరన్ లోపం, శరీరంలో డోపమైన్ ఉత్పత్తి తగ్గిపోవడంతోపాటు జన్యు పరమైన కారణాలతో వారసత్వంగా వచ్చే అవకాశమున్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ సిండ్రోమ్ తో బాధపడుతున్నవారిలో ఐరన్ లోపం ఉన్నట్లుగా వారు గుర్తించారు. ముఖ్యంగా కండరాలు సరిగా పనిచేయడానికి తోడ్పడే న్యూరోట్రాన్స్ మిటర్ డోపమైన్ ను ఉత్పత్తి చేసే కణాల్లో ఐరన్ లోపం ఉన్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

  • రెస్ట్ లెస్ లెగ్ సిండ్రోమ్ తో బాధపడుతున్న వారిలో రక్త హీనత ఉండే అవకాశముంది. అందువల్ల ఐరన్ సప్లిమెంట్లు, ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. రెస్ట్ లెస్ లెగ్ సిండ్రోమ్ తో బాధపడుతున్నవారు వారి జీవన విధానంలో పలు మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. కాఫీలు, ఆల్కాహాల్, పొగాకు ఉత్పత్తుల వినియోగాన్ని బాగా తగ్గించాలి. కండరాలకు విశ్రాంతి కలిగేలా, ఒత్తిడి తగ్గేలా చేసే వ్యాయామం, మసాజ్ లు, వేడి నీళ్ల స్నానం, యోగా, మెడిటేషన్ వంటి వాటితో రెస్ట్ లెస్ లెగ్ సిండ్రోమ్ లక్షణాల నుంచి ఉపశమనం లభిస్తుంది. అతిగా వ్యాయామం చేయడం వల్ల సమస్య ఎక్కువవుతుంది.
  • కాళ్లకు ఒకసారి వేడి కాపడం, మరోసారి చల్లగా మంచుతో మర్దన చేయడం మంచిది. నిద్రపోయే చోటు పూర్తి అనుకూలంగా ఉండేలా చూసుకోవాలి. రోజూ దాదాపు ఒకే సమయంలో పడుకుని, ఒకే సమయంలో మేల్కోవాలి. వైద్యులు సూచించిన మందులు కచ్చితమైన వేళల్లో, కచ్చితమైన మోతాదుల్లో వాడాలి. మోతాదు ఎక్కువైనా కూడా ఈ రుగ్మత లక్షణాలు మరింతగా పెరుగుతాయి.
  • ఏ వయసు లోనైనా రావటానికి వీలున్న ఈ సమస్య సాధారణంగా వయసు పెరిగేకొద్ది మరింత ఇబ్బందికరంగా తయారవుతుంది. జీవనశైలిలో మార్పులు చేసుకోవడం ద్వారా దీన్నించి బయటపడవచ్చు.

Leave a Comment